Share News

మహాజాతరకు నిరంతర విద్యుత్‌

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:21 PM

మేడారం మహాజాతరకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 28,29,30,31 తేదీల్లో మహా జాతర జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. జాతర జరిగే ప్రాంతంలో నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.

మహాజాతరకు నిరంతర విద్యుత్‌

  • మూడు 33/11 కేవీ సబ్‌స్టేషన్ల నుంచి సరఫరా

  • ప్రమాదాల నివారణకు 11కేవీ, 33కేవీ లైన్‌లకు కవర్డ్‌ కండక్టర్స్‌

  • కార్పొరేట్‌ కార్యాలయం నుంచి పర్యవేక్షణ

  • విధుల్లో 350 మంది సిబ్బంది

ములుగు: మేడారం జాతరలో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్‌ అందించేందుకు రూ.5కోట్ల నిధులతో ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈనెల 28నుంచి మేడారం(Medaram) జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతర పరసరాల్లో ఎటు చూసినా విద్యుత్‌ కాంతులు జిగేల్‌ అంటున్నాయి. జాతరను సక్సెస్‌ చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఐదు రోజులు నిర్విరామంగా విధులు నిర్వహించేందు కు సిద్ధమవుతున్నాయి. విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడితే సత్వరమే పునరుద్ధరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.


పర్యవేక్షణకు 50 బృందాలు

జాతర పరిసరాల్లో ఎలాంటి అంతరాయలు లేకుండా ముందస్తుగా నివారించడంతోపాటు అనుకోకుండా అంతరా యం ఏర్పడితే సత్వరమే పునరుద్ధరణ చర్యలు చేపట్టేందు కు 50 బృందాలను సిద్ధం చేశారు. జాతర పరిధిలో 193 ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయగా, కొత్తగా నార్లాపూర్‌లో రూ.2.50 కోట్లతో 33/11కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. వీటి ని రన్‌ చేసేందుకు ఆపరేషన్‌, ప్రాజెక్టు డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఇద్దరు సీజీఎంలు, ఏడుగురు డీఈలు, 20 మంది ఏడీఈ లు, 150మంది ఇంజనీర్లు, మెంటెనెన్స్‌ సిబ్బంది కలిపి 350 మంది వరకు విధుల్లో నిమగ్నం కాబోతున్నట్లు ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం వెల్లడించింది.


నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లకు ఒక బృందం చొప్పున(ఏఈ, ముగ్గురు ఆపరేషన్‌ సిబ్బంది) పర్యవేక్షించనుంది. 33 కేవీ లైన్స్‌ పర్యవేక్షణకు తాడ్వాయి, పస్రా, గోవిందరావుపేట, చెల్పూర్‌, ఏటూరునాగారం, కమలాపూర్‌, ములుగు సబ్‌స్టేషన్‌ల పరిధిలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నామని, ఇవే ప్రాంతాల్లోని ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్‌ల వద్ద విద్యుత్‌ సరఫరా పర్యవేక్షించేందుకు 20 మంది ఇంజనీర్లు, ఆపరేషన్‌ సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర పనుల కోసం సామగ్రిని తరలించేందు కు 30 వాహనాలను కేటాయించారు.


meda3.2.jpg

కార్పొరేట్‌ ఆఫీస్‌ నుంచి పర్యవేక్షణ

విద్యుత్‌ వోల్టేజీ, ఫీడర్‌ లోడ్‌, అంతరాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు హనుమకొండలోని ఎన్పీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్కాడా ద్వారా పర్యవేక్షించనున్నారు. దీనికోసం ఇప్పటికే మేడారంలోని రెండు 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లలో రియల్‌ టైం ఫీడర్‌ మేనేజింగ్‌ సిస్టం(ఆర్‌టీఎ్‌ఫఎంఎస్)ను ఏర్పాటు చేశారు. విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా, వ్యాపారులు విద్యుత్‌ వైర్లకు కొక్కిలు వేయకుండా మేడారం, సమ్మక్క, సారక్క సబ్‌స్టేషన్ల పరిధిలో 26 కిలోమీటర్ల మేర 11కేవీ లైన్స్‌, 15 కిలోమీటర్ల మేర 33కేవీ లైన్స్‌కు ఓపెన్‌ కండక్టర్‌ స్ధానంలో కవర్డ్‌ కండక్టర్‌లు ఏర్పాటు చేశారు.


విద్యుత్‌ ప్రమాదాల నిరోధానికి ఎల్‌టీ లైన్‌ల మధ్య స్పేసర్స్‌ ఏర్పాటు చేశారు. మేడారం, నార్లాపూర్‌, కొత్తూర్‌లోని సబ్‌స్టేషన్‌లను పస్రా 132/33 కేవీ సబ్‌స్టేషన్‌కు అనుసంధానం చేశారు. ప్రత్యామ్నాయం కోసం ములుగు 132/33 కేవీ సబ్‌స్టేషన్‌, కమలాపూర్‌ ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా పొందేలా ఏర్పాట్లు చేశారు. కాగా, కొత్తగా ఏర్పాటు చేసిన నార్లాపూర్‌ సబ్‌స్టేషన్‌ నుంచి పార్కింగ్‌ కేంద్రాలకు, పరిసర ప్రాంతాల్లోని దుకాణాలకు, గ్రామాలకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి.

హమ్మయ్య! పసిడి, వెండి ధరలు తగ్గాయోచ్!

వైసీపీది భూ భక్ష పథకం

Read Latest Telangana News and National News

Updated Date - Jan 23 , 2026 | 12:21 PM