గచ్చిబౌలి ఘటన.. టౌన్ ప్లానింగ్ అధికారి సస్పెన్షన్
ABN , Publish Date - Aug 23 , 2026 | 11:24 AM
గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో అక్రమంగా నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం శనివారం కుప్పకూలడంతో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది.
హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో అక్రమంగా నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం నిన్న (శనివారం) కుప్పకూలడంతో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో పక్కనే ఉన్న భవనానికి కూడా నష్టం జరిగింది. ఈ క్రమంలోనే అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో విఫలమైన మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోశ్ కుమార్‌ను.. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన సస్పెండ్ చేశారు. తక్షణమే ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని కమిషనర్ సృజన తెలిపారు. ఈ సస్పెన్షన్ సమయంలో హెడ్‌క్వార్టర్స్ పరిధి దాటరాదని ఆదేశించారు. మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోశ్ కుమార్ తన అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ వీడొద్దని కమిషనర్ సృజన హుకుం జారీ చేశారు.
భారీ క్రేన్‌తో ఆ నిర్మాణాన్ని కూలుస్తున్న అధికారులు
ఈ ఏడంతస్తుల భవన నిర్మాణం దగ్గర నిరంతరాయంగా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ భవనాన్ని అధికారులు పూర్తిగా నేలమట్టం చేయనున్నారు. సాధారణ జేసీబీలతో కూలిస్తే పక్క భవనాలకు కూడా ప్రమాదం పొంచి ఉండటంతో పెద్ద క్రేన్ అవసరమని అధికారులు గుర్తించారు. నిన్న (శనివారం) రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ఈ ఘటన స్థలానికి భారీ క్రేన్ ఆలస్యంగా చేరుకోనుంది. ఈ క్రేన్‌తో ఈ ఏడంతస్తుల భవన నిర్మాణం పక్కన ప్రమాదకరంగా మారిన భవనాన్ని కూడా యంత్రాంగం పూర్తిగా కూల్చేయనుంది.
గచ్చిబౌలి ఘటనపై ప్రభుత్వానికి నివేదిక..
ఈ ఏడంతస్తుల భవనం కూలిన ఘటనపై సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నిర్మాణానికి కనీస అనుమతులు లేకుండానే ఈ బిల్డింగ్ నిర్మిస్తున్నట్లు సీఎంసీ అధికారుల నిర్ధారించారు. సెట్‌బ్యాక్ నిబంధనలు బేఖాతరు చేశారని గుర్తించారు. భవన నిర్మాణంలో తప్పనిసరిగా సెట్‌బ్యాక్ నిబంధనలు పాటించలేదని అధికారులు నిర్ధారించారు. గతంలో టౌన్ ప్లానింగ్ అధికారులు మూడు నోటీసులు ఇచ్చిన బేఖాతారు చేస్తూ ఈ భవనాన్ని నిర్మించారని అధికారులు తెలిపారు.
జూన్ 17వ తేదీన బిల్డర్‌కు ఫైనల్ నోటీస్ ఇచ్చినా నిర్మాణం కొనసాగించినట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా గ్రౌండ్ ప్లస్ ఆరు అంతస్తులు, పెంట్‌హౌస్ నిర్మించారని వెల్లడించారు. నాసిరకం మెటీరియల్‌తో ఈ భవనాన్ని నిర్మించినట్లు ఇంజినీరింగ్ అధికారులు ఈ నివేదికలో తెలిపారు. నాణ్యత లేని నిర్మాణ సామగ్రి ఉపయోగించినట్లు సీఎంసీ అధికారులు నివేదికలో ప్రస్తావించారు. ఈ భవన నిర్మాణ సమయంలో సరైన సాంకేతిక పర్యవేక్షణ లేకపోవడం కూడా భవనం కూలడానికి కారణాల్లో ఒకటని సీఎంసీ అధికారులు చెబుతున్నారు.
వార్తలు కూడా చదవండి...
లండన్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో లివర్‌పూల్ ప్రతినిధుల భేటీ
డీసీహెచ్‌ఎస్‌లు విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు: మంత్రి దామోదర్
ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News