ఫుడ్‌పోర్న్ ఆరోగ్యకరమేనా?
ABN , Publish Date - Sep 23 , 2026 | 09:28 AM
ఆహారాన్ని చూసిన వెంటనే తినాలనిపించేలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఫొటోలు లేదా దృశ్యమాలిక ప్రదర్శనే ఫుడ్‌పోర్న్.
జంక్‌ఫుడ్‌కు బదులు ఆరోగ్యకరమైన ఆహారం వైపు ఫుడ్‌పోర్న్‌తో యువతను ఆకర్షించవచ్చు
అందమైన ఫొటోలు, దృశ్యాలతో ఆహారశైలిలో మార్పులు తేవచ్చు
జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్ సిటీ: ఆహారాన్ని చూసిన వెంటనే తినాలనిపించేలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఫొటోలు లేదా దృశ్యమాలిక ప్రదర్శనే ఫుడ్‌పోర్న్. ఉదాహరణకు పిజ్జా నుంచి చీజ్ సాగుతున్నట్టుగా.. బర్గర్ మధ్యలో క్రిస్పీచికెన్ ముక్క బంగారపు రంగులో నిగనిగలాడుతున్నట్టు..స్మోక్‌లో వేగిన ఎరుపురంగులో పొగలు కక్కుతూ కనిపించే లెగ్‌పీస్.. ఇలా చూడగానే నోరూరించేలా కనిపించే ఫొటోలు, వీడియోలు అదే కోవకు వస్తాయి. ఇలాంటి ఫొటోలు, వీడియోలు ఫుడ్ డెలివరీ లేదా హోటళ్ల యాప్‌లలో భోజనప్రియుల మనుసు దోచేస్తుంటాయి. ప్లేటులో కుదురుకున్న ఆహారం తీరు, రంగు, రూపం చూపు పక్కకు తిప్పుకోనివ్వవు. దాంతో క్షణాల్లో ఆర్డర్ పెట్టి ఆవురావురుమంటూ తినేస్తాం.
ఇదే తరహాలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆకర్షణీయమైన ఫొటోలు, వీడియోలుగా ప్రదర్శించడం ద్వారా పిల్లలు, యువతను ఆకట్టుకోవచ్చా? అంటే! తప్పకుండా ఫుడ్ పోర్న్ ద్వారా జంక్‌ఫుడ్‌కు బదులు ఆరోగ్యకరమైన ఆహారంవైపు వారి దృష్టి మళ్లించవచ్చు అని జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో తేలింది. ఇదే విషయాన్ని మంగళవారం ఐసీఎంఆర్ - ఎన్‌ఐఎన్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. అప్పటివరకు రాగిజావ, సెనగలకూర వంటి బలవర్థకమైన ఆహారాన్ని దగ్గరకు కూడా రానివ్వని వాళ్లు ఫుడ్‌పోర్న్‌కాన్సెప్టును జోడించడం ద్వారా కనీసం రుచి చూడడానికి ఎక్కువమంది అమితాసక్తి కనబరిచినట్లు ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్త డాక్టర్ గవరవరపు సుబ్బారావు చెబుతున్నారు.
పోషకాహారానికి ఫిదా!
ఆరోగ్యకరమైన, అనారోగ్యకరమైన 150రకాల ఆహారపదార్థాల ఫొటోలు ఈ అధ్యయనంలో భాగంగా ముందుగా 43 మంది పాఠశాల విద్యార్థులకు చూపించారు. వారి సూచన మేరకు వాటిల్లో 15 ఫొటోలు ఎంపిక చేశారు. అందులో జంక్ ఫుడ్‌తో పాటు చిరుధాన్యాలు, పప్పుదినుసులతో చేసిన వంటలు, డైరీ ఉత్పత్తులుకూడా చాలా ఆకర్షణీయంగా ప్రదర్శించారు. వాటిని దేశ వ్యాప్తంగా 13 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులు 203 మందికి వరుసగా 15రోజులు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్‌చేశారు. వాటిల్లో జంక్‌ఫుడ్ చిత్రాలు, అందంగా, ఆకర్షణీయంగా.. చూడగానే జిహ్వకు పనిపెట్టేలా ప్రేరేపించే ఆరోగ్యకరమైన ఆహారపదార్థాల చిత్రాలు, అవే సాధారణంగా కనిపించేలా మూడు రకాల ఫొటోలు టీనేజర్లకు అందుబాటులో ఉంచారు.
అందులో ఎక్కువమంది ఆకట్టుకునే ఫొటోల వల్ల ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను రుచిచూడాలనుకున్నట్లు అభిప్రాయం వెలిబుచ్చారు. కుర్రాళ్లలో 19మందిని పరిశోధక బృందం ఇంటర్వ్యూ కూడా చేసింది. జైపూర్‌కు చెందిన ఓ 17ఏళ్ల విద్యార్థి స్పందిస్తూ ‘హెల్దీఫుడ్ తినడం బోర్. కానీ ఇందులోని కొన్నిరకాల ఫుడ్ ఫొటోలు చూసిన తర్వాత చిరుధాన్యాలతో వండిన వాటిని రుచిచూడాలని అనిపించింది’ అని చెప్పాడు. మిగతాసమయాల్లో తినడానికి అసలు ఇష్టపడని రాగిజావ, సెనగలకర్రీని ఆకట్టుకునే ఫొటోలు చూసిన తర్వాత వాటిని తినాలన్న ఆసక్తికలిగిందని మరొకరు వెల్లడించారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్లేటులో వడ్డించడంతో పాటు దానిపై గార్నిషింగ్, డ్రెస్సింగ్, రంగు వంటి అంశాలన్నీ యువతను ప్రభావితం చేస్తున్నాయని అధ్యయనంలో గుర్తించినట్లు శాస్త్రవేత్త సుబ్బారావు తెలిపారు.
అందమైన చిత్రాలకే మొగ్గు
అధ్యయనంలో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారపదార్థాల ఫొటోలు కొన్నింటికింద వాటిలోని పోషకవిలువల వివరాలు ప్రకటించారు. కానీ ఆహార ఎంపికలో యువతీయువకులు ప్రధానంగా కంటికి ఇంపుగా కనిపించే ఆహారపదార్థాల వైపు మొగ్గుచూపించారు. అంతకుమించి పోషకవిలువల సమాచారాన్ని కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదని పరిశోధకులు గుర్తించారు. ఎన్‌ఐఎన్ చేపట్టిన ఈ అధ్యయనం ప్రతిష్ఠాత్మక బీఎంసీ జర్నల్‌లోనూ ప్రచురితమైందని జాతీయ పోషకాహార సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను అందంగా, ఆకర్షించే ఫొటోలు, వీడియోల ద్వారా యువతను అటువైపు మళ్లించవచ్చని ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోందని ఎన్‌ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ భారతి కులకర్ణి చెప్పారు. కళాశాల క్యాంటిన్లు, భోజనశాలల్లో ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను రుచిగా వండి వడ్డించడంతో పాటు విద్యార్థుల మనసు దోచేలా వాటి ఫొటోలను ప్రదర్శించడం ద్వారా ఆహారపు అలవాట్లలో సానుకూల మార్పులు తీసుకురావచ్చని ఈ పరిశోధన నిరూపించిందని అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గణేశ నిమజ్జనం వేళ.. బార్లు, వైన్ షాప్‌ల బంద్
Read Latest AP News And Telangana News And International News And Telugu News