నిమ్స్‌లో ‘లక్కీ భాస్కర్’
ABN , Publish Date - Sep 23 , 2026 | 04:15 AM
లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు, అవిగాక పలు అపార్ట్‌మెంట్లలో మరిన్ని ఫ్లాట్లు, స్థలాలు, ఆర్థిక సంస్థల్లో భారీ పెట్టుబడులు, ఖరీదైన కార్లు.. ఓ వైద్యాధికారి ఆస్తుల జాబితా ఇది. వాటి విలువ రూ.100 కోట్లపైనే. నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్ కార్యాలయంతోపాటు నివాసాల్లో సోదాలు జరిపినప్పుడు ఏసీబీ అధికారులు కనుగొన్న ఆస్తుల వివరాలు ఇవి.
అదనపు సూపరింటెండెంట్ అక్రమాస్తులు 100 కోట్లు
హైరైజ్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీల్లో 3 ఫ్లాట్లు
మణికొండ, కూకట్‌పల్లిల్లో మరో 5 ఫ్లాట్లు
తెలంగాణ, ఏపీల్లో 5 ఇళ్ల స్థలాలు
పలువురికి అప్పులుగా రూ.1.33 కోట్లు
ఇంట్లో 517.8 గ్రాముల బంగారు ఆభరణాలు
జాగ్వార్‌తో పాటు నాలుగు ఖరీదైన కార్లు
ఏసీబీ సోదాల్లో వెల్లడి..
డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్ అరెస్ట్
హైదరాబాద్, నిమ్స్, ఎర్రగడ్డ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు, అవిగాక పలు అపార్ట్‌మెంట్లలో మరిన్ని ఫ్లాట్లు, స్థలాలు, ఆర్థిక సంస్థల్లో భారీ పెట్టుబడులు, ఖరీదైన కార్లు.. ఓ వైద్యాధికారి ఆస్తుల జాబితా ఇది. వాటి విలువ రూ.100 కోట్లపైనే. నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్ కార్యాలయంతోపాటు నివాసాల్లో సోదాలు జరిపినప్పుడు ఏసీబీ అధికారులు కనుగొన్న ఆస్తుల వివరాలు ఇవి. ఈ నేపథ్యంలో, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లక్ష్మీభాస్కర్‌ను అరెస్టు చేశారు. మంగళవారం ఏసీబీ అధికారులు ఎర్రగడ్డలోని ఆయన నివాసంతోపాటు బంధువులు, స్నేహితులు, బినామీలు, ఇతర సన్నిహితులకు చెందిన మరో ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
డాక్టర్ లక్ష్మీ భాస్కర్ అక్రమార్జనకు సంబంధించిన వివరాలు భారీగా బయటపడ్డాయి. అక్రమార్జనలో ఎక్కువ భాగాన్ని ఇళ్లు, స్థలాల కొనుగోలు వంటి స్థిరాస్తుల రూపంలోకి మళ్లించడంతోపాటు.. అప్పులు ఇచ్చారని, ఆర్థిక సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని ఏసీబీ విచారణలో వెల్లడైంది. జాగ్వార్‌తో పాటు ఖరీదైన కార్లు అతడి వద్ద ఉన్నాయని తెలిసింది. అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపే లక్ష్మీ భాస్కర్ అక్రమాలపై ఇటీవలే విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందచేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఏసీబీ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. సోదాల వివరాలను ఏసీబీ డైరక్టర్ జనరల్ చారుసిన్హా ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించారు.
నానక్‌రాంగూడలోని హైరైజ్డ్ గేటెడ్ కమ్యూనిటీలో నాలుగు బెడ్‌రూంల ఫ్లాట్, కూకట్‌పల్లిలోని ఓ హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలో 2 ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు, మణికొండ, పేట్‌బషీరాబాద్, కూకట్‌పల్లిలో 5 డబల్‌బెడ్ రూమ్ ఫ్లాట్లు, యాదాద్రి, నందిగామ, శామీర్‌పేటలో 4 ఇళ్ల స్థలాలు, విశాఖపట్నంలో 800 గజాల ఇంటి స్థలం వంటి స్థిరాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. లక్ష్మీ భాస్కర్ బ్యాంకు ఖాతాల్లో రూ.41 లక్షల నగదు ఉంది. పోస్టాఫీసు, మ్యూచువల్ ఫండ్స్, ప్రైవేట్ ఆర్థిక సంస్థల్లో ఆయన రూ.76.55 లక్షల పెట్టుబడులు పెట్టారు. ఇంట్లో 517.8 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. జాగ్వార్‌తో పాటు నాలుగు ఖరీదైన కార్లు, రాయల్ ఎన్‌ఫీల్డ్, యాక్టివా, యమహాతో పాటు నాలుగు ద్విచక్ర వాహనాలు, ఇంట్లో రూ.5లక్షల విలువైన గృహోపకరణాలను గుర్తించామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఓ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు లక్ష్మీభాస్కర్ రూ.1.30కోట్లు పెట్టుబడి పెట్టారని, పలువురికి రూ.1.33 కోట్లు చేతి అప్పులుగా ఇచ్చారని, ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ డాక్యుమెంట్ల ప్రకారం రూ.6.13 కోట్లుగా ఉందని, మార్కెట్ విలువ రూ.100కోట్లు పైన ఉండవచ్చని అధికారులు వెల్లడించారు.
నిమ్స్‌లో కీలక బాధ్యతల్లో..
డాక్టర్ లక్ష్మీ భాస్కర్ ప్రస్థానం నిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మొదలైంది. గత ఫిబ్రవరిలో హెచ్‌ఓడీగా పదోన్నతి పొందారు. నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవ్‌రాజ్ గత నెలలో లక్ష్మీభాస్కర్‌ను హెచ్‌ఓడీ బాధ్యతల నుంచి తొలగించారు. లక్ష్మీభాస్కర్ ఏళ్ల తరబడి కీలకమైన పరిపాలన విభాగంలో ఉంటూ, పలు అక్రమాలకు పాల్పడుతున్నారని గతంలోనే విమర్శలు వచ్చాయి. 2003లో డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఒక రోగి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటుండగా నాటి నిమ్స్ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు స్వయంగా పట్టుకుని సస్పెండ్ చేశారని, తర్వాత ఉద్యోగం నుంచి కూడా తొలగించారని నిమ్స్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
2006లో నాటి ముఖ్యమంత్రికి సన్నిహితుడైన నాయకుడి ద్వారా సిఫారసు చేయించుకుని లక్ష్మీభాస్కర్ మళ్లీ నిమ్స్‌లో ఉద్యోగంలో చేరారని సమాచారం. అప్పటి నుంచి పరిపాలన విభాగాన్ని ఆయన వదలలేదు. అన్‌స్కిల్డ్ కార్మికుల నియామకాల్లో లక్ష్మీ భాస్కర్ చేతివాటం చూపినట్లుగా విజిలెన్స్ విచారణలో వెల్లడైనట్లు సమాచారం. స్కిల్డ్ వర్కర్ల నియామకాల్లోనూ పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశారని, వీటిలో వాటాలు చాలా మందికి వెళ్లాయని విజిలెన్స్ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. లక్ష్మీభాస్కర్ రోజుకో కారులో ఆస్పత్రికి వచ్చేవారని, ఆ కార్లు ఇతర రాష్ట్రాలకు చెందినవిగా తేలిందని, ఈ కోణంలోనూ ఏసీబీ, విజిలెన్స్ విచారణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎంజీఎంలో మళ్లీ ఊడిన పైకప్పు పెచ్చులు!
పుట్టిన గంటల్లోనే నూరేళ్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News