ఎంజీఎంలో మళ్లీ ఊడిన పైకప్పు పెచ్చులు!
ABN , Publish Date - Sep 23 , 2026 | 04:00 AM
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మంగళవారం మరోసారి పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఆరోగ్యశ్రీ వార్డులో ఆదివారం సీలింగ్ పెచ్చులు ఊడిపడి పలువురు గాయపడిన ఘటన మరువకముందే, మంగళవారం మరో రెండు వార్డుల్లో స్లాబు పెచ్చులు ఒక్కసారిగా కింద పడ్డాయి.
ఆర్‌ఐసీయూ, ఫిజియోథెరపీ వార్డుల్లో ప్రమాదం
ఆ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ముప్పు
ఆరోగ్యశ్రీ వార్డు ఘటన మరువక ముందే.. మళ్లీ ప్రమాదం
బాధితుల పరామర్శకు వచ్చిన బీఆర్‌ఎస్, సీపీఎం శ్రేణులు
అడ్డుకున్న పోలీసులు.. ఆస్పత్రి చుట్టూ భారీ భద్రత
వరంగల్ మెడికల్/ హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మంగళవారం మరోసారి పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఆరోగ్యశ్రీ వార్డులో ఆదివారం సీలింగ్ పెచ్చులు ఊడిపడి పలువురు గాయపడిన ఘటన మరువకముందే, మంగళవారం మరో రెండు వార్డుల్లో స్లాబు పెచ్చులు ఒక్కసారిగా కింద పడ్డాయి. ఆస్పత్రిలోని ఆర్‌ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగాల్లో ఈ ఘటన చోటు చేసుకోగా, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో ఆస్పత్రి భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామం తర్వాత ఆస్పత్రి వద్దకు వస్తున్న మీడియా ప్రతినిధులను, ప్రతిపక్షాలను పోలీసులు అడ్డుకుని ఆస్పత్రి చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు.
దీంతో ఎంజీఎం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ శ్రేణులు ఎంజీఎంకు చేరుకోగా, మార్చురీ గేటు వద్ద పోలీసులు వారిని నిర్భందించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఘర్షణలో దాస్యం వినయ్ భాస్కర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సివిల్ దుస్తుల్లో ఉన్న గూండాలు తమపై దాడి చేసి, కాళ్లతో తన్నారని ఆయన ఆరోపించారు. అస్వస్థతకు గురైన ఆయనను ములుగు రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి పోలీస్ వాహనంలోనే తరలించారు. మరోవైపు, ఎంజీఎం ప్రధాన గేటు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టగా, ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని మాజీమంత్రి బీఆర్‌ఎస్ నేత వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘ఆసుపత్రిలో ఉన్న రోగులను పరామర్శించే అంశాన్ని కూడా రాజకీయం చేస్తారా?’ అని ప్రశ్నించారు. ఎంజీఎం ఆస్పత్రిలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వినయ్ భాస్కర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. పోలీసులు కనీస మానవత్వం లేకుండా వ్యవహరించారని, సీనియర్ ప్రజాప్రతినిధితో అలా ప్రవర్తించడం తగదని ఆక్షేపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీవో, ఎంవీఐ, కానిస్టేబుల్ సస్పెన్షన్..!
పుట్టిన గంటల్లోనే నూరేళ్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News