Share News

ఆర్టీవో, ఎంవీఐ, కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌..!

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:34 AM

బండ్లగూడలోని ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీవో)లో సిబ్బందిపై వచ్చిన అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ముగ్గురు అధికారులు, సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు పడింది.

ఆర్టీవో, ఎంవీఐ, కానిస్టేబుల్‌  సస్పెన్షన్‌..!
Bandlaguda RTO

  • బండ్లగూడ ఆర్టీవో ఆఫీసులో నగదు లెక్కింపు ఘటనతో ముగ్గురిపై వేటు

  • ఏసీబీ తనిఖీల సమయంలోనే కమిషనర్‌ ఆదేశాలు

  • అనుమానాస్పద లావాదేవీలు, అవకతవకలను గుర్తించాం

  • ఏసీబీ డీఎస్పీ వెల్లడి

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/చార్మినార్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): బండ్లగూడలోని ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీవో)లో సిబ్బందిపై వచ్చిన అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ముగ్గురు అధికారులు, సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఆర్టీవో కార్యాలయంలో ఓ వైపు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తనిఖీలు జరుగుతున్న సమయంలోనే రవాణా శాఖ కమిషనర్‌ ఇలంబర్తి ముగ్గురిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది. మొదట కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు మోటర్‌ విహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ), ఆర్టీవోను ప్రధాన కార్యాలయానికి అటాచ్‌ చేసిన కమిషనర్‌.. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే ఆ ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు వేశారు.


బండ్లగూడ ఆర్టీవో కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అరుణ్‌ పెద్దమొత్తంలో రూ. 500 నోట్లు లెక్కించడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఏసీబీ అధికారులు సంబంధిత కార్యాలయంలో సోమవారం తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలోని పలు లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని, అవకతవకలు జరిగినట్లు గుర్తించామని ఏసీబీ రంగారెడ్డి రేంజ్‌ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. కొందరు సిబ్బంది వద్ద నగదు కూడా లభించిందన్నారు. విషయం తెలుసుకున్న కమిషనర్‌ ఇలంబర్తి ఈ మేరకు కానిస్టేబుల్‌ అరుణ్‌తో పాటు, ఎంవీఐ భీమ్‌సింగ్‌, ఆర్టీవో రాంచందర్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఓ వైపు ఏసీబీ తనిఖీలు, మరోవైపు ఒకేసారి ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు పడటంతో రవాణా శాఖ కార్యాలయాల్లో సోమవారం ఒకింత టెన్షన్‌ వాతావరణం నెలకొంది.


రవాణా శాఖ కార్యాలయాల్లోకి ఏజెంట్లను అనుమతించవద్దని ప్రభుత్వం, కమిషనర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా... చాలాచోట్ల ఇప్పటికీ పద్ధతి మారలేదు. కొద్దిరోజుల క్రితమే రవాణా శాఖ కార్యాలయాల్లో ఏజెంట్ల వ్యవహారం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు, కమిషనర్‌ ఇలంబర్తి దృష్టికి వెళ్లింది. తాజా ఘటన నేపథ్యంలో రవాణా శాఖ కార్యాలయాల్లోకి ఏజంట్లను అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని, అందుకు సంబంధిత ఆర్టీవోనే బాధ్యత వహించాలని కమిషనర్‌ స్పష్టం చేశారు.


కానిస్టేబుళ్లు, హోంగార్డులదే కీ రోల్‌...

రవాణా శాఖ కార్యాలయాల్లో ఏళ్ల తరబడిగా ఒకేచోట కానిస్టేబుల్‌, హోంగార్డులు విధులు నిర్వహిస్తుండటంతో మొత్తం వారి చేతుల్లోనే వ్యవహారాలు చక్కబడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు 7 నుంచి 10 ఏళ్లుగా ఎలాంటి బదిలీలు లేకుండా ఒకే కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అధికారులు బదిలీ అవుతున్నా... క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించేవారు ఒకేచోట పాతుకుపోవడంతో ఉన్నతాధికారులు ఎన్ని కఠిన నిబంధనలు తెస్తున్నా... అవి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈ-కేవైసీ చేయించలేదా..? మీ నెత్తిన గ్యాస్‌ బండే
సీలింగ్‌ భూములు బడాబాబుల చెరలో!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 05:34 AM