పాలిటెక్నిక్ యథాతథం!
ABN , Publish Date - Sep 22 , 2026 | 05:02 AM
తెలంగాణలో పాలిటెక్నిక్ పర్యవేక్షణ సంస్థలను స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేయకుండా యథాతథంగా కొనసాగించాలని ఉన్నతస్థాయి కమిటీ సూచించింది. జీవో 97లో సవరణలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో పాలిటెక్నిక్ జేఏసీ 35 రోజుల ఆందోళనను విరమించింది.
ఎస్బీటెట్, సాంకేతిక విద్యా శాఖలను స్కిల్స్ వర్సిటీలో
విలీనం చేయొద్దు జీవో 97లో మార్పులు
సూచించిన హైలెవల్ కమిటీ
సీఎంకు నివేదిక అందజేత
35 రోజుల ఆందోళనను విరమించిన జేఏసీ
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకుల ఆందోళనకు కారణమైన జీవో-97లో మార్పులు చేయాలని ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ అభిప్రాయపడింది. పాలిటెక్నిక్ పర్యవేక్షణ సంస్థలైన స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటెట్), సాంకేతిక విద్యా శాఖలను స్కిల్స్ యునివర్సిటీలో విలీనం చేయవద్దని, యథాతథ స్థితిని కొనసాగించాలని కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఉద్యోగుల ప్రయోజనాలు కూడా ఇప్పటి వరకు ఉన్నవిధంగానే కొనసాగించాలని తెలిపింది.
పాలిటెక్నిక్ పర్యవేక్షణ సంస్థలను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొస్తూ గత నెలలో ప్రభుత్వం జీవో 97 జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పాలిటెక్నిక్ విద్యార్థులతోపాటు ఉద్యోగులూ ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ప్రవేశాలు పొందిన విద్యార్థులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. పదోన్నతులు, సీనియార్టీలో అన్యాయం జరుగుతుందని ఉద్యోగులు స్పష్టం చేశారు. ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కే.కేశవరావు నేతృత్వంలో సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేనతోపాటు మరో నలుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ తన నివేదికను సోమవారం ముఖ్యమంత్రికి అందించింది. ప్రధానంగా విద్యార్థులు, ఉద్యోగులు లేవనెత్తుతున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంది. ఇప్పటికే ప్రవేశాలు పొందిన విద్యార్థులను పాత విధానంలో కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో-97కు సవరణలు చేయనుంది. మరోవైపు, ఆందోళనలు విరమించాలన్న కమిటీ విజ్ఞప్తికి స్పందించి.. గత 35 రోజులుగా చేస్తున్న ఆందోళనలను పాలిటెక్నిక్ జేఏసీ సోమవారం విరమించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అంబులెన్స్ అన్‌ఫిట్!
కాంగ్రెస్ నేతల ఆస్తుల వద్దకు బీఆర్‌ఎస్!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News