2047 నాటికి సంపన్న దేశంగా భారత్ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Sep 21 , 2026 | 06:38 AM
స్వాతంత్య్ర స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోనున్న 2047లోపున భారతదేశం సంపన్నదేశంగా మారటం తథ్యమని.., ప్రధాని నరేంద్రమోదీ చెబుతున్నట్లు దేశ ప్రగతి పాత, కొత్తల కలయిక అని, అన్ని రంగాలలో దేశం ముందంజలో ఉందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
చెన్నై, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోనున్న 2047లోపున భారతదేశం సంపన్నదేశంగా మారటం తథ్యమని.., ప్రధాని నరేంద్రమోదీ చెబుతున్నట్లు దేశ ప్రగతి పాత, కొత్తల కలయిక అని, అన్ని రంగాలలో దేశం ముందంజలో ఉందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వేలూరు జిల్లా అరియూర్‌లోని నారాయణి పీఠం ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పీఠాధిపతి శక్తిఅమ్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా కిషన్‌రెడ్డి, కేంద్ర సమాచారశాఖ మంత్రి ఎల్.మురుగన్ పాల్గొన్నారు. జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... గతంలో కంటే ప్రస్తుతం భారతదేశ జీడీపీ రెండు రెట్లు పురోగతిని సాధించిందన్నారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు తిరువళ్లువర్ రచించిన తిరుక్కురళ్ పుస్తకాన్ని ప్రధాని మోదీ కానుకగా అందజేయడంతో తమిళనాడు రాష్ట్ర ఖ్యాతి, గౌరవం మరింత పెరిగాయని పేర్కొన్నారు. కాగా, కేంద్రమంత్రుల సమక్షంలో శక్తిఅమ్మ 800 మంది విద్యార్థులకు రూ.2కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.