ఏఐ విషయంలో తగ్గేదే లేదు: ట్రంప్
ABN , Publish Date - Sep 13 , 2026 | 10:57 PM
ఏఐ అభివృద్ధి విషయంలో వెనక్కు తగ్గేదే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ అభివృద్ధి విషయంలో వెనక్కు తగ్గేదే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మానవాళి శ్రేయస్సు దృష్ట్యా అత్యాధునిక ఏఐ మోడల్స్‌ను అభివృద్ధి చేయకూడదని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా కంటే ముందుండాలంటే ఏఐ అభివృద్ధి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ‘ఏఐ రంగంలో మనం చైనా కంటే ముందున్నాము. అత్యాధుని ఏఐ టెక్నాలజీ ఉన్న దేశం మనమే. యూఎస్ అదే స్థానంలో కొనసాగాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే.. ఏఐ రంగంలో పైచేయి సాధించిన వారిదే అంతిమ విజయం’ అని ట్రంప్ స్పష్టం చేశారు.
ఏఐ అభివృద్ధి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం ట్రంప్ అంగీకరించారు. ఈ సాంకేతికతపై వ్యక్తమవుతున్న కొన్ని భయాలు మాత్రం అతిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రతికూల ధోరణితో కొందరు అనవసర ఆందోళన, భయానికి లోనవుతున్నారని అన్నారు. ఏఐ విషయంలో వెనక్కు తగ్గాలని ఇండస్ట్రీ వర్గాలే ఏకాభిప్రాయానికి వస్తున్న తరుణంలో ట్రంప్ మాత్రం తాము ముందుకు సాగాల్సిందేనని అభిప్రాయ పడటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఏఐ అభివృద్ధిపై ఆంథ్రోపిక్ సీఈఓ డారియో తాజాగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త మోడల్స్ అభివృద్ధిలో వేగం పెరిగిందని అన్నారు. పాత మోడల్స్ సాయంతో కొత్త మోడల్స్‌ను అభివృద్ధి చేస్తుండటం ఇందుకు కారణమని అన్నారు. చివరకు కొత్త మోడల్స్‌ను అర్థం చేసుకునే శక్తి మానవాళికి ఉండకపోవచ్చని కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాము: ఇరాన్ అధ్యక్షుడు
మోదీ ఇచ్చిన బ్రిక్స్ విందుకు జిన్‌పింగ్ ఎందుకు వెళ్లలేదు.. అసలు కారణం ఇదేనా..