Share News

అంబులెన్స్‌ అన్‌ఫిట్‌!

ABN , Publish Date - Sep 22 , 2026 | 04:51 AM

తెలంగాణలో ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తికాని, కాలం చెల్లిన అంబులెన్స్‌లు నడుస్తున్నాయన్న ఆరోపణలతో భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంబులెన్స్‌ల ఫిట్‌నెస్‌, ఇన్సూరెన్స్‌ను డిజిటల్‌గా ట్రాక్‌ చేసి నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

అంబులెన్స్‌ అన్‌ఫిట్‌!
Telangana ambulance

  • ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుండానే రోడ్లపై కూతలు

  • అత్యవసర వాహనాల్లో కాలం చెల్లినవే అధికం

  • తరచూ ప్రమాదాలు.. వాహనాల మొరాయింపు

  • గోల్డెన్‌ అవర్‌లో ప్రాణాలు దక్కడంపై సందేహం

  • ప్రమాదం జరిగితే బీమా పరిహారానికీ ఇబ్బందులు

  • ఏటా ఫిట్‌నెస్‌ పరీక్ష తప్పనిసరి

  • అమలు కాని నిబంధనలు.. సరైన పర్యవేక్షణ కరవు

  • అనుమతులకే రవాణా శాఖ పరిమితం

  • డిజిటల్‌ ట్రాకింగ్‌, కఠిన చర్యలతోనే

  • పరిస్థితి మెరుగుపడే అవకాశం

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆగమేఘాల మీద ఆసుపత్రులకు చేర్చి, ప్రాణాలు నిలపడంలో అంబులెన్స్‌లది కీలక పాత్ర. కానీ, రాష్ట్రంలోని అంబులెన్స్‌లను చూస్తుంటే ఆ భరోసా రావడం లేదు. చాలా వరకు అంబులెన్స్‌లు సరైన ఫిట్‌నెస్‌ లేకుండానే రోడ్లపై పరుగెడుతున్నాయి. దీంతో రోగులను తరలించే సమయంలో జరగరానిది జరిగితే బాధిత కుటుంబాలకు బీమా పరిహారం (ఇన్సూరెన్స్‌) అందడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


ఇటీవల హైదరాబాద్‌ శివారుతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో అంబులెన్స్‌లు ప్రమాదాలకు గురి కావడం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు అంబులెన్స్‌ల ఫిట్‌నెస్‌ (సామర్థ్యం), ప్రమాదం జరిగితే బాధితుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఫిట్‌నెస్‌ లేకపోవడం వల్ల అంబులెన్స్‌లు మధ్యలోనే ఆగిపోవడం, టైర్లు పేలిపోవడం, ఇంజన్‌లో మంటలు, రోడ్డు ప్రమాదాలకు గురికావడం వంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా, వాహన కండీషన్‌ సరిగా లేకపోవడం వల్ల నిర్ణీత వేగంతో వెళ్లలేక దారిమధ్యలోనే మొరాయిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, పక్షవాతం, తీవ్రమైన కాలిన గాయాలు.. తదితర అత్యవసర పరిస్థితుల్లో బాధితుల ప్రాణాలను కాపాడడానికి మొదటి గంట (గోల్డెన్‌ అవర్‌) అత్యంత కీలకం అవుతుంది. కానీ, ఫిట్‌నె్‌సలేని అంబులెన్స్‌లు గంటలోపు బాధితులను ఆసుపత్రికి చేర్చలేకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది.


గడువు చెల్లిపోయినా..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు అంబులెన్స్‌ల్లో చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం అంబులెన్స్‌లకు ఫిట్‌నెస్‌ పరీక్షలు తప్పనిసరి. రవాణా శాఖ అధికారుల వద్ద వాహనాన్ని పరిశీలన చేయించి, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ను పొందాల్సి ఉంటుంది. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. నిబంధనల ప్రకారం ఒక అంబులెన్స్‌ గరిష్టంగా 2.5 లక్షల కిలోమీటర్లు లేదా నిర్ణీత కాలం తర్వాత అత్యవసర సేవల నుంచి తొలగించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో చాలా వరకు 3 లక్షల కిలోమీటర్లకుపైగా తిరిగిన వాటినే ఇంకా వాడుతున్నారు. అంబులెన్స్‌లు అత్యవసర సేవల్లో పనిచేస్తుండడంతో రవాణా శాఖ అధికారులు చాలా సందర్భాల్లో వాటిని ఆపి తనిఖీ చేయడం లేదు.


దీంతో ‘మనల్ని ఎవరు ఆపుతారులే’ అన్న ధీమాతో కాలం చెల్లిన పాత వాహనాలనే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పైగా అంబులెన్స్‌లపై ఏ శాఖకు సరైన పర్యవేక్షణ ఉండటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు అంబులెన్స్‌ల రిజిష్ట్రేషన్‌ వరకే రవాణాశాఖ పరిమితం అవుతోంది. అయితే, ఇటీవలి తరహా ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి అంబులెన్స్‌కు సంబంధించి ఫిట్‌నెస్‌, ఇన్సూరెన్స్‌ వివరాల్ని ఆన్‌లైన్‌లో ఉంచి, గడువు ముగిసేలోపు వాహన యజమానులకు అలర్ట్‌ (సమాచారం) అందించేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఫిట్‌నెస్‌ లేకుండా తిప్పితే లైసెన్సును ఆటోమేటిక్‌గా రద్దు చేయాలి. నిబంధనలు ఉల్లంఘించే అంబులెన్స్‌ నిర్వాహకులపై భారీ జరిమానాతోపాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతోనే పరిస్థితిలో మార్పు వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


ప్రైవేటులోనే అధికం..

ఆరు సీట్ల సామర్థ్యం కలిగిన రిజిస్టర్డ్‌ అంబులెన్స్‌లు రాష్ట్రంలో 1625 ఉన్నాయి. వీటిల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 478 ప్రైవేటు అంబులెన్స్‌లున్నాయి. రంగారెడ్డిలో 254, మేడ్చల్‌లో 150, సంగారెడ్డిలో 66, కరీంనగర్‌లో 62, ఖమ్మంలో 61, భద్రాద్రి కొత్తగూడెంలో 59, మంచిర్యాలలో 59, నల్గొండలో 52, హన్మకొండలో 49, నిజామాబాద్‌లో 37 చొప్పున ఉన్నట్లు రవాణాశాఖ కార్యాలయ అధికారులు వెల్లడించారు. వీటితోపాటు మారుతి మినీ ఇకో అంబులెన్స్‌లో మరో 1000 నుంచి 1500 వరకు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే 108 వాహనాలు 626 వరకు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

జగదీశ్‌రెడ్డికి వందల కోట్ల ఆస్తులు
కాంగ్రెస్‌ నేతల ఆస్తుల వద్దకు బీఆర్‌ఎస్‌!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 04:51 AM