సాహిల్ సూసైడ్ కేసు.. క్షమాపణ చెప్పిన ఐఐటీ బాంబే యాజమాన్యం
ABN , Publish Date - Sep 21 , 2026 | 02:13 PM
స్టూడెంట్ సాహిల్ ఆత్మహత్యపై చేసిన ప్రకటనను ఐఐటీ బాంబే వెనక్కు తీసుకుంది. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఒకరి మృతికి ఇవే కారణాలంటూ నిర్ధారించడం సరికాదని వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే(IIT Bombay) విద్యార్థి సాహిల్ వాకోడే(22) ఆత్మహత్య దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. తాజాగా.. సాహిల్ ఆత్మహత్య అనంతరం చేసిన తమ ప్రకటన వెనక్కు తీసుకుంటున్నామని తెలియజేస్తూ క్షమాపణ కోరింది.
సాహిల్ మృతిపై తొలుత ఐఐటీ బాంబే స్పందిస్తూ.. పరీక్ష సమయంలో సదరు విద్యార్థి ఫోన్ వినియోగించాడని, ప్రశ్నల సమాధానాల కోసం చాట్‌జీపీటీ వాడినట్టు తెలిపింది. దీనిపై అధ్యాపకుడు మాట్లాడితే సాహిల్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించింది. ఈ ప్రకటన సాహిల్ కుటుంబ సభ్యులు, విద్యార్థుల ఆగ్రహానికి దారితీసింది. కుల వివక్ష, వేధింపుల కారణంగా సాహిల్ బలవన్మరణానికి పాల్పడ్డాడని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐఐటీ బాంబే క్షమాపణలు చెప్పింది. ‘మేం ముందు చేసిన వ్యాఖ్యాల్ని వెనక్కు తీసుకుంటున్నాం. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఒకరి మృతికి ఇవే కారణాలంటూ నిర్ధారించడం సరికాదు. సదరు విద్యార్థి ఆత్మహత్య వెనుక అసలు కారణాలు విచారణలోనే తెలుస్తాయి’అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
అలాగే ఐఐటీ బాంబే డైరెక్టర్ రాజీనామా చేశారనే వార్తలపైనా ఆ విద్య సంస్థ స్పందించింది. ఆయన రాజీనామా చేయలేదని స్పష్టం చేసింది. దీనిపై వెలువడిన వార్తల్లో నిజం లేదంది.
కాగా.. గత శనివారం ఐఐటీ బాంబే హాస్టల్ రూమ్‌లో విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విద్యార్థులు క్యాంపస్‌లో నిరసనా కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష్ కేదారే.. నిరసనకారులతో సుదీర్ఘంగా సమావేశమై వారి డిమాండ్లపై చర్చించారు. అకడమిక్ కమిటీలలో విద్యార్థులకు ప్రాతినిధ్యం కల్పించడం, క్యాంపస్‌లో జరిగిన నాలుగు ఆత్మహత్యలపై స్వతంత్ర విచారణ జరపడం, ప్రొఫెసర్ల మానసిక ఆరోగ్యం కోసం వర్క్‌షాప్‌లు నిర్వహించడం వంటి అంశాలు ఈ డిమాండ్లలో ఉన్నాయి.
ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లా సస్పెన్షన్
కాగా.. సాహిల్ పరీక్ష రాస్తున్న సమయంలో పర్యవేక్షకుడిగా ఉన్న ప్రొఫెసర్ సూర్య నారాయణపై ఐఐటీ బాంబే సస్పెన్షన్ విధించింది. సాహిల్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సదరు ప్రొఫెపర్‌పై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. తన కుమారుడిని కులం పేరుతో వేధించారని సాహిల్ తండ్రి ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి
విద్యార్థులను కలిసిన ఐఐటీ బాంబే యాజమాన్యం.. 18 డిమాండ్లపై చర్చలు..
లంచం గౌరవంగా ఇవ్వండి.. కర్ణాటక మంత్రి వ్యాఖ్యలపై దుమారం..