ఉపాధ్యాయులపై వైసీపీ నేతల దాడి.. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఫైర్..
ABN , Publish Date - Sep 21 , 2026 | 01:44 PM
విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. గొడ్డలి పార్టీ నేతలు శాప్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారని ఆగ్రహించారు. ఈ మేరకు వారి తీరును తీవ్రంగా తప్పుపట్టారు.
అమరావతి: విజయవాడలోని శాప్ కార్యాలయం (Sports Authority of Andhra Pradesh) వద్ద వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. గొడ్డలి పార్టీ నేతలు శాప్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారని ఆగ్రహించారు. ఈ మేరకు వారి తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు తెలియజేయవచ్చని, కానీ భౌతిక దాడులకు స్థానం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్యని మంత్రి నిప్పులు చెరిగారు.
వైసీపీ నేతలు ఇంకా తాము అధికారంలో ఉన్నామనే భ్రమలోనే ఉన్నారని మంత్రి జనార్దన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతూ ఉద్రిక్తతలు పెంచడమే వారి లక్ష్యంగా ఉందన్నారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీచర్లను అవమానించేలా, వారి కుటుంబాలను మానసిక క్షోభకు గురి చేసేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భౌతిక దాడులకు పాల్పడే వారి విషయంలో కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదని మంత్రి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.
కాగా, ఏపీలో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నకిలీ ధ్రువపత్రాలతో పలువురు ఉద్యోగాలు పొందారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నేడు శాప్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అయితే, స్పోర్ట్స్ కోటా ద్వారా ఎంపికైన టీచర్లు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతుండగా.. తాము నిజాయితీగా ఉద్యోగాలు పొందామని, తమ వద్ద అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, మెడల్స్ ఉన్నాయని టీచర్లు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మాజీ మంత్రి కారుమూరిని కస్టడీకి తీసుకున్న ఈడీ అధికారులు..
ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు.. ఎప్పటి నుంచో తెలుసా