తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:53 PM
శ్రీకాకుళం జిల్లాకు తుఫాన్ ముప్పు నేపథ్యంలో అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు అప్రమత్తం చేశారు. ఈరోజు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తోపాటు వివిధ శాఖల అధికారులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడి తుఫాన్ పరిస్థితిపై సమీక్షించారు.
శ్రీకాకుళం, సెప్టెంబర్ 21: జిల్లాకు తుఫాన్ ముప్పు నేపథ్యంలో అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు అప్రమత్తం చేశారు. ఈరోజు(సోమవారం) శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తోపాటు వివిధ శాఖల అధికారులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడి తుఫాన్ పరిస్థితిపై సమీక్షించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు, తీర ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైతే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. తుఫాన్ పునరావాస కేంద్రాల్లో మంచినీరు, ఆహారం, విద్యుత్, వైద్యం, పారిశుద్ధ్యంతోపాటు అవసరమైన అన్ని మౌలిక వసతులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
భారీ వర్షాల కారణంగా వాగులు, కాలువలు, నదులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేసి ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచనలు చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా తీర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ అంతరాయాలు, రహదారులపై చెట్లు పడటం, రవాణాకు అంతరాయం వంటి పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందేలా కంట్రోల్ రూంలు, అత్యవసర సేవలను 24 గంటలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలను పాటించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.
ఇవి కూడా చదవండి...
దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై బుధవారం సుప్రీంలో విచారణ
ఏబీఎన్ కథనంతో కదిలిన అధికార యంత్రాంగం.. ఎంజీఎంకు కలెక్టర్
Read Latest AP News And Telugu News