జూరాలలో 9 టీఎంసీల నీళ్లు.. రైతులకు ఎందుకివ్వరు? నిరంజన్ రెడ్డి ఫైర్
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:55 AM
జూరాల ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌కు తాగు, సాగునీటి అవసరాలపై అవగాహన లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 9 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయన్నారు.
వనపర్తి జిల్లా, సెప్టెంబర్ 21: జూరాల ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌కు తాగు, సాగునీటి అవసరాలపై అవగాహన లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఈరోజు(సోమవారం) మీడియాతో మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 9 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయన్నారు. తాగునీటి అవసరాలకు 1.05 టీఎంసీల నీళ్లు మాత్రమే అవసరమని చెప్పుకొచ్చారు. స్థానిక నాయకులకు అవగాహన లేకుండా తొమ్మిది TMCల నీటి నిల్వ ఉంచి.. రైతుల సాగుకు నీళ్లు ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. సాగునీటి అవసరాలకు ఆరు టీఎంసీల నీటిని ఉపయోగించుకోవచ్చని సూచించారు. తాగునీటి అవసరాలకు నీళ్లు లేకపోతే కర్ణాటకలో 150 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని.. అక్కడి ప్రభుత్వాన్ని అడిగి తీసుకునే వెసులుబాటు ఉందని వెల్లడించారు.
ఎమ్మెల్యేలకు, మంత్రులకు సాగునీటిపై కనీసం అవగాహన లేదని నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌కు పేరొస్తుందనే కక్షతో రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం పగ తీర్చుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీటి వంక పెట్టి సాగునీరు ఇవ్వకుండా దొంగ డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు. ‘నీటి లెక్కల విషయంలో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా ఉంటే.. నన్ను జైలుకు పంపండి. లేదంటే మీరు ముక్కు నేలకు రాసి చంపలేసుకుని రైతులకు సాగునీటిని ఇవ్వండి’ అని డిమాండ్ చేశారు.
నీటి వాటాలను తేల్చాల్సిన కేంద్ర ప్రభుత్వం.. పక్క రాష్ట్రాల నేతలతో కుమ్మక్కై తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు.. పోలీసులను అడ్డుపెట్టుకొని బీఆర్‌ఎస్ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని.. వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. జూరాలలో నీళ్లు ఉన్నాయని.. రైతులకు సాగు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘పంటలు ఎండిపోతే.. మీ రాజకీయ భవిష్యత్తు ఎండిపోతుంది. రైతుల ఉసురు తగులుతుంది’ అంటూ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
ప్రజా ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరువలేనిది: కేటీఆర్
దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై బుధవారం సుప్రీంలో విచారణ
Read Latest Telangana News And Telugu News