విజయవాడలో వైసీపీ వర్సెస్ స్పోర్ట్స్ కోటా టీచర్లు.. శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:42 AM
విజయవాడలో స్పోర్ట్స్ కోటా టీచర్ల నియామకాల వ్యవహారం ఒక్కసారిగా హీట్ పెంచింది. శాప్ కార్యాలయం ఎదుట వైసీపీ నాయకులు ఆందోళనకు దిగగా.. తమ సర్టిఫికెట్లు, మెడల్స్ నిజమైనవేనంటూ స్పోర్ట్స్ కోటా టీచర్లు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
విజయవాడ, సెప్టెంబర్ 21: నగరంలో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల వ్యవహారం రాజకీయ నిరసనకు.. టీచర్ల ప్రతిస్పందనకు దారితీసింది. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు, నకిలీ ధ్రువపత్రాల వినియోగం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తూ శాప్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ కోటా ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య పోటాపోటీ నినాదాలు వినిపించాయి. తమ వద్ద నియామకాలకు సంబంధించిన అక్రమాలపై ఆధారాలు ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతుండగా.. టీచర్లు మాత్రం తమ వద్ద ఉన్న ఒరిజినల్ సర్టిఫికెట్లు, మెడల్స్ నిజమైనవేనని స్పష్టం చేశారు.
మరోవైపు పోలీసులు జోక్యం చేసుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసనను అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులతో వైసీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. తమకు వచ్చిన ఉద్యోగాలు క్రీడా ప్రతిభ, అర్హతలు, ధ్రువపత్రాల ఆధారంగానే లభించాయని స్పోర్ట్స్ కోటా టీచర్లు చెబుతున్నారు. గతంలో తాము సాధించిన పతకాలు, పొందిన సర్టిఫికెట్లను కూడా ప్రదర్శిస్తూ తమ నియామకాలపై వస్తున్న ఆరోపణలను వారు ఖండించారు. ఇదిలా ఉండగా, స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థుల అర్హతలను నిబంధనల ప్రకారం పరిశీలిస్తున్నామని, ఏదైనా ధ్రువపత్రం నకిలీగా తేలినా లేదా అర్హత నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించినా తగిన చర్యలు తీసుకుంటామని ఏపీ అధికారులు గతంలో తెలిపారు.
ఇరువర్గాల మధ్య పోటాపోటీ నినాదాల నేపథ్యంలో పోలీసులు శాప్ కార్యాలయం ప్రధాన గేటుకు తాళం వేసి, లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. మరోవైపు తమ స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లను ఎవరైనా పరిశీలించుకోవచ్చంటూ అభ్యర్థులు మైక్ ద్వారా సవాల్ చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది.
‘మాకే సవాల్ చేస్తారా?’ అంటూ వైసీపీ కార్యకర్తలు అభ్యర్థుల వైపు దూసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఓ ఉపాధ్యాయుడి తలకు గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు. తమ ప్రతిభతోనే ఉద్యోగాలు సాధించామని, తమను అవమానించడం బాధ కలిగిస్తోందని స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు వర్గాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
దీపాలకేనా.. హాస్టళ్లకు నిధులు ఉండవా ?
అతి వేగంతో అదుపు తప్పిన బీఎండబ్ల్యూ కారు