Share News

పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం అడ్డగోలుగా దోచుకుంది: రమ్యా రావు

ABN , Publish Date - Sep 21 , 2026 | 01:04 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన చేస్తూ ప్రజల మద్దతు పొందుతుంటే.. 22ఏ అంటూ రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్‌పై టీపీసీసీ సీనియర్ నేత రమ్యారావు మండిపడ్డారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం అడ్డగోలుగా దోచుకుందని విమర్శించారు.

పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం అడ్డగోలుగా దోచుకుంది: రమ్యా రావు

ఇంటర్‌నెట్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన చేస్తూ ప్రజల మద్దతు పొందుతుంటే 22ఏ అంటూ రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్‌పై టీపీసీసీ సీనియర్ నేత రమ్యారావు మండిపడ్డారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం అడ్డగోలుగా దోచుకుందని విమర్శించారు. సోమవారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆమె మాట్లాడారు. ‘మాకు వందల ఎకరాలు ఉన్నాయని కేటీఆర్ అంటున్నారు. నేను కేసీఆర్ సొంత అన్న బిడ్డను. కేటీఆర్ ఆరోపిస్తున్నట్లుగా ఆ వందల ఎకరాలలో మా భూమి ఎక్కడ ఉంది? నేను, కవిత ఇద్దరం ఇంటి వాళ్లం. మేము కాకుండా సంబంధంలేని సంతోష్ రావు కేసీఆర్ దగ్గర ఎందుకు ఉంటున్నాడు? ఆయన అడ్డగోలుగా సంపాదించి నన్ను, కవితను ఇంటి నుంచి బయటకు పంపిస్తే నువ్వు (కేటీఆర్) ఎందుకు మౌనంగా ఉంటున్నావు? నీకు సంతోష్ బినామీనా? ఎందుకు భయపడుతున్నావు?’ అని రమ్యారావు వ్యాఖ్యానించారు.


గ్రామానికి సంబంధంలేని వారు కూడా పట్టాలు తీసుకున్నారు

సంతోష్ రావుకు 2013లో క్వారీలో 25 శాతం వాటా ఉండేదని, 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టులో ముంపుకు గురైందంటూ సంతోష్ ఇంటి వాళ్లందరూ ఇళ్ల పట్టాలు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. కుదురుపాక గ్రామానికి సంబంధం లేని వారు కూడా ప్లాట్లు తీసుకున్నారని విమర్శించారు. కుదురుపాక గ్రామంలో ఒక్క సంతోష్ రావు, ఆయన కుటుంబ సభ్యులు కలిసి 8 ప్లాట్లు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. ‘2018లో సంతోష్ రావుకు రాజ్యసభలో అవకాశం ఇచ్చారు. ఆ సందర్భంగా సంతోష్ ఒక్క ప్లాట్‌ను మాత్రమే అఫిడవిట్‌లో చూపించారు. 8 ప్లాట్లు తీసుకుని ఒక్క ప్లాటే ఎలా చూపించారు? 200 గజాల భూమిని కూడా వదలకుండా అడ్డగోలు అక్రమాలకు పాల్పడ్డారు. అంతేకాకుండా కుదురుపాక గ్రామంలో మెయిన్ రోడ్డులో బాధితుల భూములను అడ్డగోలుగా కొన్నాడు’ అని రమ్యా రావు పేర్కొన్నారు.


చెప్పులు కూడా లేని సంతోష్‌కు కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?

కరీంనగర్‌లో ఉన్నప్పుడు సంతోష్ రావుకు చెప్పులు కూడా లేవని రమ్యా రావు అన్నారు. ఇంట్లో పనిచేసే ఒక పనిపిల్ల డబ్బును కూడా ఆయన గుంజుకున్నారని, అలాంటి మనిషికి ఇప్పుడు కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు. ‘మార్కుక్ గ్రామంలో ఆయనకు 9 ఎకరాల భూమి ఎలా వచ్చింది? బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో భూమి, ఇల్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కరీంనగర్‌లో సింగిల్ బెడ్ రూమ్‌లో ఉన్న ఆయనకు 2018 తర్వాత కొండాపూర్, బంజారాహిల్స్‌లో ఆస్తులు ఎలా వచ్చాయి?’ అని రమ్య నిలదీశారు. అక్కను, చెల్లిని ఇంటి నుంచి బయటకు పంపి సంతోష్ రావును ఎందుకు పక్కన పెట్టుకున్నారని కేటీఆర్‌ను ప్రశ్నించారు. సంతోష్ భార్య రోహిణి పేరు మీద నానక్ రామ్‌గూడలో పెద్ద కమర్షియల్ బిల్డింగ్ ఎలా వచ్చిందని ఆమె నిలదీశారు.


ఇవి కూడా చదవండి...

ప్రజా ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరువలేనిది: కేటీఆర్

దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై బుధవారం సుప్రీంలో విచారణ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 01:10 PM