లంచం గౌరవంగా ఇవ్వండి.. కర్ణాటక మంత్రి వ్యాఖ్యలపై దుమారం..
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:33 PM
కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎం శివలింగే గౌడ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రభుత్వ అధికారులు పనులను సమయానికి పూర్తి చేస్తే వారికి గౌరవంగా లంచం ఇవ్వడంలో తప్పులేదన్నట్లుగా మంత్రి వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎం శివలింగే గౌడ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రభుత్వ అధికారులు పనులను సమయానికి పూర్తి చేస్తే వారికి గౌరవంగా లంచం ఇవ్వడంలో తప్పులేదన్నట్లుగా మంత్రి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ విమర్శలు చేసింది. తాను తప్పకుండా లంచం ఇవ్వాలని ఎక్కడా చెప్పలేదని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని శివలింగే గౌడ వివరణ ఇచ్చారు (Karnataka minister bribery row).
హాసన్ జిల్లా సకలేశ్‌పూర్‌లో జరిగిన 'ప్రజాసేవ ఆందోళన' కార్యక్రమానికి మంత్రి శివలింగే (Shivalinge Gowda) హాజరయ్యారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న సమయంలో ఈ వివాదం మొదలైంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించుకోవడానికి అధికారులు డబ్బులు అడుగుతున్నారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన శివలింగే గౌడ.. అధికారులు తమ విధులు నిర్వర్తిస్తారని, వారికి ఎవరైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే గౌరవంగా ఇవ్వాలని సూచించారు. అయితే అధికారులు బలవంతంగా డబ్బులు తీసుకోకూడదని కూడా ఆయన అన్నారు.
మంత్రి వ్యాఖ్యలపై కార్యక్రమంలోనే కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు ఇప్పటికే జీతాలు తీసుకుంటున్నప్పుడు వారికి అదనంగా టిప్స్ లేదా డబ్బులు ఎందుకు ఇవ్వాలని ఓ రైతు ప్రశ్నించారు. దీంతో సభలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మంత్రి తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అధికారులకు లంచం ఇవ్వాలని తాను చెప్పలేదని, నిజాయితీగా పనిచేసే అధికారులను గౌరవించాలని మాత్రమే చెప్పానని వివరించారు (Karnataka bribe controversy).
వివాదం మరింత పెరగడంతో శివలింగే మరోసారి వివరణ ఇచ్చారు (Shivalinge Gowda remarks). పని పూర్తి చేయడానికి అధికారులకు లంచం ఇవ్వాలని తాను సూచించలేదని చెప్పారు. ఒక వ్యక్తి లంచం అడుగుతున్నారని ఫిర్యాదు చేయగా.. డబ్బులు ఇవ్వవద్దని, అధికారిని గౌరవించాలని మాత్రమే తాను చెప్పినట్లు మంత్రి తెలిపారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ యుద్ధం.. నా ముందు మూడు మార్గాలు: అమెరికా అధ్యక్షుడు
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..