Share News

జగదీశ్‌రెడ్డికి వందల కోట్ల ఆస్తులు

ABN , Publish Date - Sep 22 , 2026 | 04:16 AM

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారంతా ఉన్న ఆస్తులను కోల్పోతే.. బీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం రూ.వందల కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టుకున్నారని కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్‌, ఆయన అనుచర వర్గం రాష్ట్రాన్ని దోచుకుని వందల ఎకరాల భూముల్లో ఫాంహౌ్‌సలు నిర్మించుకున్నారని తెలిపారు.

జగదీశ్‌రెడ్డికి వందల కోట్ల ఆస్తులు
Jagadish Reddy assets

  • 2009లో రూ.12 లక్షల ఆస్తి.. ఇప్పుడు వందల ఎకరాలు

  • పవర్‌ప్లాంట్‌ అనుమతుల్లో దోపిడీ.. ఫాంహౌస్‌ కొనుగోలు

  • సొంత ఊరు తుంగతుర్తిలో 110 ఎకరాలు, అత్తగారి ఊరిలో

  • 80 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా మద్దూరులో 50 ఎకరాలు

  • ఫాంహౌ్‌సలో 11 ఎకరాల ఇనాం భూమి ఆక్రమణ

  • దానిని పేదలకు పంచాలి: కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు

  • ఎర్రవల్లిలో 4 బృందాలతో రైతు వారీ సర్వే షురూ

షాద్‌నగర్‌/షాబాద్‌/నందిగామ, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారంతా ఉన్న ఆస్తులను కోల్పోతే.. బీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం రూ.వందల కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టుకున్నారని కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్‌, ఆయన అనుచర వర్గం రాష్ట్రాన్ని దోచుకుని వందల ఎకరాల భూముల్లో ఫాంహౌ్‌సలు నిర్మించుకున్నారని తెలిపారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తన నియోజకవర్గంలోనే కాకుండా హైదరాబాద్‌కు సమీపంలో కూడా ఫాంహౌ్‌సలు సంపాదించుకున్నారని, ఇవన్నీ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మద్దూరులోని జగదీశ్‌రెడ్డి ఫాంహౌ్‌సను కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది. అనంతరం వారు మాట్లాడుతూ.. ఫాంహౌ్‌సల వద్దకు ఎందుకు వెళుతున్నారని జగదీశ్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారని, అయితే గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రజలకు వివరించేందుకే వెళుతున్నామని చెప్పారు.


జగదీశ్‌రెడ్డి 2009 ఎన్నికల్లో హుజూర్‌నగర్‌లో పోటీ చేసినప్పుడు తన ఆస్తిని రూ.12 లక్షలుగా అఫిడవిట్‌లో చూపించారని, ఇప్పుడు వందల ఎకరాలు ఎలా వచ్చాయని నిలదీశారు. ఎమ్మెల్యే కాకముందు జగదీశ్‌రెడ్డికి సొంతూరిలో రెండు దున్నపోతులు, మూడెకరాల చల్క మాత్రమే ఉండేవన్నారు. కానీ, ఇప్పుడు సొంత ఊరు తుంగతుర్తిలో 110 ఎకరాలు, ఆయన అత్తగారి ఊరు ఇప్పర్తి సమీపంలో 80 ఎకరాలు, షాబాద్‌ మండలం మద్దూరులో 50 ఎకరాలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఈ ఫాంహౌ్‌సలోని సర్వే నంబరు 163, 223లో 11 ఎకరాల ఇనాం భూమి ఉందని తెలిపారు. పేదల నుంచి దోచుకున్న ఈ భూమిని తిరిగి వారికి పంచాలని డిమాండ్‌ చేశారు. జగదీశ్‌రెడ్డి విద్యుత్‌ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పవర్‌ ప్రాజెక్టుల అనుమతుల్లో కోట్లు సంపాదించారని, ఆ డబ్బులతోనే మద్దూర్‌లో భూములు కొనుగోలు చేసి ఫాంహౌస్‌ నిర్మించారని కాంగ్రెస్‌ ప్రతినిధులు ఆరోపించారు.


హైదరాబాద్‌ లాంటి ప్రాంతాల్లో పేదలకు 60 గజాల స్థలం కూడా లేదని, కానీ.. బీఆర్‌ఎస్‌ నేతలకు మాత్రం రెండు, మూడు ఫాంహౌ్‌సల చొప్పున ఉన్నాయని అన్నారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పాల్గొన్నవారు ఆస్తులు కోల్పోయారని, 1600 మంది విద్యార్థులు బలిదానాలు చేశారని వారు గుర్తు చేశారు. గద్దర్‌, ప్రొఫెసర్‌ జయశంకర్‌, కోదండరామ్‌ లాంటి వాళ్లు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా వారికి ఎటువంటి ఆస్తులు లేవని, బీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం గతంలో నవాబులు విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నట్లుగా ఫాంహౌ్‌సలు నిర్మించుకున్నారని విమర్శించారు. నిజాం నవాబు కుటుంబం 200 ఏళ్లలో సంపాదించిన స్థాయిలో ఆస్తులను కేసీఆర్‌ కుటుంబం పదేళ్లలోనే కూడబెట్టిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న నేతలకు ఇప్పటివరకు ఒక్క ఫాంహౌస్‌ కూడా లేదని తెలిపారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఇప్పటికీ సొంత ఇల్లు కూడా లేదని, జగదీశ్‌రెడ్డి మాత్రం ఇందిరమ్మ ఇండ్లనూ వదలడం లేదని ధ్వజమెత్తారు.


ఫాంహౌస్‌ వద్ద సీసీ కెమెరాలు..

జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌ సమీపంలో ఓ విద్యుత్‌ స్థంభానికి ఆదివారం అకస్మాత్తుగా హైరిజల్యూషన్‌ సోలార్‌ సీసీ కెమెరా అమర్చడం చర్చనీయాంశమైంది. సోమవారం కాంగ్రెస్‌ నేతలు వస్తున్నారన్న సమాచారంతోనే ఈ ఆధునిక సీసీ కెమెరాను అప్పటికప్పుడు అమర్చారని స్థానిక వ్యవసాయాధికారులు తెలిపారు. ఒకవేళ తాము ఫాంహౌ్‌సలోకి వెళితే తమపై కేసు పెట్టడానికే ఈ కెమెరాను బిగించారని కాంగ్రెస్‌ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్‌ స్థంభానికి సీసీ కెమెరాను అమర్చడంపై విద్యుత్‌ శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందంలో ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌, బలరాంనాయక్‌, విప్‌లు ఆది శ్రీనివాస్‌, బీర్ల అయిలయ్య, అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామేల్‌, వీర్లపల్లి శంకర్‌, బాలునాయక్‌, నవీన్‌యాదవ్‌ ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డ్రగ్స్‌, సైబర్‌ నిందితులు గాయబ్‌!

430 జీసీసీలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 04:17 AM