Share News

430 జీసీసీలు

ABN , Publish Date - Sep 22 , 2026 | 04:02 AM

ఐటీ, ఫార్మా రంగాల్లో సత్తా చాటిన తెలంగాణ.. ఇప్పుడు ‘గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కూ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది. హైదరాబాద్‌లో 2024- 2026 (ఇప్పటి వరకు) నడుమ 197కు పైగా కొత్త జీసీసీలు ఏర్పాటుకావడమే కాదు..

430 జీసీసీలు
Hyderabad GCC hub

  • వాటిలో 3 లక్షల మంది ఉద్యోగులు

  • జీసీసీల హబ్‌గా తెలంగాణ

  • గత మూడేళ్లలో 197కు పైగా కొత్త కేంద్రాలు, విస్తరణలు

  • ఈ ఏడాది 100 జీసీసీల ఏర్పాటే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఐటీ, ఫార్మా రంగాల్లో సత్తా చాటిన తెలంగాణ.. ఇప్పుడు ‘గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కూ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది. హైదరాబాద్‌లో 2024- 2026 (ఇప్పటి వరకు) నడుమ 197కు పైగా కొత్త జీసీసీలు ఏర్పాటుకావడమే కాదు.. ఇప్పటికే ఉన్న పలు జీసీసీలు తమ కార్యకలాపాలను భారీగా విస్తరించాయి. దీంతో నగరంలో పనిచేస్తున్న జీసీసీల సంఖ్య 430 దాటింది. వీటిలో మూడు లక్షల మందికి పైగా నిపుణులు పనిచేస్తుండగా.. 2024-26 మధ్య కొత్తగా ఏర్పాటైన, విస్తరించిన కేంద్రాల ద్వారా దాదాపు లక్ష ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చినట్లు అంచనా. హైదరాబాద్‌లో జీసీసీల విస్తరణ గత మూడేళ్లుగా వేగంగా కొనసాగుతోంది. 2024లో 70కి పైగా జీసీసీల ఏర్పాటు లేదా భారీ విస్తరణలు చోటుచేసుకోగా.. 2025లో మరో 84 జీసీసీలు ఏర్పాటయ్యాయి. 2026లో ఇప్పటివరకు 43కు పైగా కొత్త కేంద్రాలు, విస్తరణలు నమోదయ్యాయి.


కొత్త రంగాల్లోకీ..

హైదరాబాద్‌లో జీసీసీల స్వరూపం కూడా మారుతోంది. గతంలో ప్రధానంగా ఐటీ, బ్యాక్‌ ఆఫీస్‌ కార్యకలాపాలకే పరిమితమైన జీసీసీలు.. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌, ప్రొడక్ట్‌ ఇంజినీరింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, జనరేటివ్‌ ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డేటా అనలిటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, పరిశోధన-అభివృద్థి, ఫైనాన్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, హెల్త్‌కేర్‌, లైఫ్‌ సైన్సెస్‌, ఇంజినీరింగ్‌ సేవలు, ఇతర కీలక వ్యాపార కార్యకలాపాలను కూడా నిర్వహిస్తున్నాయి. జీసీసీ కార్యకలాపాల్లో బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ రంగాల వాటా అత్యధికంగా 34.5 శాతంగా ఉంది. టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ రంగాల వాటా 23.2 శాతం కాగా.. హెల్త్‌కేర్‌, లైఫ్‌ సైన్సెస్‌, బయోటెక్నాలజీ రంగాలు సుమారు 17 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇంజినీరింగ్‌ ఆర్‌ అండ్‌ డీ, ఇతర అభివృద్థి చెందుతున్న రంగాల వాటా మరో 12.1 శాతంగా ఉంది. మిగిలిన కార్యకలాపాలు తయారీ, వినియోగ ఉత్పత్తులు, లాజిస్టిక్స్‌, మీడియా, రిటైల్‌, ఆతిథ్యం, ఇతర వ్యాపార సేవల రంగాల్లోనూ విస్తరించి ఉన్నాయి.


మారుతున్న ఉద్యోగాల స్వరూపం..

జీసీసీల విస్తరణతో ఉద్యోగాల స్వరూపంలోనూ మార్పు కనిపిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, సాధారణ టెక్నాలజీ నిపుణులతోపాటు.. ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ, సెమీకండక్టర్‌ టెక్నాలజీ, ఫైనాన్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, లైఫ్‌ సైన్సెస్‌, ప్రొడక్ట్‌ డెవల్‌పమెంట్‌, అడ్వాన్స్‌డ్‌ ఇంజినీరింగ్‌ వంటి ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి డిమాండ్‌ పెరుగుతోంది. ప్రతిభే ప్రధాన బలంగా మారుతోంది. నగరంలో అందుబాటులో ఉన్న విస్తృత టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ ప్రతిభ, తక్కువ నిర్వహణ వ్యయాలు, డిజిటల్‌ మౌలిక వసతులు, ఇప్పటికే ఏర్పడిన ఐటీ పర్యావరణ వ్యవస్థ జీసీసీల విస్తరణకు కీలక కారణాలుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళజాతి సంస్థలు కూడా తమ కేంద్రాలను కేవలం సహాయక సేవలకే పరిమితం చేయకుండా.. ప్రపంచస్థాయి వ్యాపార కార్యకలాపాల విస్తృత శ్రేణికి వినియోగిస్తున్నాయి. జీసీసీల పెరుగుదల తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం చూపుతోంది. అధిక విలువ కలిగిన అంతర్జాతీయ కార్యకలాపాలు నగరంలోకి రావడంతో నైపుణ్య ఉద్యోగాలు పెరగడం, సాంకేతిక పెట్టుబడులు రావడం, వాణిజ్య మౌలిక వసతులకు డిమాండ్‌ పెరగడమే కాక.. స్థానిక ప్రతిభకు, సేవలందించే సంస్థలకు కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి.


ఈ ఏడాది 100 కొత్త జీసీసీల ఏర్పాటే లక్ష్యం: సీఎం

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గ్లోబల్‌ కంపెనీల కార్యకలాపాలు శరవేగంగా విస్తరిస్తున్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. గత రెండేళ్లలో నెట్‌ఫ్లిక్స్‌, వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ, లోరియల్‌, ఎలి లిల్లీ, యూనిలీవర్‌ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో కీలక కార్యకలాపాల కేంద్రాలను ఏర్పాటు చేశాయని ఆయన గుర్తుచేశారు. సోమవారం ఆయన ‘బ్లూమ్‌బర్గ్‌’ కథనాన్ని ఉటంకిస్తూ హైదరాబాద్‌లో పెరుగుతున్న పెట్టుబడులు, వ్యాపార కార్యకలాపాలపై స్పందించారు. ఈ ఏడాది హైదరాబాద్‌లో మరో 100 కొత్త గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) ఏర్పాటు చేయించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, క్రియాశీల విధానాలు, ముందస్తు కార్యాచరణతో.. నిర్ణయించిన గడువుకి ముందే లక్ష్యానికి చేరుకునే దిశగా పురోగతి సాధిస్తున్నామని ఎక్స్‌ వేదికగా తెలిపారు. తెలంగాణ కేవలం ప్రపంచ కంపెనీలకు ఆతిథ్యం ఇవ్వడమే కాక భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా అవకాశాలు, నైపుణ్యాలు, పరిశ్రమలను తీర్చిదిద్దుతోందని సీఎం పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డ్రగ్స్‌, సైబర్‌ నిందితులు గాయబ్‌!
ఫ్యూచర్ సిటీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 04:02 AM