Share News

డ్రగ్స్‌, సైబర్‌ నిందితులు గాయబ్‌!

ABN , Publish Date - Sep 22 , 2026 | 03:47 AM

డ్రగ్స్‌, సైబర్‌ నేరాల కేసుల్లో బెయిల్‌పై విడుదలైన పలువురు నిందితులు తర్వాత కోర్టుకు హాజరుకాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నట్లు ప్రత్యేక తనిఖీల్లో వెల్లడైంది. డ్రగ్స్‌ కేసుల్లో 3,228 మంది, సైబర్‌ కేసుల్లో 115 మంది ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి వారెంట్‌ల అమలుపై దృష్టి సారించారు.

డ్రగ్స్‌, సైబర్‌ నిందితులు గాయబ్‌!
Absconding accused Telangana

  • బెయిల్‌ రాగానే జిల్లాలు, రాష్ట్రం దాటి పరార్‌

  • నాన్‌ బెయిలబుల్‌ వారెంటు ఇచ్చినా పట్టింపు లేదు

  • 335 సైబర్‌ నిందితుల్లో 115 మంది జాడే లేదు

  • డ్రగ్స్‌ కేసుల్లో పరారీలో 3,228 మంది

  • వారిలో 292 మంది విదేశీయుల ఆచూకీ లేదు

  • 88 మంది విదేశీయులపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు

  • బెయిల్‌ తర్వాత నిందితుడి కదలికలపై నిఘా ఏది?

  • ఎఫ్‌ఐఆర్‌ నమోదు నుంచి తీర్పు వెలువడే దాకా

  • నిరంతర పర్యవేక్షణ ఉండదా?

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): నిందితులకు అరెస్టయినప్పుడు ఉన్న కంగారు.. కోర్టు నుంచి బెయిలొచ్చినప్పుడు ఉండదు. తదుపరి విచారణకు వెళ్లాలనే ఆందోళన మాత్రం కొంత ఉంటుంది. డ్రగ్స్‌, సైబర్‌ నేరాలకు సంబంధించిన నిందితుల్లో అదీ ఉండటం లేదు. బెయిల్‌ దొరకగానే కోర్టు మెట్లు దిగుతూ స్వేచ్ఛాజీవిగా ఫీల్‌ అయిపోతున్నారు. తర్వాత విచారణ కోసం కోర్టుకే రావడం లేదు. మరి.. నిందితుడు ఎక్కడ? అని ఆరా తీస్తే కోర్టులో పొందుపర్చిన తాలూకు చిరునామాలో దొరకడం లేదు. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ అవుతున్నా ఫలితం ఉండటం లేదు. నిందితుడిని అరెస్టు చేసినప్పటి నుంచి బెయిల్‌ వచ్చేదాకా నిశితంగా పర్యవేక్షిస్తున్న పోలీసులు, ఆ తర్వాత కోర్టుకు హాజరుకాలేదని తెలియగానే నిందితుడి కోసం రోడ్డెక్కుతున్నారు. అప్పటికే సదరు నిందితుడు జిల్లాలు, రాష్ట్రం దాటేసి పత్తా లేకుండా పోతున్నాడు. మాదకద్రవ్యాలు, సైబర్‌ నేరాలకు సంబంధించిన కేసుల్లో ఈ తరహా పరారీలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.


రాష్ట్రంలో నమోదైన డ్రగ్స్‌ కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు, ఇతర దేశాలకు చెందిన 3,228 మంది నిందితులు పరారీలో ఉన్నారని, వీరిలో చాలామందికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ అయ్యాయని ఈగల్‌ అధికారులు చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన నిందితులు 1278 మంది ఉన్నారని, వీరిని పట్టుకునేందుకు గత జనవరి 29 నుంచి ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన ఈగల్‌ అధికారులలు తనిఖీల ప్రక్రియ ప్రారంభించిన నాలుగు రోజుల్లోనే 75 మంది నిందితులను గుర్తించి సంబంధిత పోలీస్‌ స్టేషన్లలో అప్పగించారు. డ్రగ్స్‌ కేసులకు సంబంధించి 2014 నుంచి ఇప్పటిదాకా 329 మంది విదేశీయులను రాష్ట్ర పోలీసులు, మరో 45 మంది విదేశీయులను ఎక్సైజ్‌ అధికారులు అరెస్టు చేశారు. అంటే మొత్తంగా 374 మంది! వీరిలో పోలీసు శాఖ కేసులకు సంబంధించి 252 మంది, ఎక్సైజ్‌ కేసులకు సంబంధించిన 40 మంది.. అంటే మొత్తంగా 292 మంది విదేశీయులు ప్రస్తుతం ఆచూకీ లేకుండా పోయారని అధికార వర్గాలు చెప్పాయి.


వీరిలో ఎక్కువమంది ఇతర రాష్ట్రాలకు మకాం మార్చడం, మారుపేర్లు, ఫేక్‌ పాస్‌పోర్టులతో చెలామణి అవుతుండటంతో పట్టుకోవడం పోలీసులు సమస్యగా మారుతోంది. కొందరు నగదు పూచీకత్తు, సొంత పూచీకత్తు లేదా సరైన నిర్ధారణ లేని పూచీకత్తులతో బెయిల్‌ పొందిన తర్వాత చిరునామాలు మార్చి కనిపించకుండా పోతున్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని కేసుల్లో నిందితుల పాస్‌పోర్టు ప్రతులు, పూర్తి గుర్తింపు వివరాలు అందుబాటులో ఉండకపోవడంతో వారిని తిరిగి గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. బెయిల్‌ సమయంలో నిందితుడి చిరునామా నిర్ధారణ, పూచీకత్తు ఇచ్చిన వ్యక్తి వివరాలు, నిందితుడు కోర్టుకు రాకపోతే పూచీకత్తు ఇచ్చిన వారిపై చర్యలు వంటి విషయాల్లో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


300 బృందాలతో స్పెషల్‌ డ్రైవ్‌

సైబర్‌ నేరగాళ్ల విషయంలోనూ ఇదే తరహా సమస్యను తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. 2024--25 మధ్య రాష్ట్రవ్యాప్తంగా సైబర్‌ నేరాలకు సంబంధించి 3,567 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో తెలంగాణకు చెందిన 614 మంది విషయంలో క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని సీఎ్‌సబీ అధికారులు నిర్ణయించి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. దాదాపు 300 బృందాలను రంగంలోకి దించి తొలి విడతలో 335 మంది నిందితుల వివరాలు తనిఖీ చేశారు. వీరిలో 218 మంది ఆచూకీ లభించగా, 115 మంది వారి చిరునామాల్లో కనిపించలేదు. ముగ్గురు మరణించినట్లు గుర్తించగా, ఒక నిందితుడు నేపాల్‌లో ఉన్నట్లు తేలింది. వీరికి రాష్ట్రంలోని 480 సైబర్‌ కేసులతో పాటు దేశవ్యాప్తంగా 1,233 కేసులతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించారు. ఈ తనిఖీల్లో నిందితులు ప్రస్తుతం ఎక్కడుంటున్నారు? ఏం చేస్తున్నారు? బెయిల్‌ నిబంధనలు పాటిస్తున్నారా? తిరిగి నేరాలకు పాల్పడుతున్నారా? అనే అంశాలను కూడా పరిశీలించారు. తర్వాత సీఎ్‌సబీ అధికారులు నిర్వహించిన మరో విడత ప్రత్యేక తనిఖీల్లో 127 మంది నిందితులను పరిశీలనకు తీసుకున్నారు.


వీరిలో ఇతర రాష్ట్రాల్లో సైబర్‌ నేరాలకు సంబంధించి అరెస్టయిన తెలంగాణకు చెందిన 57 మంది కూడా ఉన్నారు. మొత్తం 127 మందిలో 103 మంది ఆచూకీ లభించగా, మరో 24 మందిని గుర్తించేందుకు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. 2025 ప్రారంభంలో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 1,088 నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉండగా, పాత కేసులను పరిశీలించే క్రమంలో ఏప్రిల్‌ చివరి నాటికి గుర్తించిన మొత్తం పెండింగ్‌ వారెంట్ల సంఖ్య 2,847కు చేరింది. వారెంట్ల అమలుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టి 2,024 మంది నిందితులను కోర్టుల ముందు హాజరుపర్చారు. మిగతా 823 మంది ఆచూకీ లభించలేదు. వీరికి పూచీకత్తు ఇచ్చిన వారికి నోటీసులు ఇవ్వడం, నిందితులను ప్రకటిత నేరస్తులుగా గుర్తించే ప్రక్రియ చేపట్టడం, అవసరమైన సందర్భాల్లో ఆస్తుల జప్తునకు కోర్టులను ఆశ్రయించడం వంటి చర్యలు చేపట్టారు. ఈ పరిశీలనలో 2023కు ముందునుంచే పెండింగ్‌లో ఉన్న 1,408 వారెంట్లు బయటపడ్డాయి. వారెంట్లు ఉన్నవారిలో 52 మంది అప్పటికే మరణించగా, 14 మంది ఇతర జైళ్లలో ఉన్నట్లు గుర్తించారు. విచారణ మధ్యలో పరారైన మరో 13 మందిని తిరిగి పట్టుకున్నారు.


వారెంట్‌ అమలు కాక.. హైకోర్టుకు

నాన్‌ బెయిలబుల్‌ వారెంట్ల అమలులో జాప్యంపై తెలంగాణ హైకోర్టు కూడా ఇటీవల తీవ్రంగా స్పందించింది. మంగళ్‌హాట్‌ పోలీస్‌ ేస్టషన్‌ పరిధిలో చెక్‌ బౌన్స్‌ కేసుకు సంబంధించి కోర్టు జారీ చేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ చాలాకాలం అమలు కాకపోవడంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన తర్వాత వారెంట్‌ అమలైంది. దీనిపై స్పందించిన హైకోర్టు సంబంధిత పోలీసు అధికారి నుంచి వివరణ తీసుకొని, వారెంట్‌ అమలులో జరిగిన జాప్యంపై విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. పోలీసులు తమ చట్టబద్థమైన బాధ్యతను సకాలంలో నిర్వర్తించి ఉంటే బాధితుడు హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చేది కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.


కాగా రాష్ట్ర పోలీసు శాఖలో నేరాలకు సంబంధించిన సమాచారాన్ని డిజిటల్‌గా నమోదు చేసే వ్యవస్థ బలోపేతమైంది. గతంలో 70--80 శాతంగా ఉన్న సీసీటీఎన్‌ఎస్‌ సమాచార నవీకరణ ప్రస్తుతం 96 శాతానికి చేరినట్లు గతనెలలో జరిగిన అర్ధ వార్షిక నేర సమీక్ష సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. నేర సమీక్షను కేవలం గణాంకాలకు పరిమితం చేయకుండా ప్రతి నేరం వెనుక కారణాలు, నేరస్థుల విధానం, దర్యాప్తు తీరు, కేసుల పరిష్కారాన్ని లోతుగా విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో కేసుల సమాచారం 96 శాతం వరకు నవీకరణ జరుగుతున్నప్పుడు.. బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు ప్రస్తుతం ఎక్కడున్నాడు? కోర్టుకు హాజరవుతున్నాడా? చిరునామా మార్చాడా? అతడిపై వారెంట్‌ ఉందా? మరో రాష్ట్రంలో అరెస్టయ్యాడా? జైలులో ఉన్నాడా? మరణించాడా? అనే వివరాలు ఎప్పటికప్పుడు నవీకరించడం కీలకంగా మారుతోంది.


  • ఒక్కడిపైనే 14 వారెంట్లు

హైదరాబాద్‌లో ఇటీవల పట్టుబడిన ఓ పాత గొలుసు దొంగపై ఏకంగా 14 నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడికి 180కి పైగా గొలుసు దొంగతనం కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసు రికార్డులు పేర్కొంటున్నాయి. హైదరాబాద్‌ నుంచి తప్పించుకున్న అతడు బెంగళూరు, అనంతరం ఏపీలోని రాయచోటి ప్రాంతానికి వెళ్లి అక్కడ కూడా నేరాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్ ఫాంహౌస్ భూములపై మా దగ్గర ఆధారాలు.. సమాధానం చెప్పాల్సిందే: పొంగులేటి

ఫ్యూచర్ సిటీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 03:47 AM