Share News

రోడ్డుపై వేధించి.. సోషల్‌ మీడియాలో పెట్టి బిహార్‌లో బాలికపై లైంగిక వేధింపులు

ABN , Publish Date - Sep 22 , 2026 | 02:46 AM

బిహార్‌లోని జమయి జిల్లాలో అమానుష ఘటన వెలుగుచూసింది. కోచింగ్‌ క్లాస్‌ ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులపై (మైనర్లు) కొందరు పోకిరీలు దాడికి తెగబడ్డారు

రోడ్డుపై వేధించి.. సోషల్‌ మీడియాలో పెట్టి  బిహార్‌లో బాలికపై లైంగిక వేధింపులు
bihar

  • ఆమె స్నేహితుడిపైనా దాడి

  • వీడియో వైరల్‌.. పోక్సో కేసు నమోదు

  • ముగ్గురు నిందితుల అరెస్టు

పట్నా, సెప్టెంబరు 21: బిహార్‌లోని జమయి జిల్లాలో అమానుష ఘటన వెలుగుచూసింది. కోచింగ్‌ క్లాస్‌ ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులపై (మైనర్లు) కొందరు పోకిరీలు దాడికి తెగబడ్డారు. వారిని అడ్డుకుని, తీవ్రంగా బూతులు తిడుతూ, బాలికపై అత్యంత దారుణంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. జమయి-లఖిసరాయ్‌ రోడ్డు సమీపంలోని మద్వా పహాడ్‌ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న ఓ బాలుడు, బాలిక తమ స్కూటర్‌పై కోచింగ్‌ క్లాస్‌ ముగించుకుని వస్తుండగా, దుండగుల ముఠా వారిని బలవంతంగా అడ్డుకుంది. పోకిరీలలో ఒకడు ఈ వికృత చేష్టలను తన మొబైల్‌ ఫోన్‌లో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఆ వీడియో కాస్తా సంచలనంగా మారింది. కొందరు బాలుడిని పక్కకు లాగి చొక్కా పట్టుకుని కొడుతుండగా, బాలికను చుట్టుముట్టిన మరికొందరు కీచకులు ఆమెను అసభ్యంగా తాకుతూ ఈడ్చుకెళ్లేందుకు యత్నించినట్లు ఆ వీడియోలో కనిపించింది. అనంతరం వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, ఆకతాయిలు వెంబడించి మరీ పట్టుకున్నారు. ఒకడైతే ఏకంగా బాలికను అసభ్యకరంగా మెడ పట్టుకుని గాల్లోకి లేపి భయభ్రాంతులకు గురిచేశాడు. బాలుడు వెంటనే కలుగజేసుకుని ఆమెను విడిపించాడు.


ఈ క్రమంలో దుండగుడు బాలిక ఛాతీపై చేతులు వేసి వెనక్కి నెట్టాడు. అనంతరం స్కూటర్‌పై వెళ్లిపోదామని ప్రయత్నించినా, బాలిక చేయి పట్టుకుని లాగుతూ వికృత చేష్టలు చేశారు. భయపడిపోయిన సదరు బాలిక ‘‘దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి, మేమిక్కడికి మళ్లీ ఎప్పటికీ రాము’’ అంటూ చేతులు జోడించి ప్రాధేయపడింది. దీంతో కనికరించిన గూండాలు వారిని విడిచిపెట్టారు. వీడియో వైరల్‌ కావడంతో తీవ్రంగా స్పందించిన జమయి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధిత విద్యార్థుల నుంచి వివరాలు సేకరించిన అనంతరం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. వీడియో ఆధారంగా మరో 6-7 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌ వేదికగా తీవ్రంగా స్పందించారు. ‘‘ఇది మన సంస్కృతి కాదు.. ఏ హక్కుతో ఆ మృగాలు ఒక బాలికపై అలా ప్రవర్తించాయి? రాత్రి 7 గంటలకు కూడా రోడ్డుపై వెళ్లే మహిళలకు రక్షణ లేకపోతే బిహార్‌ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇది కేవలం గూండాయిజం కాదు.. ఒక మహిళ శరీరాన్ని, ఆమె స్వేచ్ఛను శాసించవచ్చనే పితృస్వామ్య అహంకారం. వీడియోలో ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించి పోక్సో చట్టం కింద కఠినంగా శిక్షించాలి’’ అని ఆయన డిమాండ్‌ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్ విద్యార్థి విభాగం కొంప ముంచిన టికెట్ గొడవ

చెక్కులు దొంగిలించి రూ.46 కోట్లు డ్రా.. తోబుట్టువులపై నటి రాధ ఫిర్యాదు

Updated Date - Sep 22 , 2026 | 02:46 AM