సీలింగ్ భూములు బడాబాబుల చెరలో!
ABN , Publish Date - Sep 22 , 2026 | 05:24 AM
ఒక వ్యక్తికి లేదా కుటుంబానికి ఎంత భూమి ఉండాలి? ఎవరైనా.. ఎన్ని ఎకరాలైనా కలిగి ఉండవచ్చా? వ్యవసాయ భూముల సీలింగ్ చట్టం అమల్లోనే ఉన్నా.. కొందరికి పరిమితికి మించి భూములు ఎలా ఉన్నాయి? రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది.
వారి స్వాధీనంలోనే ఇంకా 96 వేల ఎకరాలు
ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధికం
ఉల్లంఘన జరిగితే భూభారతి చట్టం కింద శిక్షే
అయినా.. ఏడాదిన్నరలో ఒక్క కేసూ లేదు
ఇప్పటికి 3 లక్షల ఎకరాలకుపైగా సీలింగ్ భూమి
పంపిణీ.. 1.85 లక్షల మంది లబ్ధిదారులు
ఆ భూమి వారి వద్దే ఉందా? అన్న సందేహాలు
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఒక వ్యక్తికి లేదా కుటుంబానికి ఎంత భూమి ఉండాలి? ఎవరైనా.. ఎన్ని ఎకరాలైనా కలిగి ఉండవచ్చా? వ్యవసాయ భూముల సీలింగ్ చట్టం అమల్లోనే ఉన్నా.. కొందరికి పరిమితికి మించి భూములు ఎలా ఉన్నాయి? రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి 440 ఎకరాల భూమి ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల అసెంబ్లీలో చేసిన ప్రకటనతో ఈ చర్చ జరుగుతోంది. భూ గరిష్ఠ పరిమితి చట్టం ప్రకారం.. రాష్ట్రంలో సీలింగ్ భూములను ప్రభుత్వం గతంలోనే నిర్ధారించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు పైగా సీలింగ్ భూములు ఉన్నట్లు తేల్చింది. ఇందులో 3 లక్షల ఎకరాలకు పైగా భూమిని పేదలకు పంచగా.. ఇంకా 96 వేల ఎకరాలు ఇప్పటికీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి.
అయితే భూస్వాములు, రాజకీయ నాయకుల చేతుల్లోనే సీలింగ్ భూములు బందీ అయి ఉన్నాయని, అందుకే ఈ భూములను స్వాధీనం చేసుకోవడంలో చిక్కులు ఎదురవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. ప్రభుత్వం వద్ద సీలింగ్ భూములకు సంబంధించిన పక్కా సమాచారమే లేదనే వాదనలూ ఉన్నాయి. సీలింగ్ భూముల విషయంలో 20 ఏళ్ల క్రితమే కోనేరు రంగారావు కమిటీ అనేక సిఫారసులు చేసినా.. నేటికీ అవి ఆచరణలోకి రాలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ సిఫారసులను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తమ మ్యానిఫెస్టోలో పేర్కొంది. దీంతో సీలింగ్ భూముల వివాదంపై ప్రభుత్వం పునఃసమీక్ష చేస్తుందా? ఇందుకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వబోతుంది? అన్నది చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా.. సీలింగ్ మిగులు భూములను అమ్ముకోవచ్చా? సీలింగ్ కంటే మించి ఉన్న భూమిని ప్రభుత్వానికి అప్పగించకపోతే ఏమైనా చర్యలు ఉంటాయా? కంపెనీలకు సీలింగ్‌కు మించి భూములు ఉండవచ్చా? ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? అన్న అంశాలపై చర్చ జరుగుతోంది.
పరిమితికి మించి భూమి ఉంటే..
తెలంగాణలో భూ సంస్కరణల్లో భాగంగా అమల్లోకి వచ్చిన భూ గరిష్ఠ పరిమితి చట్టం పధాన ఉద్దేశం.. పరిమితికి మించి ఉన్న భూములను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకుని భూమిలేని నిరుపేదలకు పంచడం. అయితే ఈ చట్టంపై గత 16 ఏళ్లుగా అసలు చర్చే జరగడం లేదు. చివరిగా 2010లో ఉమ్మడి ఏపీలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓసారి చర్చ జరిగింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడే దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది. సీలింగ్ భూములను వాటిపై విధించే పన్ను ఆధారంగా ఏ నుంచి కే వరకు 11 కేటగిరీలుగా విభజించారు. అందులో ‘ఏ’ కేటగిరి కింద.. రెండు పంటలు పండే తరి భూములైతే గరిష్ఠంగా 10 ఎకరాలు, ఒక పంట పండే తరి భూములైతే 15 ఎకరాలు కలిగి ఉండాలి.
‘బీ’ కేటగిరిలో.. రెండు పంటలు పండే భూమి అయితే 12 ఎకరాలు, ఒకే పంట అయితే 18 ఎకరాలు, ‘సీ’ కేటగిరిలో.. రెండు పంటలు సాగుకు అనుకూలమైతే 13.5 ఎకరాలు, ఒకే పంట అయితే 20 ఎకరాలు, ‘డీ’ కేటగిరిలో.. రెండు పంటల భూమి 15 ఎకరాలు, ఒక పంట అయితే 22.5 ఎకరాలు, ‘ఈ’ కేటగిరిలో రెండు పంటల భూమి 16.5 ఎకరాలు, ఒకే పంట అయితే 25 ఎకరాలు, ‘ఎఫ్’ కేటగిరిలో రెండు పంటల భూమి అయితే 18 ఎకరాలు, ఒకే పంట అయితే 27 ఎకరాలు, ‘కే’ కేటగిరిలో.. ఒకే పంట పండే భూమి గరిష్ఠంగా 54 ఎకరాలు మాత్రమే కలిగి ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. అయితే కాలానుగుణంగా ఈ నిబంధనలు మారాలి. భూమి క్లాసిఫికేషన్‌ను బట్టి ఏటా సమీక్ష చేయాలి. కానీ, దశాబ్దాలుగా రాష్ట్రంలో ఈ పరిస్థితిలో మార్పు లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక గత పదేళ్ల కాలంలో కోటి ఎకరాలను సాగునీటి పరిధిలోకి తెచ్చామనే ప్రకటనల నేపథ్యంలో.. భూమి స్థితిని బట్టి కేటగిరీ చేస్తే చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది.
ఖమ్మం జిల్లాలో అత్యధికంగా..
కోనేరు రంగారావు కమిటీ 2008లో ఇచ్చిన నివేదిక ప్రకారం.. తెలంగాణ పరిధిలో అధికారికంగా ప్రకటించిన వ్యవసాయ సీలింగ్ భూములు 4,42,628 ఎకరాలు. ఇందులో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమి 3,46,466 ఎకరాలు. స్వాధీనం చేసుకోవాల్సిన భూమి 96,161.96 ఎకరాలు ఉంది. మెదక్ జిల్లాలో అత్యధికంగా మిగులు భూములు ఉన్నట్లు ప్రకటించారు. ఆ జిల్లాలో 62,108 ఎకరాలు వ్యవసాయ సీలింగ్ భూమిగా చూపారు. స్వాధీనం చేసుకున్న భూమి కేటగిరీలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 53,918 ఎకరాలుంది. స్వాధీనం చేసుకోవాల్సిన భూమిలో అత్యధికంగా మిగిలిపోయిన జిల్లా ఖమ్మం. ఇక్కడ 24,237 ఎకరాల భూమి స్వాధీనం చేసుకోవాల్సిన జాబితాలో ఉంది.
తరువాత రంగారెడ్డి జిల్లా పరిధిలో 17,820 ఎకరాలు, మెదక్ పరిధిలో 15,704 ఎకరాలు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. 6 ఉమ్మడి జిల్లాల పరిధిలో కోర్టులు, న్యాయ వివాదాల కారణంగా 57,681 ఎకరాల స్వాధీనంలో జాప్యం జరుగుతోందని, పరిపాలన కారణాలతో 349 ఎకరాలు, ఇతర కారణాలతో 7,256 ఎకరాలు స్వాధీనం చేసుకోవడంలో జాప్యం ఉందని నివేదికలో పేర్కొన్నారు. ఇదే నివేదికలో పేదలకు పంచిన భూమిని 3,14,981 ఎకరాలుగా చూపారు. లబ్ధిదారుల సంఖ్య 1,85,202. ఈ భూములు నిజమైన పేదల చేతుల్లో ఉన్నాయా? లేక భూస్వాముల చేతుల్లో ఉన్నాయా? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. దీనిపై విచారణ చేస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉన్నా..
సీలింగ్ భూములను అమ్మాలన్నా, కొనుగోలు చేయాలన్నా భూగరిష్ఠ పరిమితి చట్టం సెక్షన్ 19(1) రూల్ 13 ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ సమయంలో ఫామ్-14 అందజేయాల్సి ఉంటుంది. ఇందులో ఆ వ్యక్తి లేదా కుటుంబ యూనిట్ వద్ద ఉన్న భూమి చట్టబద్ధ సీలింగ్ పరిమితికి మించి లేదని ప్రకటించాలి. డిక్లరేషన్‌లో పేర్కొన్న భూములు తప్ప.. ఇతర భూములు లేవని స్పష్టం చేయాలి. కుటుంబ సభ్యుల భూముల వివరాలను కూడా సమగ్రంగా వెల్లడించాలి. భూమి బదలాయింపు సమయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డిక్లరేషన్ దాఖలు చేయాలి. బదలాయింపుదారు వద్ద ఉన్న భూముల వివరాలను షెడ్యూల్‌లో పొందుపరచాలి. కుటుంబ సభ్యుల భూములు, సంయుక్త కుటుంబం, సహకార సంఘం, కంపెనీ, ఏదైనా సంస్థ పేరుతో భూములు ఉన్నా.. ఆ వివరాలు వెల్లడించాలి. అయితే ప్రస్తుతం ఇవేవీ అమలు కావడంలేదు. ఎవరూ డిక్లరేషన్ ఇస్తున్న దాఖలాలు లేవు. సీలింగ్ చట్టం సెక్షన్ 24 ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించాలని చట్టంలో ఉంది.
ఉల్లంఘనలపై కేసులు పెట్టాల్సి ఉన్నా..
1976 అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం 1976 ఫిబ్రవరి 17 నుంచి అమల్లో ఉంది. అయితే ప్రపంచ బ్యాంకు నిబంధనల అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీనిని 1999 మార్చి 18న రద్దు చేసింది. ఉమ్మడి ఏపీలో ఈ చట్టాన్ని రద్దు చేస్తూ 2008 మార్చి 27న శాసనసభ ఆమోదం తెలిపింది. కాగా, వ్యవసాయ భూముల గరిష్ఠ పరిమితి చట్టాన్ని 1973లో చేశారు. ఇది 1975 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. భూ గరిష్ఠ పరిమితిని నిర్ణయించి, మిగులు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ చట్టం అముల్లోనే ఉంది. భూభారతి చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం ఏ కేటగిరీ భూమి అయినా.. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తిస్తే కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
అయితే ఈ చట్టం అమల్లోకి వచ్చి ఇప్పటికి ఏడాదిన్నర దాటినా.. ఒక్క కేసు కూడా నమోదు చేసిన దాఖలాలు లేవని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. కాగా, సీలింగ్ చట్టం నిబంధనల్లో భార్య, భర్త, పెళ్లికాని పిల్లలు ఉంటే.. ఒక యూనిట్‌గా పేర్కొన్నారు. ఉమ్మడి కుటుంబంలో విభజన జరిగితే ఒక వ్యక్తికి వచ్చే భూమి వాటాను, అతని భూ పరిమితిని లెక్కించేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాలి. కుటుంబ యూనిట్‌లోని సభ్యుడు ఉమ్మడి కుటుంబ సభ్యుడిగా ఉంటే.. కుటుంబ భూమిలో అతని వాటాను, వ్యక్తిగతంగా ఉన్న భూమితో కలిపి లెక్కించాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఒక వ్యక్తి లేదా కుటుంబ సభ్యుడు సహకార సంఘం, కంపెనీ, లేదా సంస్థలో సభ్యుడైతే.. అందులోని భూమిలో అతని వాటాను కూడా వ్యక్తిగత భూమి కలిగి ఉన్న పరిమితిలో చేర్చాల్సిందే. ఇక ట్రస్టును ఏర్పాటు చేసిన వ్యక్తి దానిని రద్దు చేసిన సమయంలో ఆ ట్రస్టుకు చెందిన భూమిని అతని వారసులు కలిగి ఉన్నట్లు పరిగణిస్తారని నిబంధనల్లో పేర్కొన్నారు.
చట్టం అమలును ప్రభుత్వాలు మరిచిపోయాయి
రాష్ట్రంలో సీలింగ్ చట్టం పుస్తకాలకే పరిమితమైంది. దాని అమలును ప్రభుత్వాలు మరిచిపోయాయి. సీలింగ్ భూముల క్రయవిక్రయాలు చట్టంలోని నిబంధనల ప్రకారం జరగడం లేదు. దాని గురించి అడిగేవారూ లేరు. కోనేరు రంగారావు సిఫారసులను అమలు చేస్తే పేదలకు మంచి జరుగుతుంది. ప్రీహోల్డ్‌కు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలు ప్రకటించాలి. జనాభా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతంలో 56 శాతం కుటుంబాలకు భూమి లేదు. అలాంటి పేదలకు భూములు అందాలంటే సీలింగ్ చట్టాన్ని నిరంతరం రివిజన్ చేస్తే ఉపయోగం ఉంటుంది.
- భూమి సునీల్, భూ చట్టాల నిపుణుడు
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ-కేవైసీ చేయించలేదా..? మీ నెత్తిన గ్యాస్ బండే
పాలిటెక్నిక్ యథాతథం!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News