కర్ణాటక శాసనసభలో వందేమాతరం వివాదం
ABN , Publish Date - Sep 22 , 2026 | 03:47 AM
వందేమాతరం గేయంపై శాసనసభ వేదికగా కర్ణాటక అధికార, ప్రతిపక్షాలు తమ పార్టీల సిద్ధాంతాలను పాటించాయి. పశ్చిమ కనుమలను ప్రత్యేక సున్నిత ప్రాంతంగా (స్పెషల్ సెన్సిటివ్ ఏరియా) ప్రకటించాలని కస్తూరిరంగన్ ఇచ్చిన నివేదిక, రాష్ట్రంలో కరువుపై చర్చించేందుకు ప్రత్యేక శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.
బెంగళూరు, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): వందేమాతరం గేయంపై శాసనసభ వేదికగా కర్ణాటక అధికార, ప్రతిపక్షాలు తమ పార్టీల సిద్ధాంతాలను పాటించాయి. పశ్చిమ కనుమలను ప్రత్యేక సున్నిత ప్రాంతంగా (స్పెషల్ సెన్సిటివ్ ఏరియా) ప్రకటించాలని కస్తూరిరంగన్ ఇచ్చిన నివేదిక, రాష్ట్రంలో కరువుపై చర్చించేందుకు ప్రత్యేక శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సభా కార్యకలాపాలను ప్రారంభించేముందు వందేమాతరం గేయాన్ని సభ్యులందరూ ఆలపించడం మొదలుపెట్టారు. అయితే, అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు రెండు చరణాలకే పరిమితం కాగా, ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ సభ్యులు ఆరు చరణాలను పూర్తిగా పాడారు. ఇదే సమయంలో అధికారపార్టీ సభ్యులు రాజ్యాంగ పీఠికను చదివారు. విధానపరిషత్‌లోనూ ఇదే తరహాలో వ్యవహరించారు. ఈ విషయమై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి యతీంద్ర మాట్లాడుతూ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌లు పాల్గొనే కార్యక్రమాలను మినహాయించి మిగిలిన అన్నిచోట్ల వందేమాతరం గేయంలో రెండు చరణాలను మాత్రమే పాడాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. యతీంద్ర వ్యాఖ్యలపై ప్రతిపక్షనేత ఛలవాది నారాయణస్వామి అభ్యంతరం తెలుపుతూ... సభాపతి ప్రభుత్వానికి చెందినవారా లేదా పరిషత్‌కు చెందినవారా..? అని ప్రశ్నించారు. రాజ్యాంగ పీఠికను బీజేపీ సభ్యులు అవమానించారని కేపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ మండిపడ్డారు.