Share News

ఈ-కేవైసీ చేయించలేదా..? మీ నెత్తిన గ్యాస్‌ బండే

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:13 AM

మీరు సబ్సిడీతో వంట గ్యాస్‌ సిలిండర్‌ పొందుతున్నారా? ఇంకా ఈ-కేవైసీ చేయించలేదా? మరింత ఆలస్యం చేశారో నష్టపోతారు జాగ్రత్త! ఎందుకంటే ఈ-కేవైసీ చేయించని వంటగ్యాస్‌ వినియోగదారులకు సబ్సిడీ పథకాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ-కేవైసీ చేయించలేదా..?  మీ నెత్తిన గ్యాస్‌ బండే
LPG e-KYC

  • సబ్సిడీ కట్‌.. 5,10 కిలోల సిలిండర్లే దిక్కు

  • 5 కిలోలకు రూ.860.. 10 కిలోలకు 1760

  • ఈ-కేవైసీ చేయించుకున్న వారికి సమస్య లేదు

  • 14.2 కిలోల సిలిండర్‌ రూ.994కే..

  • ఈ-కేవైసీ కోసం 30వ తేదీ వరకు గడువు

  • ఆ తర్వాత సబ్సిడీ కట్‌.. కేంద్రం స్పష్టీకరణ

  • రాష్ట్రంలో 12 లక్షల కనెక్షన్లకు కేవైసీ పెండింగ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మీరు సబ్సిడీతో వంట గ్యాస్‌ సిలిండర్‌ పొందుతున్నారా? ఇంకా ఈ-కేవైసీ చేయించలేదా? మరింత ఆలస్యం చేశారో నష్టపోతారు జాగ్రత్త! ఎందుకంటే ఈ-కేవైసీ చేయించని వంటగ్యాస్‌ వినియోగదారులకు సబ్సిడీ పథకాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ- కేవైసీ చేసుకున్న గ్యాస్‌ వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ పథకాన్ని వర్తింపజేయాలని, నాన్‌ ఈ-కేవైసీ వినియోగదారులు ఇకమీదట మార్కెట్‌ ఽధరకు సిలిండర్లు ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబరు ఒకటో తేదీ నుంచి దీన్ని అమలుచేస్తామని ప్రకటించింది. పైగా నాన్‌ ఈ-కేవైసీ వినియోగదారులకు పెద్ద సిలిండర్లు అంటే.. ఇదివరకటిలా 14.2 కిలోల సిలిండర్లు ఇవ్వకూడదని, 5- 10 కిలోల చిన్న సిలిండర్లను సరఫరా చేయాలని గ్యాస్‌ కంపెనీలు, డీలర్లకు ఆదేశాలు జారీచేసింది.


పైగా ఈ చిన్న సిలిండర్ల కోసం నాన్‌-కేవైసీ వినియోగదారులు భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్‌ సిలిండరును సబ్సిడీ కింద రూ. 994 చొప్పున వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తిచేసుకున్న వినియోగదారులకు ఇకముందూ ఈ లెక్క ప్రకారమే సబ్సిడీ సిలిండరు సరఫరా చేస్తారు. ఈ- కేవైసీ చేసుకోని వినియోగదారులకు 5 కిలోలు, 10 కిలోల సిలిండర్లు అందుబాటులో ఉంటాయి. వీటిని మార్కెట్‌ ధరకు అంటే కిలోకు రూ.176 చొప్పున ఇస్తారు. అంటే 10 కిలోల గ్యాస్‌ సిలిండర్‌కు రూ.1760 చెల్లించాల్సి ఉంటుంది. ఐదు కిలోల సిలిండరకు అయితే రూ.860 కట్టాల్సి ఉంటుంది. సబ్సిడీ గ్యాస్‌ ధర కిలోకు రూ. 70 పడుతుండగా... మార్కెట్‌ ధరకు కొనుగోలు చేయాల్సివస్తే కిలోలకు అదనంగా రూ.106 చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీ గ్యాస్‌ కనెక్షన్ల దుర్వినియోగాన్ని ఆరికట్టేందుకే కేంద్రం ఈ-కేవైసీని అమల్లోకి తెచ్చింది.


2004కు ముందు కుటుంబం వివరాలు తీసుకొని గ్యాస్‌ కనెక్షన్‌ ఇచ్చేవారు. అప్పుడు ఒక కుటుంబానికి ఒకటికి మించి గ్యాస్‌ కనెక్షన్లు కూడా ఉండేవి. 2004 తర్వాత కేంద్రం ‘ఆధార్‌’ వ్యవస్థను తీసుకరావటం, గ్యాస్‌ కనెక్షన్‌కు ఆధార్‌ లింకు పెట్టడంతో ఒక పేరుమీద ఒకటికి మించి కనెక్షన్లు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. కొందరు వినియోగదారులు చనిపోతే వారి పేర్ల మీద ఏళ్లతరబడి కనెక్షన్లు కొనసాగుతున్నాయి. ఫోన్‌ నంబరుతో ఇతరులు కూడా గ్యాస్‌ కనెక్షన్లను వినియోగించుకుంటున్నారు. వీటన్నింటికీ ఈ-కేవైసీతో అడ్డుకట్ట వేయాలని కేంద్రం డిసైడ్‌ అయింది.


ఈ-కేవైసీ ఎలా

ఇప్పటిదాకా మీరు ఈ-కేవైసీ చేయించలేదా? అయితే ఈ ప్రక్రియ ఫాలో అవ్వండి. సబ్సిడీ వంట గ్యాస్‌ కనెక్షన్‌ ఎవరి పేరుమీద ఉంటే వారు ఏజెన్సీ వద్దకు ఆధార్‌ జిరాక్స్‌ కాపీతో వెళ్లాలి. అక్కడ ఐరిష్‌ గానీ, బయోమెట్రిక్‌ గానీ ఇచ్చి ఫొటో దిగాలి. ఆధార్‌కు అనుసంధానంగా ఉన్న మొబైల్‌ నంబరును కూడా డీలర్‌ నమోదు చేసుకుంటారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల గృహ వినియోగ గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 1.18 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లకు ఈ-కేవైసీ పూర్తయ్యింది.


ఇంకా 12 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఈ- కేవైసీ చేయకుండా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ- కేవైసీ చేసుకున్న వినియోగదారులు మాత్రమే ఇకమీదట సబ్సిడీ పథకంలో కొనసాగుతారు. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వులు కలకలం రేపుతున్నాయి. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు కూడా ఈ- కేవైసీ పూర్తిచేయాలని డీలర్లపై ఒత్తిడి చేస్తున్నాయి. డీలర్లు తమ సిబ్బందిని ఇంటింటికి పంపించి ఆధార్‌ బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ పూర్తి చేయిస్తున్నారు. వినియోగదారులు అందబాటులో లేకపోవటం, డోర్‌ లాక్‌ ఉండటంతో క్షేత్రస్థాయిలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో 12 లక్షల కనెక్షన్లకు సంబంధించి ఈ-కేవైసీ పూర్తిచేస్తే 100 శాతం లక్ష్యం నెరవేరుతుంది. దేశ వ్యాప్తంగా సబ్సిడీ వినియోగదారుల్లో 10 శాతం ఇంకా ఈ-కేవైసీ చేయించుకోలేదు.


డ్యూయల్‌ ప్రైస్‌... బుకింగ్‌ ఆప్షన్‌ ఇస్తారా? లేదా?

గృహవినియోగ గ్యాస్‌ సిలిండర్లకు డ్యూయల్‌ ప్రైస్‌ (రెండు రకాల ధరల) పద్ధతిని అమలుచేసేందుకు ఆయిల్‌ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ-కేవైసీ పూర్తిచేయని వినియోగదారులకు మార్కెట్‌ ధర ప్రకారం అక్టోబరు ఒకటో తేదీ నుంచి 5- 10 కిలోల గ్యాస్‌ సిలిండర్లు మార్కెట్‌ ధర ప్రకారం పంపిణీచేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. వినియోగదారులకు గ్యాస్‌ బుకింగ్‌ సమయంలో ఆప్షన్‌ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అంటే... నాన్‌ ఈ-కేవైసీ వినియోగదారుడు గ్యాస్‌ బుకింగ్‌ చేస్తుంటే... నాన్‌ సబ్సిడీ రేటు చూపిస్తుంది. ‘ఓకే.. కంటిన్యూ’ నొక్కితేనే మార్కెట్‌ ధరకు సిలిండర్‌ బుక్‌ అవుతుంది. అంటే వినియోగదారుడు సమ్మతిస్తేనే డ్యూయల్‌ ప్రైస్‌ అమలవుతుంది. ఈ ఆప్షన్‌పై ఇంకా స్పష్టత రాలేదని గ్యాస్‌ డీలర్లు చెబుతున్నారు.


ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై), నాన్‌- పీఎంయూవై వినియోగదారులెవరైనా ఈ- కేవైసీ పూర్తిచేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయిల్‌ కంపెనీలకు, అక్కడ నుంచి డీలర్లకు ఆదేశాలొచ్చాయి. డ్యూయల్‌ ప్రైసింగ్‌ అమలులో భాగంగా ఈ- కేవైసీ వినియోగదారులకోసం డిస్ట్రిబ్యూటర్లు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, సిలిండర్లను బాట్లింగ్‌ ప్లాంట్ల నుంచి అదే ధరకు ఇండెంట్‌ చేసి, తగినంత స్టాక్‌ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా రీఫిల్స్‌ తీసుకునే వినియోగదారులను గుర్తించి ఈ- కేవైసీని చేయించాలని, వినియోగదారులకు డ్యూయల్‌ ప్రైసింగ్‌ గూరించి ముందస్తుగా అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాయి. అక్టోబరు ఒకటో తేదీ తర్వాత నాన్‌-ఈ కేవైసీ వినియోగదారులు సిలిండర్‌ బుక్‌చేస్తే మార్కెట్‌ ధర పడుతుంది. ఆ తర్వాత ఈ-కేవైసీ పూర్తిచేస్తే మళ్లీ సబ్సిడీ పథకం వారికి కూడా వర్తిస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

అంబులెన్స్‌ అన్‌ఫిట్‌!
పాలిటెక్నిక్‌ యథాతథం!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 05:13 AM