Share News

అక్రమాస్తుల కేసులో నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ అరెస్ట్

ABN , Publish Date - Sep 22 , 2026 | 07:07 PM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ ఎన్.లక్ష్మీభాస్కర్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. కాసేపట్లో ఆయనను కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

అక్రమాస్తుల కేసులో నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ అరెస్ట్
NIMS Additional Superintendent Dr.Lakshmi Bhaskar

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ ఎన్.లక్ష్మీభాస్కర్‌ను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. కాసేపట్లో ఆయనను కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్ ఎర్రగడ్డలోని లక్ష్మీభాస్కర్ నివాసంతో పాటు మరో 7 ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లి, మణికొండ, పేట్ బషీరాబాద్ ప్రాంతాల్లో ఆయనకు ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు.


అలాగే యాదాద్రి, నందిగామ, శామీర్‌పేట్‌లో నాలుగు ఓపెన్ ప్లాట్లతో పాటు విశాఖపట్నంలో 800 చదరపు గజాల ఓపెన్ ప్లాట్ గుర్తించామని చెప్పారు. అలాగే బ్యాంకు ఖాతాల్లో రూ.41లక్షలు, పోస్టాఫీసులో రూ.12 లక్షలు డిపాజిట్ల రూపంలో ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఇక ప్రైవేట్ ఆర్థిక సంస్థల్లో రూ.35 లక్షలు, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.29.55 లక్షలు పెట్టుబడులు పెట్టినట్లు కనుగొన్నామని ఏసీబీ అధికారులు వివరించారు.


దీంతో పాటు 517.8 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారమని ఏసీబీ అధికారులు తెలిపారు. జాగ్వార్, ఆడీ, టాటా నెక్సాన్ సహా 3 కార్లు, రాయల్ ఎన్‌ఫీల్డ్, వెస్పా, యాక్టివా, యమహా వంటి నాలుగు ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు గుర్తించారమని అన్నారు. సుమారు రూ.5 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు ఉన్నాయని కూడా చెప్పారు. ఈ సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ప్రకారం లక్ష్మీభాస్కర్ మొత్తం ఆస్తుల విలువ రూ.6.13 కోట్లు ఉంటుందని లెక్కించామని పేర్కొన్నారు.


వివాదంలో ఉన్న ఓ ఫ్లాట్ కొనుగోలుకు రూ.1.30 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తమ సోదాల్లో గుర్తించామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అలాగే తన సన్నిహితులకు రూ.1.33 కోట్లు అప్పుగా లక్ష్మీభాస్కర్ ఇచ్చినట్లు గుర్తించామన్నారు. ఆయన అదనపు ఆస్తులపై వెరిఫికేషన్ కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వివరించారు.

Updated Date - Sep 22 , 2026 | 07:54 PM