Share News

పుట్టిన గంటల్లోనే నూరేళ్లు

ABN , Publish Date - Sep 23 , 2026 | 03:22 AM

ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆస్పత్రి! అందులోని ప్రత్యేక నవజాత శిశువుల (ఎస్‌ఎన్‌సీయూ) విభాగం! సోమవారం అర్ధరాత్రి! నవజాత శిశువులు నిద్రపోతున్నారు! వారిలో కొందరు అయితే.. పుట్టి కొన్ని గంటలు మాత్రమే అయింది! వారి తండ్రులు, సహాయకులు వార్డు బయట ఉన్నారు! కొందరు నిద్రలో ఉంటే..

పుట్టిన గంటల్లోనే నూరేళ్లు
Adilabad RIMS Hospital

  • ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో ఏసీ పేలి నలుగురు నవజాత శిశువుల మృతి

  • నిమిషాల్లోనే వార్డు అంతా కమ్ముకున్న దట్టమైన పొగ

  • ఊపిరాడక అక్కడికక్కడే ఓ శిశువు మృతి..

  • చికిత్స పొందుతూ మరో ముగ్గురు నవజాత శిశువుల దుర్మరణం.. ఇద్దరు విషమం

  • బిడ్డలను ఎత్తుకుని పరుగులు తీసిన తండ్రులు, సహాయకులు

  • మిగిలిన వారిని పక్క వార్డులు, సమీప ఆస్పత్రులకు తరలింపు

  • అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణకు నిపుణులతో కమిటీ

  • పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం: దామోదర

  • ఘటనపై సీఎం విచారం.. నివేదిక సమర్పించాలని ఆదేశం

ఆదిలాబాద్‌/టౌన్‌, సుభా‌ష్‌నగర్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆస్పత్రి! అందులోని ప్రత్యేక నవజాత శిశువుల (ఎస్‌ఎన్‌సీయూ) విభాగం! సోమవారం అర్ధరాత్రి! నవజాత శిశువులు నిద్రపోతున్నారు! వారిలో కొందరు అయితే.. పుట్టి కొన్ని గంటలు మాత్రమే అయింది! వారి తండ్రులు, సహాయకులు వార్డు బయట ఉన్నారు! కొందరు నిద్రలో ఉంటే.. మరికొందరు కబుర్లలో పడ్డారు! వార్డులోని వైద్య సిబ్బంది వారి వారి పనుల్లో నిమగ్నమయ్యారు! అంతలో వార్డులోని ఏసీ పేలి భారీ శబ్దం! వార్డంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి! ఈ ప్రమాదంలో వెంటిలేటర్‌పై ఉన్న.. ఇచ్చోడకు చెందిన సలీమ్‌ కుమార్తె, ఐదు రోజుల నవజాత శిశువు కన్నుమూసింది. అనంతరం, చికిత్స పొందుతూ మరో ముగ్గురు పసిపాపలు మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రిమ్స్‌ ఆస్పత్రి ఎస్‌ఎన్‌సీయూలో ఏసీ పేలడంతో చోటుచేసుకున్న విషాదమిది! అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలకు తోడు దట్టమైన పొగ కారణంగా ఊపిరాడకపోవడంతో పసిపిల్లలు మృత్యువాత పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.


ఎస్‌ఎన్‌సీయూ అంటే ప్రత్యేక నవజాత శిశువుల విభాగం. అంటే, నెలలు నిండక ముందే జన్మించడం, పుట్టుకతోనే కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని ఇక్కడ ఉంచి చికిత్స అందిస్తారు. ఇలా, 27 మంది నవజాత శిశువులు సోమవారం అర్ధరాత్రి రిమ్స్‌ ఎస్‌ఎన్‌సీయూ విభాగంలో ఉన్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఏసీ పేలడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ విభాగంలో ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. కరెంటు సరఫరా నిలిచిపోవడంతో చీకలి అలముకుంది. తండ్రులు, సహాయకులు, వైద్య సిబ్బందిలో ఆందోళన. తమ తమ బిడ్డలను ఎత్తుకుని కొంతమంది శిశువుల తండ్రులు, సహాయకులు బయటకు పరుగులు తీశారు. ఘటనతో అప్రమత్తమైన రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, పిల్లల వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని శిశువులను రక్షించే ప్రయత్నాలు చేశారు. మంటలు మిగతా వార్డులకు వ్యాపించకుండా అగ్నిమాపక శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. 108తోపాటు అక్కడే ఉండే ప్రైవేటు అంబులెన్స్‌ డ్రైవర్లు తక్షణమే స్పందించి అద్దాలను పగులకొట్టి పసివాళ్ల ప్రాణాలను కాపాడారు.


వెంటిలేటర్లపై ఉన్న నలుగురితోపాటు మిగిలిన నవజాత శిశువులను వెంటనే పక్క వార్డులకు, అక్కడి నుంచి సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గిన్నెర గ్రామానికి చెందిన కుమ్ర శేఖుబాయి, దినేశ్‌ల కుమార్తె స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రిలో మృతి చెందగా.. ఉట్నూర్‌కు చెందిన సమ్రీన్‌ కూతురు నిజామాబాద్‌కు తరలిస్తుండగా మరణించింది. అలాగే, నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేర్‌లో చికిత్స పొందుతూ నిర్మల్‌ జిల్లాకు చెందిన నవజాత శిశువు సభా పర్వీన్‌ మృతి చెందింది. ఆమెను మెరుగైన చికిత్స కోసం మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో రిమ్స్‌ నుంచి మాతా శిశు కేర్‌ సెంటర్‌కు తీసుకొచ్చారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో పిడియాట్రిక్‌ వైద్యులు డాక్టర్‌ కన్నయ్య ఆధ్వర్యంలో చికిత్స అందించారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో డాక్టర్లు శత విధాల ప్రయత్నించా రు. అయినా, ఫలితం లేకపోవడంతో ఉదయం 8 గంటలకు నవజాత శిశువు మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కన్నయ్య మాట్లాడుతూ.. నెలలు నిండకముందే శిశువు జన్మించిందని, ఇలాంటి వారిలో శ్వాసకోస ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. చాలా ప్రయత్నాలు చేసినా పాపను కాపాడలేకపోయామన్నారు.


సమగ్ర విచారణ జరిపిస్తాం: మంత్రి దామోదర

రిమ్స్‌ ఆస్పత్రిలో అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఇందుకు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, భద్రతా, నిర్వహణ లోపాలు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. విచారణలో ఎవరి నిర్లక్ష్యం లేదా బాధ్యతా రాహిత్వం బయటపడినా, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంగళవారం రిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించిన ఆయన.. అగ్ని ప్రమాదం జరిగిన నవజాత శిశు వార్డును పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘సోమవారం రాత్రి 11:40 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రాథమిక విచారణలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఏసీ యూనిట్‌లో మంటలు చెలరేగి, ఏసీకి సంబంధించిన ప్లాస్టిక్‌ భాగాలు కాలిపోవడంతో దట్టమైన పొగ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. సమగ్ర విచారణ అనంతరం పూర్తి స్పష్టత వస్తుంది’’ అని తెలిపారు. రిమ్స్‌లో మాతా, శిశు సంరక్షణ సేవలను బలోపేతం చేసేందుకు 150 పడకల భవనాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.


ఘటనపై సీఎం రేవంత్‌ విచారం

హైదరాబాద్‌: రిమ్స్‌ ఆస్పత్రిలో అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌ విచారం వ్యక్తం చేశారు. ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీవో, ఎంవీఐ, కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌..!
ఐదు డీఏలు ఇవ్వండి
Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 03:23 AM