సత్తుపల్లికి గోదారమ్మ!
ABN , Publish Date - Sep 22 , 2026 | 05:48 AM
సీతారామ ప్రాజెక్టు ద్వారా సత్తుపల్లి ప్రాంతానికి వచ్చే నెలలో గోదావరి నీటిని అందించేందుకు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. యాతాలకుంట టన్నెల్ పనులను 25 రోజుల్లో పూర్తి చేసి సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు.
వచ్చేనెలలో ‘సీతారామ’
ట్రంక్ కెనాల్ ప్రారంభం
కమలాపురం నుంచి ట్రయల్‌రన్.. అన్నదైవం ప్రాజెక్టుకు నీరు
25రోజుల్లో పనులు పూర్తి: తుమ్మల
ఖమ్మం, అశ్వారావుపేట, ములకలపల్లి, సత్తుపల్లి, సెప్టెంబరు 21: (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులను తట్టుకొని నిలబడేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు సీతారామ ప్రాజెక్టు భరోసాగా నిలవనుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. అక్టోబరులో యాతాలకుంట టన్నెల్ పనులు పూర్తిచేసి అదే నెలలో సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభింపజేసి.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతానికి గోదావరి నీటిని తీసుకొస్తామని చెప్పారు. సోమవారం ఆయన కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కమలాపురం పంపుహౌస్ వద్ద స్విచ్ ఆన్‌చేసి ట్రయల్‌రన్ నిర్వహించారు.
ఆ విధంగా అన్నదైవం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. అనంతరం పాములేరు వాగుపై నాలుగున్నర కోట్ల హైలెవెల్ బ్రిడ్జిని ప్రారంభించారు. అక్కడ నుంచి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలోని యాతాలకుంట టన్నెల పరిశీలనకు బయలుదేరారు. నాలుగున్నర కిలోమీటర్ల మేర కాలినడక ద్వారా అక్కడికి చేరుకున్నారు. టన్నెల్‌లో కొన్ని ప్రాంతాల్లోని కింది భాగంలో ఖాళీలు ఉండటంతో వాటిని కాంక్రీటుతో పూర్తిస్థాయిలో ప్యాకింగ్ చేసి పటిష్ఠం చేయాలని ఆదేశించారు. భూ సేకరణ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రూ.48 కోట్లు నిధులు మంజూరు చేశారన్నారు. యాతాలకుంట టన్నెల్ ద్వారా సత్తుపల్లి ట్రంక్‌కు గోదావరి జలాలు అందించడమే తన లక్ష్యమన్నారు. .
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీవో, ఎంవీఐ, కానిస్టేబుల్ సస్పెన్షన్..!
ఐదు డీఏలు ఇవ్వండి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News