Share News

ఐదు డీఏలు ఇవ్వండి

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:42 AM

ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఒకవైపు ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే మరోవైపు నిరవధిక సత్యాగ్రహ దీక్షను చేపట్టాలని ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) యోచిస్తోంది.

ఐదు డీఏలు ఇవ్వండి
Telangana employees DA

  • సీఎస్‌ సంజయ్‌ జాజును కోరిన

  • ఉద్యోగ సంఘాలు 2 నుంచి సత్యాగ్రహ దీక్ష!

  • ప్రభుత్వంతో చర్చిస్తూనే ఒత్తిడి పెంచే వ్యూహం

  • సమస్యల పరిష్కారంపై స్పష్టతనివ్వని సీఎస్

  • నేటి సాయంత్రం మళ్లీ భేటీ

  • సీఎస్‌ను కోరిన ఉద్యోగ సంఘాలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఒకవైపు ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే మరోవైపు నిరవధిక సత్యాగ్రహ దీక్షను చేపట్టాలని ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) యోచిస్తోంది. ఉద్యోగుల ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుండడం, మరోవైపు క్షేత్ర స్థాయిలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో జేఏసీ ఈ ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజుతో ఈ నెల 9న జరిగిన సమావేశంలో కచ్చితమైన నిర్ణయాలు తీసుకోకపోవడం, తాజాగా సోమవారం జరిగిన సమావేశంలోనూ ఏ విషయాన్ని తేల్చకపోవడంతో ఆందోళన దిశగా అడుగు వేయాలని జేఏసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.


అందులో భాగంగా గాంధీ జయంతి రోజైన అక్టోబర్‌ 2న సత్యాగ్రహ దీక్షను ప్రారంభించి, ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకునే వరకు కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈమేరకు జేఏసీలోని 206 సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తోంది. ఉద్యోగుల జేఏసీ నేతలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, సాధారణ పరిపాలనా శాఖ అధికారులతో సమావేశయ్యారు. పలు అంశాలు చర్చకు వచ్చినా దేనిపైనా నిర్దిష్టమైన నిర్ణయాన్ని తీసుకోలేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్లడమే ఇందుకు కారణం. దాంతో మంగళవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు, ఇతర నేతలు వివిధ సమస్యలను సీఎస్‌ దృష్టికి తెచ్చారు.


‘కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌)’ వర్తిస్తోన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ‘పాత పెన్షన్‌ స్కీమ్‌(ఓపీఎ్‌స)’ను అమలు చేయాలని, ఇందుకోసం త్వరలో అధ్యయన కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఐదు కరువు భత్యాల(డీఏ)ను విడుదల చేయాలని, పీఆర్సీ నివేదికను త్వరగా తెప్పించుకుని, ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్ల బిల్లులను క్లియర్‌ చేయడానికి ప్రతి నెలా రూ.2000 కోట్ల చొప్పున విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే రూ.10 వేల కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ దృష్ట్యా సెప్టెంబరు నుంచి ప్రతి నెలా రూ.2000 కోట్ల చొప్పున విడుదల చేయాలని, ఇందులో రూ.1000 కోట్లను పెన్షనర్ల బిల్లులకు, మిగతా రూ.1000 కోట్లను ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లుల క్లియరెన్స్‌కు వినియోగించాలని సూచించారు. వీటిలో ఏ ఒక్క సమస్యపైనా సీఎస్‌ స్పష్టత ఇవ్వలేదు. దాంతో. మంగళవారం సాయంత్రం 6 గంటలకు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. సీపీఎ్‌సపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ స్టేట్‌ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌(టీఎ్‌ససీపీఎ్‌సఈయూ) అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గంగాపురం స్థితప్రజ్ఞ, కల్వాల శ్రీకాంత్‌లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీవో, ఎంవీఐ, కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌..!
సీలింగ్‌ భూములు బడాబాబుల చెరలో!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 05:42 AM