తీరు మారదా జగన్!
ABN , Publish Date - Sep 23 , 2026 | 05:35 AM
రాష్ట్రంలో మద్యం అక్రమాల డొంక కదులుతుండటం, మద్యం రవాణా స్కామ్‌లో మాజీ మంత్రులు అరెస్టు అవుతున్న నేపథ్యంలోనే, రాజకీయంగా ప్రజల దృష్టి మరల్చడం కోసం మెగా డీఎస్సీ అంశం జగన్ ఎంచుకున్నారని భావిస్తున్నారు.
డీఎస్సీపై నిన్నటిదాకా రాజకీయ రచ్చ
ఇప్పుడు ఏకంగా హింసకు తెగబడుతున్న వైనం
బాధితులు లేకున్నా, అభ్యర్థులు సంతృప్తి చెందినా ఏదో జరిగిపోయిందంటూ విధ్వంసానికి కుట్రలు
న్యాయస్థానం చీవాట్లు పెట్టినా అదే పిడివాదం
నేడు గవర్నర్‌ను కలవనున్న జగన్
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మద్యం అక్రమాల డొంక కదులుతుండటం, మద్యం రవాణా స్కామ్‌లో మాజీ మంత్రులు అరెస్టు అవుతున్న నేపథ్యంలోనే, రాజకీయంగా ప్రజల దృష్టి మరల్చడం కోసం మెగా డీఎస్సీ అంశం జగన్ ఎంచుకున్నారని భావిస్తున్నారు. ఏడాది క్రితం జరిగిన డీఎస్సీ నియామకాలపై ఇప్పుడు పార్టీ కార్యకర్తలను రోడ్డు మీదకు తీసుకురావడం, టీచర్లపై హింసకు వారిని పురిగొల్పడం ఇందులో భాగమేననే రాజకీయ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. భవిష్యత్తులో మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ముఖ్యనేతలు జైలుపాలైతే .. వాటిని డీఎస్సీ ఆందోళనల ఖాతాలోకి తోసేయాలని జగన్ స్కెచ్ వేశారని పేర్కొంటున్నాయి. నిజానికి, డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలోని 372 పోస్టుల్లో అక్రమాలు జరిగాయన్న జగన్ ఆరోపణకు ప్రభుత్వ అధికారులు గట్టిగానే బదులిచ్చారు. అయినా.. విజయవాడలో సోమవారం గురువులపై వైసీపీ మూకలతో భౌతిక దాడులు జరిపించారు. వైసీపీ వేసిన వ్యాజ్యాలన్నింటినీ అత్యున్నత న్యాయస్థానాలు కొట్టేశాయి. అయినా.. రాజకీయంగా నానా యాగీ చేస్తూ, సీబీఐ విచారణ జరిపించాలని జగన్, వైసీపీ నేతలు హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను జగన్ కలవనున్నారు. సహజంగా బాధితులు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ రోడ్డెక్కుతారు. క్రమంగా ఇవి ఆందోళనలకు దారితీస్తాయి. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ విద్యార్థులు మొదట నిరసనలు వ్యక్తం చేశారు. ఆ తర్వాతే అది జన్ జీ ఉద్యమ రూపం తీసుకుంది.
దీనికి భిన్నంగా.. మెగా డీఎస్సీ పై ‘బాధితుల’మంటూ ఎవరూ బయటకు రాలేదు. అయినా.. జగన్ ‘నేనే జన్ జీ’ అంటూ వింత ప్రకటనలు చేస్తూ, తన కార్యకర్తలతో జిల్లాల్లో ఆందోళనలను జరిపిస్తున్నారు. అయితే, వాటిని జనం పట్టించుకోవడం లేదు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో వైసీపీకి పరాజయం తప్పదని జాతీయ సంస్థల సర్వేల్లో ఇప్పటికే తేలిపోయింది. దీనికితోడు ప్రజాబలం కలిగిన నాయకులు ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతున్నారు. మద్యం రవాణా కుంభకోణంలోని మనీ లాండరింగ్ కోణంపై విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావును జైలుకు పంపింది. ఇదే కేసులో మరో మాజీ మంత్రి అంబటి రాంబాబును విచారణకు పిలిచింది. దీంతో జగన్‌లో ఆత్మస్థైర్యం క్రమంగా దెబ్బతింటోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మంగళవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో జగన్ సమావేశ మయ్యారు. డీఎస్సీ ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని వైసీపీ నేతలకు జగన్ నిర్దేశించినట్టు తెలిసింది.
ఈ వార్తలనూ చదవండి...
పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..
సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం