హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం
ABN , Publish Date - Oct 26 , 2026 | 03:47 PM
హైదరాబాద్‌లో గంజాయి విక్రయాలపై ఈగల్ ఫోర్స్ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు జరిపారు. ఈ తనిఖీల్లో ఎల్‌బీఎస్ నగర్‌లో ఇంటి నుంచే గంజాయి విక్రయిస్తున్న 75 ఏళ్ల షేక్ జాతెన్ బీ అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో గంజాయి విక్రయాలపై ఈగల్ ఫోర్స్ అధికారులు ఈరోజు (సోమవారం) ఆకస్మిక దాడులు జరిపారు. ఈ తనిఖీల్లో ఎల్‌బీఎస్ నగర్‌లో ఇంటి నుంచే గంజాయి విక్రయిస్తున్న 75 ఏళ్ల షేక్ జాతెన్ బీని అరెస్ట్ చేశారు. నిందితురాలి ఇంట్లో 41 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆమె దగ్గరి నుంచి మొత్తం 179.1 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. ఈ ఆపరేషన్‌లో 70 మంది గంజాయి వినియోగదారులను గుర్తించారు. 66 మందికి వైద్య పరీక్షలు జరపగా.. ఈ పరీక్షల్లో డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్‌గా నిర్ధారించారు.
గంజాయి వినియోగదారుల్లో ముగ్గురు బాలురని, మరో 65 మందిని పునరావాస కేంద్రాలకు ఈగల్ అధికారులు తరలించారు. అలాగే, గాంధీ రిహాబిలిటేషన్ సెంటర్‌కు 45 మందిని, ఆమనగల్ కేంద్రానికి 15 మంది, కొత్తూరు కేంద్రానికి ఐదుగురిని తరలించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గంజాయి సరఫరా మూలాలు, ఇతర వ్యక్తుల పాత్రపై ఈగల్ అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలు షేక్ జాతెన్ బీపై గతంలో మరో ఏడు కేసులు ఉన్నట్లు గుర్తించారు.
గచ్చిబౌలిలో డ్రగ్స్ పట్టివేత
అలాగే, గచ్చిబౌలిలో తెలంగాణ టాస్క్‌ఫోర్స్ టీమ్ తనిఖీలు చేసి డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఖాజాగూడా సర్వీస్ రోడ్డులో డ్రగ్స్ విక్రయిస్తుండగా ఫొటోగ్రాఫర్ ఏ. సాయిరామ్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు సాయిరామ్ నుంచి 4.45 గ్రాముల MDMA డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గ్రాము రూ.10 వేల చొప్పున అతడు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి కారు, డిజిటల్ వేయింగ్ మిషన్, 2 సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు మహేశ్‌రెడ్డి, తాండ్ర హరిశ్చంద్ర కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రికి చెందినవారిగా గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగరేణిని మరింత బలోపేతం చేస్తాం: భట్టి విక్రమార్క
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై విదేశాల్లోనూ ఆదరణ పెరుగుతోంది: ఎంపీ రఘునందన్
ఎల్‌నినో ప్రభావంతో ఎండలు 50 డిగ్రీలకు చేరే అవకాశం: మంత్రి తుమ్మల
Read Latest Telangana News And AP News And National News
And Telugu News