Share News

దానం రాజకీయ ప్రస్థానం విభిన్నం..!

ABN , Publish Date - Sep 19 , 2026 | 07:45 AM

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రస్థానం చర్చనీయాంశంగా మారింది.

దానం రాజకీయ ప్రస్థానం విభిన్నం..!
Danam Nagendhar

  • పలుమార్లు పార్టీలు మారిన నాగేందర్‌

  • కాంగ్రెస్‏తో రాజకీయ జీవితం ప్రారంభం

  • ఆ తర్వాత టీడీపీ, బీఆర్‌ఎస్‏లలో చేరిక

  • తుదకు పార్టీ ఫిరాయింపుతో అనర్హత వేటు

హైదరాబాద్‌ సిటీ: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రస్థానం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ పలుమార్లు దానంపార్టీలు మారిన దాఖలాలను విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. మూడు దశాబ్దాల ఆయన రాజకీయ గమనంలో అనేక మలుపులున్నాయి. కాంగ్రె్‌సతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన దానం పలు పార్టీలు మారుతూ ఆసిఫ్ నగర్‌ నుంచి ఖైరతాబాద్‌ వరకు సాగింది. కాంగ్రెస్‌ నుంచి టీడీపీ, బీఆర్‌ఎస్‌ లో చేరిన ఆయన ఇప్పుడు తిరిగి సొంత గూటికి రావడంతో ఎమ్మెల్యే పదవి గండంగా మారింది. విజయాలు.. ఓటములు.. మంత్రి పదవి.. పార్టీ మార్పులు.. ఇలా ప్రతి దశలోనూ దానం రాజకీయ జీవితం కొత్త పరిణామాలను చవిచూసింది. న్యాయస్థానం తీర్పుతో ఆయన పదవికి దూరం కావాల్సి వచ్చింది. గ్రేటర్‌ రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు.


ఆది నుంచి..

కాంగ్రె్‌సలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన దానం నాగేందర్‌ 1994లో ఆసి్‌ఫనగర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ఓడించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1999లోనూ కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచి విజయం సాధించారు. 2004లోనూ ఆసిఫ్‌నగర్‌ ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌ శాసనసభ్యుడిగా రికార్డు సృష్టించినా.. ఆ దఫా మార్టీ మారారు. 2004లో అసెంబ్లీ టికెట్‌ నిరాకరించిన కాంగ్రెస్‌ పార్టీ.. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నుంచి పోటీ చేయాలని సూచించింది. ఈ సూచనతో విభేదించిన నాగేందర్‌ నామినేషన్‌ దాఖలు చేయాల్సిన ఆఖరిరోజు టీడీపీలో చేరారు.


ఆ పార్టీ బీ-ఫారంతో పోటీ చేసి విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో.. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న దానం తిరిగి హస్తం గూటికి చేరారు. ఈ క్రమంలో టీడీపీ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనతో ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి 2009లో దానం పోటీ చేసి గెలిచారు. అనంతరం వైద్యారోగ్యశాఖ మంత్రిగా సేవలందించారు. 2014లో కాంగ్రెస్‌ తరఫున అదే నియోజకవర్గం నుంచి బరిలో నిలవగా.. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో పరాజితులయ్యారు.


2018లో గులాబీ గూటికి..

తెలంగాణ ఏర్పాటు అనంతరం జరిగిన మొదటి ఎన్నికల్లో ఓటమి తర్వాత నాగేందర్‌ కొన్నాళ్లు మౌనంగా ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాల్లోనూ అంత చురుకుగా పాల్గొనలేదు. 2018 జూన్‌లో దానం బీఆర్‌ఎస్‌ (అప్పటి టీఆర్‌ఎస్‌) తీర్థం పుచ్చుకున్నారు. అదే ఏడాది డిసెంబరులో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా గులాబీ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2023లోనూ బీఆర్‌ఎస్‌ తరఫున విజయం సాధించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో మార్చి 17, 2024న కాంగ్రె్‌సలో చేరారు. అనంతరం అదే ఏడాది మేలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు.


city3.2.jpgఈ ఎన్నికల్లో భాగంగా దానం దాఖలు చేసిన కాంగ్రెస్‌ బీ-ఫారం పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక ఆధారంగా మారింది. దానం కాంగ్రెస్‌లో చేరారని, ఆ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారని ఆధారాలతో సహా బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సమగ్ర విచారణ జరిపిన న్యాయస్థానం నాగేందర్‌ఫై అనర్హత వేటు వేసింది.


ఎవరి లెక్కలు వారివే!

- దానం అనర్హతతో తెరపైకి ఉప ఎన్నిక

బంజారాహిల్స్‌, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై రాష్ట్ర హైకోర్టు అనర్హత వేటు వేయడంతో నియోజకవర్గ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ విషయం ఇప్పుడు రాజకీయ నాయకులకు హాట్‌ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు అంతర్మథనంలో ఉండగా.. ప్రత్యర్థి పార్టీలు ఓ వైపు సంబరాలు చేసుకుంటున్నాయి. వాట్‌ నెక్ట్స్‌ అన్న చర్చలో మునిగిపోయారు. ఉప ఎన్నిక వస్తే ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఎవ్వరి ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు.


బీఆర్‌ఎస్‏లో కొత్త ఉత్సాహమా?

హైకోర్టు తీర్పుతో బీఆర్‌ఎస్‌ నేతలకు మరోసారి దానం వ్యవహారాన్ని ప్రస్తావించే అవకాశం లభించింది. దానం బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రె్‌సలో చేరడం.. అనంతరం ఆయనపై అనర్హత పిటిషన్లు దాఖలు కావడం.. చివరకు హైకోర్టు తీర్పు రావడం వంటి పరిణామాలను బీఆర్‌ఎస్‌ వర్గాలు రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్టు మీద దానం గెలిచారు. కాబట్టి ఉప ఎన్నికలు అనివార్యం అయితే పాత సమీకరణాలను ఒక తాటి మీదకు తెచ్చుకోవాలని అధిష్ఠానం భావిస్తోంది. దానంపై చేసిన పోరాటానికి నియోజకవర్గం కైవసానికి ఉపయోగించుకునేలా సీనియర్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.


బీజేపీకి రాజకీయంగా కీలక పరిణామం

అనర్హత వ్యవహారంలో న్యాయపోరాటం చేసిన వారిలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా ఉన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో బీజేపీ శిబిరంలోనూ ఈ అంశంపై చర్చ మొదలైంది. ఖైరతాబాద్‌లో తమ రాజకీయ స్థావరాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పరిణామాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై స్థానిక నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించడం మొదలు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ లోక్‌సభలో పార్టీ సత్తా చూపించిందని, ఇది కలిసి వచ్చే అంశం అని నాయకులు అంచనాలు వేస్తున్నారు. కోర్టు తీర్పు ఒక న్యాయపరమైన పరిణామం. కానీ దాని రాజకీయ ప్రభావం మాత్రం ఖైరతాబాద్‌ వరకు పరిమితం కాకపోవచ్చన్న చర్చ సాగుతోంది. దానం నాగేందర్‌ తదుపరి న్యాయపోరాటం ఎలా ఉంటుంది? కాంగ్రెస్‌ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంది? ఆయన అనుచరులు ఎలాంటి వైఖరి తీసుకుంటారు? ప్రత్యర్థి పార్టీలు ఏ వ్యూహంతో ముందుకు వెళ్తాయి? అన్నది ఆసక్తికరంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి:

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

300 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అబద్ధం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 19 , 2026 | 07:45 AM