వ్యవసాయంతోనే ప్రపంచ గమనం
ABN , Publish Date - Sep 19 , 2026 | 06:34 AM
హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వ్యవసాయం ప్రాధాన్యాన్ని వివరించారు. ఎల్‌నినో పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలని, ఉద్యాన పంటలను ప్రోత్సహించాలని సూచించారు.
సాంకేతికత ఎంత పెరిగినా సాగుకు, రైతుకు ప్రత్యామ్నాయం లేదు..
ఆహార భద్రత, రైతుల ఆదాయం పెంపే కేంద్రం లక్ష్యాలు
ఉద్యాన పంటలకు దక్షి ణాది రాష్ట్రాల్లో అపార అవకాశాలు
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ
సదస్సులో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్
హైదరాబాద్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలో సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా వ్యవసాయానికి, రైతులకు ప్రత్యామ్నాయం కాలేవని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. రొట్టెలు యంత్రంతో చేసినా.. గోధుమలు పండించాల్సింది రైతులేనని, అందుకు వ్యవసాయం చేయాల్సిందేనని తెలిపారు. హైదరాబాద్‌లో శుక్రవారం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సు నిర్వహించారు. ఇందులో కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరితోపాటు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళం, పుదుచ్చేరి, కర్ణాటక రాష్ట్రాల వ్యవసాయశాఖల మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, కింజరపు అచ్చెన్నాయుడు, ఆర్.వినోద్, పి. ప్రసాద్, జీఎన్‌ఎ్‌స రాజశేఖరన్, పీఎం నరేంద్రస్వామి ఇతర అధికారులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడారు.
రాష్ట్రాల్లో ఏ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయనే దానితో సంబంధం లేకుండా అందరినీ కలుపుకొని వెళ్తూ దేశమే మొదటి ప్రాధాన్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కృత్రిమ మేధ, మెషీన్ లర్నింగ్, రోబోటిక్స్ లాంటి ఆధునిక సాంకేతికతలు ప్రపంచాన్ని మారుస్తున్నా వ్యవసాయానికి ప్రత్యామ్నాయం లేదని అన్నారు. పండ్లు, కూరగాయలు, ఆహార ధాన్యాలను పొలాల్లో రైతులు పండించాల్సిందేనని.. వ్యవసాయం లేకుండా ప్రపంచం నడవదని తెలిపారు. భారత్‌ను ప్రపంచానికి అన్నపూర్ణగా మార్చటమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశంలోని 140 కోట్ల మంది జనాభాకు ఆహారభద్రత కల్పించటమే మొదటి లక్ష్యమని అన్నారు. రైతుల ఆదాయం పెంచటం తమ రెండో లక్ష్యమని తెలిపారు. ప్రజలకు పోషకాహార భద్రత కల్పించటం మూడో లక్ష్యమని పేర్కొన్నారు.
వాతావరణాన్ని బట్టి పంటల ప్రణాళిక
సుగంధ ద్రవ్యాలు, కాఫీ, జీడిపప్పు, కోకో, గంధం లాంటి ఉద్యాన పంటల సాగుకు దక్షిణాది రాష్ట్రాల్లో అపార అవకాశాలున్నాయని, ఇవి పోషకాహార భద్రతకు దోహదం చేస్తాయని శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. ‘ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించాం. కాలంచెల్లిన పాత చట్టాలు, విధానాల్లో మార్పులు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు చేయాలి. వాటిని సంస్కరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది’ అని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణ, ఏపీ ముందంజలో ఉన్నాయని అన్నారు.
రైతు సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం: తుమ్మల
వ్యవసాయరంగంలో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ దేశానికేఆదర్శంగా నిలుస్తోందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. కేంద్ర ప్రభు త్వం తెచ్చిన ఫర్టిలైజర్ సేల్ ఫ్రేమ్‌వర్క్‌ను పూర్తిస్థాయిలో రాష్ట్రంలో అమలుచేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం లక్ష హెక్టార్లలో ఆయిల్‌పామ్ పంటను సాగులోకి తెచ్చిందని, ఆయిల్‌పామ్ గెలటన్నుకు రూ.25 వేల గ్యారెంటీ ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని విజ్ఞప్తిచేశారు. రైతునేస్తం కార్యక్రమం 100 ఎపిసోడ్‌లు పూర్తయిన సందర్భంగా సౌత్ జోన్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్‌లో కాఫీ టేబుల్ బుక్‌ను ఆవిష్కరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
సాయం చేస్తూ మృత్యుఒడికి..
అప్పీలుకా.. ఉప ఎన్నికకా?