అప్పీలుకా.. ఉప ఎన్నికకా?
ABN , Publish Date - Sep 19 , 2026 | 04:54 AM
దానం నాగేందర్ అనర్హత తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఖైరతాబాద్ సీటు ఖాళీగా ప్రకటిస్తే ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.
తేల్చుకోవాల్సింది దానం నాగేందరే!
నేడు స్పీకర్ చేతికి తీర్పు కాపీ
సీటు ఖాళీ అయ్యిందని స్పీకర్
ప్రకటిస్తేనే ఉపఎన్నిక నోటిఫికేషన్
ఈలోపు దానంకు సుప్రీంకోర్టును
ఆశ్రయించే వెసులుబాటు
సీటు ఖాళీ అయ్యిందని స్పీకర్ ప్రకటిస్తేనే ఉప ఎన్నికల నోటిఫికేషన్‌కు అవకాశం
ఈలోపు సుప్రీం కోర్టును
ఆశ్రయించే వెసులుబాటు
హైదరాబాద్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ధర్మాసనం వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలా? లేక ఉప ఎన్నికలను ఎదుర్కొనాలా? అన్నది ఇప్పుడు దానం నాగేందర్ తేల్చుకోవాల్సిన విషయం. సుప్రీంకోర్టును ఆశ్రయించడంపైన ఇంకా ఆలోచన చేయలేదన్న దానం నాగేందర్ ఏ వైఖరి తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లేందుకు సమయం ఇవ్వాలని దానం నాగేందర్ తరపు న్యాయవాదులు హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. అయితే దాన్ని తోసిపుచ్చిన కోర్టు తన తీర్పును వెలువరించింది
తీర్పు కాపీలు ఇటు స్పీకర్ ప్రసాద్‌కుమార్, అటు ఎన్నికల కమిషన్‌లకు ఎప్పుడు చేరతాయన్నది స్పష్టత లేదు. శనివారం కోర్టు డిస్పాచ్ సెక్షన్ పని చేస్తున్న నేపథ్యంలో ఆ రోజు సాయంత్రం కల్లా స్పీకర్ చేతికి కోర్టు తీర్పు అందే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. లేని పక్షంలో అది సోమవారం స్పీకర్‌కు చేరుతుందని అంటున్నారు. స్పీకర్ కార్యాలయం తీర్పు కాపీని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. స్పీకర్ నిర్ణయం తీసుకుని శాసనసభలో ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించి, ఎన్నికల కమిషన్‌కు పంపితే, దాని ఆధారంగా ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల జాబితాలో చేరుస్తుంది.
ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసంగా మూడు రోజులు పడుతుంది. ఈ మధ్యలో సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి దానం నాగేందర్‌కు వీలు దొరుకుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయంలో న్యాయ నిపుణులు, సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ పెద్దలతో చర్చలు జరిపిన తర్వాత దానం ఒక నిర్ణయానికి రావచ్చునని చెబుతున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం ఉంటుందా.. ఉండదా అన్నదీ ఇక్కడ చర్చనీయాంశమేనని చెబుతున్నారు. ఈ కేసులో హైకోర్టు నిర్ణయాన్నే సుప్రీంకోర్టూ సమర్థించి, స్టే ఇవ్వడానికి నిరాకరించిన పక్షంలో ఉపఎన్నికలను ఎదుర్కొనడమే మార్గం కానుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయానికి రావచ్చునని చెబుతున్నారు.
రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత రెండు ఉప ఎన్నికలు వచ్చాయి. రెండూ బీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాలే. రెండింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చనిపోవడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేష్ విజయం సాధించారు. జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గతేడాది చనిపోవడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటు గెలవని కాంగ్రెస్ నగరంలో జరిగే ఉప ఎన్నికల్లో మాత్రం తేలిగ్గా గెలుస్తోంది. దానం నాగేందర్ విషయంలోనూ సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రతికూల తీర్పు వచ్చినా నష్టమేమీ లేదన్న ధైర్యాన్ని కనబరుస్తోంది.
గతంలో మర్ని చెన్నారెడ్డికి
1968లో మర్రి చెన్నారెడ్డికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. 1967 శాసనసభ ఎన్నికల్లో తాండూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి చెన్నారెడ్డి గెలిచారు. విద్యా, ఆర్థిక శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించి చెన్నారెడ్డి ఓటర్లను ప్రలోభ పెట్టారని, మతం పేరుతో ఓట్లు అడిగారంటూ ఆయన ప్రత్యర్థి ఆర్య సమాజ ఉపాసకుడు వందేమాతరం రామచంద్రరావు ఉమ్మడి ఏపీ హైకోర్టులో కేసు వేశారు. కేసు విచారణ సమయంలో వివాదాలను నిలువరించాలన్న ఉద్దేశంతో మర్రి చెన్నారెడ్డితో ఎమ్మెల్యేగా రాజీనామా చేయించి, రాజ్యసభ సభ్యుడిగా ఎంపికచేసి, వెంటనే తన మంత్రివర్గంలో ఉక్కు, గనుల మంత్రిగా ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ అవకాశం ఇచ్చారు. ఏడాది తర్వాత కేసు చివరి విచారణలో హైకోర్టు చెన్నారెడ్డి ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించారని తేల్చింది. ఆయనను అనర్హుడిగా ప్రకటించడమేగాక ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదని 1968 ఏప్రిల్‌లో తీర్పు వెలువరించింది. దాంతో కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయడమేగాక ఆరేళ్లు ఎన్నికల్లో పోటీకి చెన్నారెడ్డి దూరంగా ఉండాల్సి వచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి
అనర్హత వేటు
చిన్నారుల అశ్లీల వీడియోలపై దర్యాప్తు సంస్థలకు నివేదిస్తాం: మెటా