Share News

ఆసియా క్రీడల్లో భారత పతాకధారులుగా మనూ భాకర్, తజీందర్‌పాల్ సింగ్

ABN , Publish Date - Sep 18 , 2026 | 01:20 PM

జపాన్‌లోని ఐచీ నగోయాలో జరగనున్న 2026 ఆసియా క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత పతాకాన్ని మను భాకర్, తజీందర్‌పాల్ సింగ్ తూర్ మోయనున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మనూ, రెండు ఆసియా క్రీడల్లో వరుసగా షాట్‌పుట్ స్వర్ణాలు గెలిచిన తూర్‌కు ఈ గౌరవం దక్కింది.

ఆసియా క్రీడల్లో భారత పతాకధారులుగా మనూ భాకర్, తజీందర్‌పాల్ సింగ్
2026 Asian Games

ఇంటర్‌నెట్ డెస్క్: జపాన్‌లోని ఐచీ నగోయాలో రేపటి నుంచి 19న ప్రారంభం కానున్న 2026 ఆసియా క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారులుగా రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత మనూ భాకర్, ఆసియా క్రీడల ప్రస్తుత చాంపియన్ తజీందర్‌పాల్ సింగ్ తూర్ ఎంపికయ్యారు. వీరిద్దరి ఎంపికను శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. భారత బృందం చీఫ్ డి మిషన్ సహదేవ్ యాదవ్ మనూ భాకర్ పేరును ప్రకటించగా, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తజీందర్‌పాల్ సింగ్ తూర్‌ను రెండో పతాకధారిగా ఖరారు చేసింది. కాగా.. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మనూ భాకర్ అద్భుత ప్రదర్శన చేసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం సాధించిన ఆమె.. సరబ్జోత్ సింగ్‌తో కలిసి మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మరో కాంస్యాన్ని సాధించింది. దీంతో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించింది.


వరుసగా రెండు ఆసియా స్వర్ణాలు తూర్ ఖాతాలో..

తజీందర్‌పాల్ సింగ్ తూర్‌కు ఆసియా క్రీడల్లో అద్భుతమైన రికార్డు ఉంది. జకార్తాలో జరిగిన 2018 ఆసియా క్రీడల్లో షాట్‌పుట్‌లో స్వర్ణం సాధించిన తూర్.. హాంగ్జౌ 2023లోనూ తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. హాంగ్జౌలో 20.36 మీటర్ల అత్యుత్తమ త్రోతో స్వర్ణం గెలిచాడు. ఐచీ నగోయాలో మూడోసారి వరుసగా ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగనున్నాడు. కాగా.. ఈ ఆసియా క్రీడల్లో మనూ భాకర్, తజీందర్‌పాల్ తూర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మన దేశం నుంచి మొత్తం 492 మంది క్రీడాకారులతో కూడిన బృందం ఈ క్రీడల్లో పాల్గొంటోంది. హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో సాధించిన రికార్డు స్థాయి 107 పతకాల ప్రదర్శనను ఈసారి కూడా కొనసాగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.


భారత్‌కు ఎదురుదెబ్బ

ఆసియా క్రీడలకు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా శిక్షణ తసమయంలో చీలమండ లిగమెంట్‌కు గాయమైంది. దీంతో ఆసియా క్రీడల నుంచి అతను వైదొలిగాడు. దీంతో అతడి 2026 సీజన్ ముందుగానే ముగిసింది.


Also Read:

పట్టభద్రుల పోరుకు కసరత్తు!

మోదీ 25 ఏళ్ల ప్రజా సేవ.. నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’: మాధవ్

Updated Date - Sep 18 , 2026 | 01:20 PM