మోదీ 25 ఏళ్ల ప్రజా సేవ.. నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’: మాధవ్
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:57 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 వసంతాల ప్రజా సేవను పూర్తి చేసుకున్నారని బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ అన్నారు.
విజయవాడ, సెప్టెంబర్ 18: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 వసంతాల ప్రజా సేవను పూర్తి చేసుకున్నారని బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల్లోకి కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, వివిధ సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నామని చెప్పారు. సమాజ సేవలో నిమగ్నమై పనిచేస్తున్న టీచర్లు, అంగన్వాడీ వర్కర్లు, శానిటరీ వర్కర్లు తదితరులను సన్మానించి వారి సేవలకు గుర్తింపు, గౌరవం కల్పిస్తామన్నారు.
యువతలోని సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ‘ఇన్నోవేషన్ ఛాలెంజ్’ నిర్వహించి, కొత్త ఆవిష్కరణలు చేస్తున్న యువతకు ప్రోత్సాహం అందించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో చిత్రలేఖనం, ఎలక్యూషన్ వంటి పోటీలు నిర్వహించేలా కార్యక్రమాలను రూపొందించామని మాధవ్ తెలిపారు. మొత్తం13 రకాల కార్యక్రమాలను నెల రోజుల పాటు నిర్వహించనున్నట్లు చెప్పారు. అక్టోబర్ 17న ఢిల్లీలో దేశవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు పాల్గొనేలా భారీ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. నిన్న(గురువారం) దేశవ్యాప్తంగా ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా నిర్వహించారని తెలిపారు.
మోదీ ప్రజా సేవకు గుర్తింపుగా, ఆయనకు భగవంతుడి ఆశీస్సులు లభించి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రజలు ఇళ్ల ముందు దీపాలు వెలిగించారని మాధవ్ అన్నారు. ‘సేవా సంకల్ప్ అభియాన్ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని.. ప్రజలందరికీ సంబంధించిన కార్యక్రమం’ అని స్పష్టం చేశారు. మోదీ కుటుంబ సభ్యులు, ప్రజలు, యువత, సేవా సంస్థలు ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని పీవీఎన్ మాధవ్ కోరారు.
ఇవి కూడా చదవండి..
నా తప్పులు దాచేస్తా.. హద్దులు దాటేస్తా!
రైలుపైకి ఎక్కి హైటెన్షన్ వైర్‌ను పట్టుకునేందుకు యత్నం.. రేణిగుంటలో ఉత్కంఠ
Read Latest AP News And Telugu News