అనర్హత వేటు
ABN , Publish Date - Sep 19 , 2026 | 04:42 AM
దానం నాగేందర్ అనర్హతపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. స్పీకర్ తీర్పును కొట్టివేసి, ఖైరతాబాద్ స్థానం ఖాళీగా నోటిఫై చేసేందుకు ఈసీకి ఆదేశాలు జారీ చేసింది.
దానంకు హైకోర్టు షాక్
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ
2024 ఏప్రిల్ 23 నుంచే తను ఎమ్మెల్యే కాదు
ఏలేటి, కౌశిక్ పిటిషన్లపై హైకోర్టు తీర్పు
దానం పార్టీ మారలేదన్న స్పీకర్ తీర్పు కొట్టివేత
ఖైరతాబాద్ ఖాళీని నోటిఫై చేయడానికి వీలుగా
తీర్పు కాపీ స్పీకర్‌కు, ఈసీకి పంపాలని ఆదేశాలు
దానం నాగేందర్ అసెంబ్లీలో విధుల్లో ఉన్నారు
తీర్పుపై అప్పీల్‌కు కాస్త సమయం ఇవ్వండి
అప్పటిదాకా తీర్పు అమలును నిలిపేయండి
దానం లాయర్ల విజ్ఞప్తి.. తోసిపుచ్చిన హైకోర్టు
తీర్పు కాపీ రాగానే ఈసీకి వాట్సాప్: సీఈవో
హైదరాబాద్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ టికెట్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొంది, కాంగ్రె్‌సలో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు శుక్రవారం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీలో చేరడంతోపాటు కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినట్లు నిరూపితం కావడంతో దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసింది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన 23 ఏప్రిల్ 2024 నుంచి ఆయన అనర్హత అమలులోకి వస్తుందని హైకోర్టు ప్రకటించింది. ‘దానం నాగేందర్ పార్టీ మారలేదు ’ అంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (పదో షెడ్యూల్ ట్రైబ్యునల్) ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌కు పూర్తి విరుద్ధంగా ఉందని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు స్పీకర్ తీర్పును కొట్టేస్తున్నట్లు ప్రకటించింది.
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను అనుమతిస్తూ తుది తీర్పు వెలువరించింది. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయిందని నోటిఫై చేయడానికి వీలుగా ఈ తీర్పు కాపీని భారత ఎన్నికల సంఘానికి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు పంపించాలని చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తీర్పు వెలువడిన వెంటనే దానం నాగేందర్ తరఫు సీనియర్ న్యాయవాదులు జోక్యం చేసుకుంటూ, దానం నాగేందర్ ప్రస్తుతం అసెంబ్లీ విధుల్లో ఉన్నారని, అప్పీల్‌కు వెళ్లడానికి తగిన సమయం ఇవ్వాలని కోరారు. అప్పీల్‌కు వెళ్లే వరకు ప్రస్తుత తీర్పు అమలును నిలుపుదల చేయాలని కోరారు. వారి అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది.
తీర్పు బుధవారం రోజే వెలువడాల్సి ఉన్నప్పటికీ తీర్పు కాపీ సిద్ధం కాకపోవడంతో శుక్రవారం వెలువడింది. పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ (ఖైరతాబాద్) సహా కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్‌పూర్), పోచారం శ్రీనివా్‌సరెడ్డి (బాన్సువాడ), తెల్లం వెంకట్‌రావు(భద్రాచలం), సంజయ్‌కుమార్ (జగిత్యాల్), అరికపూడి గాంధీ (శేరిలింగంపల్లి), టీ ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), బీ కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల్), కాలే యాదయ్య (చేవెళ్ల), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్‌చెరు) లపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీజేపీ సైతం స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. స్పీకర్ తాత్సారం చేస్తుండటంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అనర్హత పిటిషన్లపై వెంటనే విచారణ చేపట్టి తీర్పు ఇవ్వాలని స్పీకర్(పదో షెడ్యూల్ ట్రిబ్యునల్)కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో స్పీకర్ పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టి, వారెవరూ పార్టీ మారలేదని తీర్పు ప్రకటించారు. ఈ తీర్పుపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మళ్లీ బీఆర్‌ఎ్‌సలోకి రావడంతో ఆయనను వదిలేసి మిగితా తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీజేపీ సైతం హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.
దీంతో దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో రెండు పిటిషన్లు నమోదయ్యాయి. తొలుత దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా బీజేపీ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిగింది. బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది వివేక్‌రెడ్డి, అవనీశ్, బీఆర్‌ఎస్ తరఫున న్యాయవాదులు గండ్రమోహన్‌రావు, ఎస్.సంతో్‌షకుమార్, దానం నాగేందర్ తరఫున సీనియర్ న్యాయవాదులు ఏ వెంకటేశ్, గౌరవ్ అగర్వాల్ విస్తృతంగా వాదించారు. ఆగస్టు 21న తీర్పు రిజర్వు చేసిన చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. అసెంబ్లీ విధులు కొనసాగుతుండగానే ఈ తీర్పు వెలువడటం గమనార్హం. తర్వాత దశలో మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది.
కాపీ రాగానే వాట్సా్‌పలో ఈసీఐకి పంపుతాం
హైకోర్టు ఉత్తర్వు కాపీ ఇంకా తమకు అందలేదని, తమకు చేరిన వెంటనే హైకోర్టు మార్గదర్శకాల ఆధారంగా భారత ఎన్నికల సంఘానికి నివేదిక పంపాల్సి ఉంటుందని ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. తీర్పు కాపీ అందగానే తమ నోట్ జత చేసి భారత ఎన్నికల సంఘానికి వాట్సాప్ ద్వారా సమాచారం పంపుతామని చెప్పారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు చేపడతామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పాక్ తయారీ ఫెయిర్‌నెస్ క్రీములపై కేంద్రం హెచ్చరిక
చిన్నారుల అశ్లీల వీడియోలపై దర్యాప్తు సంస్థలకు నివేదిస్తాం: మెటా