Share News

హైదరాబాద్‌లోనే డెంగ్యూ వ్యాక్సిన్‌ తయారీ

ABN , Publish Date - Sep 19 , 2026 | 04:15 AM

వ్యాక్సిన్ల తయారీకి కీలక కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో మరో వ్యాక్సిన్‌ తయారు కానుంది. జపాన్‌ ఫార్మా దిగ్గజం తకేడా ఫార్మా అభివృద్ధి చేసిన ‘క్యుడెంగా’ అనే డెంగ్యూ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఈ (బీఈ) తయారు చేయనుంది. ఇందుకోసం రెండు కంపెనీల మధ్య 2024లోనే లైసెన్సింగ్‌ ఒప్పందం కుదిరింది

హైదరాబాద్‌లోనే డెంగ్యూ వ్యాక్సిన్‌ తయారీ
DENGUE

ఏటా 5 కోట్ల డోసులు..‘బయోలాజికల్‌ ఈ’తో తకెడా ఫార్మా జట్టు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వ్యాక్సిన్ల తయారీకి కీలక కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో మరో వ్యాక్సిన్‌ తయారు కానుంది. జపాన్‌ ఫార్మా దిగ్గజం తకేడా ఫార్మా అభివృద్ధి చేసిన ‘క్యుడెంగా’ అనే డెంగ్యూ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఈ (బీఈ) తయారు చేయనుంది. ఇందుకోసం రెండు కంపెనీల మధ్య 2024లోనే లైసెన్సింగ్‌ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కింద ఏటా 5 కోట్ల డోసుల డెంగ్యూ వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు బీఈ ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. 2029 నాటికి ఈ పూర్తి ఉత్పత్తి సామర్ధ్యం అందుబాటులోకి రానుంది. అప్పటి వరకు భారత మార్కెట్‌ కోసం తకేడా ఫార్మా.. జర్మనీలోని తన ప్లాంట్‌ నుంచి 5 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకుని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ద్వారా పంపిణీ చేయనుంది. ఉష్ణమండల దేశాల్లో డెంగ్యూ దోమల బెడద ఎక్కువ. దీంతో బీఈ తయారు చేసే క్యూడెంగా వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకూ ఎగుమతి చేయాలని తకేడా భావిస్తోంది. దీనికి తోడు డాక్టర్‌ రెడ్డీస్‌ ద్వారా ప్రైవేటుగా మార్కెట్‌ చేసే ఈ వ్యాక్సిన్‌ను తకెడా ఫార్మా.. సార్వత్రిక టీకా కార్యక్రమం కింద ప్రభుత్వానికీ సరఫరా చేయనుంది. దీంతో బీఈ ఉత్పత్తి చేసే క్యుడెంగా వ్యాక్సిన్‌ భారత అవసరాలకే సరిపోతుందని భావిస్తున్నారు. 2027 ప్రథమార్ధంలో ఈ టీకా మన మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. 4 సంవత్సరాల పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకూ దీన్ని రెండు డోసులుగా (ఒక్కొక్క డోసూ 0.5 మిల్లీలీటర్ల చొప్పున) ఇస్తారు. మొదటి డోసు తీసుకున్న3 నెలల తర్వాత రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్‌ వేయడానికి ముందు ఎలాంటి పరీక్షలూ చేయాల్సిన అవసరం లేదని తకేడా ఫార్మా పరిశోధకులు వెల్లడించారు.

ఈ వార్తలు కూడా చదవండి

బర్క్‌షైర్ హ్యాథవే చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న వారెన్ బఫెట్

Updated Date - Sep 19 , 2026 | 04:15 AM