సాయం చేస్తూ మృత్యుఒడికి..
ABN , Publish Date - Sep 19 , 2026 | 06:20 AM
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ట్యాంకర్ లారీ బీభత్సం సృష్టించి 108 అంబులెన్స్ సహా ఐదు వాహనాలను ఢీకొట్టింది. ప్రమాద బాధితుడికి సాయం చేస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.
అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై ట్యాంకర్ బీభత్సం
అదుపు తప్పి 108 సహా ఐదు వాహనాలను ఢీకొట్టిన వైనం
ద్విచక్రవాహనదారుడిని అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్న వ్యక్తి మృతి
108 టెక్నీషియన్‌కు తీవ్ర గాయాలు
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఘటన
మృతుడు ఏపీలోని గుంటూరు జిల్లా వ్యక్తి
మిర్యాలగూడ అర్బన్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కుటుంబంతో కలిసి కారులో హైదరాబాద్ బయలుదేరిన ఓ వ్యక్తి.. మార్గమధ్యలో ఓ రోడ్డు ప్రమాద బాధితుడికి సాయం చేసేందుకు కారు దిగి ప్రాణాలు కోల్పోయాడు. ఆ క్షతగాత్రుడిని అంబులెన్స్ ఎక్కిస్తుండగా ట్యాంకర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఆ వ్యక్తిని కబళించింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని అద్దంకి- నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై గురువారం అర్ధరాత్రి ఓ ట్యాంకర్ లారీ సృష్టించిన బీభత్సంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోలినేని శ్రీనివాసరావు(36) అనే వ్యక్తి మరణించాడు.
ఈ ఘటనలో 108 టెక్నిషీయన్ తీవ్రంగా గాయపడగా.. ఐదు వాహనాలు ధ్వంసమయ్యాయి. మృతుడి భార్య, పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దొప్పలపూడికి చెందిన పోలినేని శ్రీనివాసరావు(36) భార్య, ఇద్దరు కుమారులతో కలిసి గురువారం సాయంత్రం తన కారులో హైదరాబాద్ బయలుదేరారు. మరోపక్క, మిర్యాలగూడ హనుమాన్‌పేట కాలనీకి చెందిన బొల్లేపల్లి వెంకటేశ్వర్లు తన ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తూ గురువారం రాత్రి 12గంటల సమయంలో మిర్యాలగూడ నందిపాడు చౌరస్తా వద్ద అదుపు తప్పి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో తన కారులో అటుగా వెళుతున్న శ్రీనివాసరావు ఈ ప్రమాదాన్ని గమనించి వాహనాన్ని ఆపాడు. కారు దిగి వెంకటేశ్వర్లకు సపర్యలు చేసి 108కి సమాచారం ఇచ్చాడు.
నిమిషాల వ్యవధిలోనే అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. వెంకటశ్వర్లును 108 వాహనంలోకి ఎక్కించేందుకు అంబులెన్స్ టెక్నీషియన్‌కి శ్రీనివాసరావు సాయం చేస్తుండగా.. దూసుకొచ్చిన ఓ గ్యాస్ ట్యాంకర్ లారీ క్షణాల్లో బీభత్సం సృష్టించింది. గుంటూరు నుంచి నార్కట్‌పల్లి వైపు వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ లారీ అదుపుతప్పి ముందుగా వెళ్తున్న ఓ కారును ఢీకొట్టింది. ఆ కారు ముందున్న మరో కారును ఢీకొట్టింది. అదే క్రమంలో గ్యాస్ ట్యాంకర్ వేగంగా దూసుకెళ్లి మరో మూడు కార్లను, 108 వాహనాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లును 108వాహనంలోకి ఎక్కిస్తున్న శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. అంబులెన్స్ టెక్నీషియన్ స్వప్న తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ద్విచక్ర వాహనదారుడు వెంకటేశ్వర్లును మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘోర ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వాలి
అప్పీలుకా.. ఉప ఎన్నికకా?