కీసర సీఐ, ఎస్‌ఐ.. అవినీతి తిమింగలాలు
ABN , Publish Date - Sep 19 , 2026 | 06:13 AM
కీసర సీఐ, ఎస్‌ఐపై లంచం కేసు నేపథ్యంలో ఏసీబీ సోదాలు నిర్వహించగా నగదు, బంగారం, భూములు, ప్లాట్లకు సంబంధించిన పత్రాలు బయటపడ్డాయి. సీఐకి సంబంధించిన బ్యాంకు లాకర్‌లోనూ ఆస్తులు, ఆభరణాల పత్రాలు ఉన్నట్లు ఏసీబీ తెలిపింది.
భారీగా ఆస్తులు కూడబెట్టిన ఆ ఇద్దరు అధికారులు
రూ.15.5 లక్షల నగదు..27.5 తులాల బంగారం జప్తు
మహేశ్ బ్యాంకులో లాకర్..
అందులో సీఐ ఆస్తులు, ఆభరణాల దస్తావేజులు ?
జనగామ, వనపర్తి, సిద్దిపేట జిల్లాల్లో
ఎస్‌ఐకి 5.05 ఎకరాల భూమి
సిద్దిపేట, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల్లో
రూ.31 లక్షల విలువైన నాలుగు ప్లాట్లు స్వాధీనం
కీసర రూరల్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి భారీగా లంచం అడిగి పట్టుబడిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ సోదాల్లో తేలింది. గురువారం రాత్రి పొద్దు పోయే వరకూ జరిగిన తనిఖీల్లో ఇరువురి ఇళ్లలో రూ.15.5 లక్షల నగదు, 27.5 తులాల బంగారం ఆభరణాలు, భూ రికార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్-మన్సూరాబాద్‌లో సీఐ ఆంజనేయులు నివసిస్తున్న అద్దె ఇంట్లో 12 తులాల బంగారం, రూ.5 లక్షల నగదు జప్తు చేశారు
చంపాపేటలోని మహేశ్ బ్యాంకు లాకర్‌లో బంగారం నగలు, స్థలాల దస్తావేజులు ఉన్నట్లు ఆంజనేయులు భార్య తమ విచారణలో వెల్లడించారని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆ లాకర్‌ను తెరవాల్సి ఉందన్నారు. దేవుడి మొక్కుగా ఆంజనేయులు కుటుంబ సభ్యులు జమ చేసిన రూ.2.03 లక్షలను గుర్తించినా జప్తు చేయలేదని చెప్పారు. ఇక బోడుప్పల్‌లో నివసిస్తున్న ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ఇంట్లో రూ.10.90 లక్షల నగదు, 15.5 తులాల బంగారు నగలతోపాటు జనగామ జిల్లా నర్మెట్ట, వనపర్తి జిల్లా కేంద్రం, సిద్దిపేట జిల్లా చేర్యాల గ్రామాల్లో 5 ఎకరాల ఐదు గుంటల భూమి పత్రాలు, సిద్దిపేట జిల్లా దుద్దెడ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం కొర్రెముల గ్రామాల్లో మొత్తం రూ.31 లక్షల విలువ గల నాలుగు ఇళ్ల ప్లాట్ల పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
కీసర పోలీ్‌సస్టేషన్‌లో గతంలో ఎస్‌ఐగా పని చేసిన ఆంజనేయులు.. తిరిగి సీఐగా వచ్చిన తర్వాత అక్రమ కేసులు బనాయించి ప్రజలను ఇబ్బందుల పాల్జేసేవారన్న ఆరోపణలున్నాయి. ప్రతి కేసుకూ ఓ రేటు నిర్ణయించి డబ్బు వసూలు చేసేవారని సమాచారం. నిందితుల కళ్లలో కారం పెట్టి మరీ కొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఓ వినాయక మండపంలో లడ్డూ చోరీ ఘటనలో డిగ్రీ విద్యార్థిని అదుపులోకి తీసుకుని గంటసేపు తీవ్రంగా కొట్టారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆ విద్యార్థి తల్లిదండ్రులు వాపోయారు. ఎస్‌ఐగా వెళ్లి సీఐగా వచ్చిన తర్వాత నకిలీ డాక్యుమెంట్ల సమస్యను కొలిక్కి తేవడానికి ప్రయత్నం చేశారన్న ప్రశంసలు ఉన్నాయి. నకిలీ పత్రాలు తయారు చేస్తున్న డాక్యుమెంట్ రైటర్లు, వారికి సహకరించిన సబ్ రిజిస్ట్రార్‌నూ న్యాయస్థానం ముందు నిలిపిన సీఐ ఆంజనేయులు.. సామాన్యులపై వేధింపుల పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ వార్తలను చదవండి:
బీజేఎల్పీలో భగ్గుమన్న విభేదాలు
బంగారం అమ్మేసి భార్యకు ఐఫోన్ 18 ప్రో గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమైన భర్త!