రైతన్నపై ఎల్‌నినో పిడుగు
ABN , Publish Date - Sep 19 , 2026 | 05:27 AM
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాభావం, భూగర్భ జలాల కొరత కారణంగా పంటలు ఎండిపోతున్నాయి. పాలమూరు, ఖమ్మం, నల్లగొండ సహా పలు జిల్లాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్షాభావ పరిస్థితులు.. అడుగంటిన భూగర్భ జలాలు
సాగునీరు లేక ఎండుతున్న పంటలు
ఆపై తెగుళ్లు.. రైతులు ఆగమాగం
విధిలేక పశువులకు మేతగా పంటలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో
40 శాతం మేర ఎండిన పంటలు
నిరుటి కన్నా 4.57 లక్షల ఎకరాలు
తగ్గిన సాగు విస్తీర్ణం
ఉమ్మడి ఖమ్మంలోనూ కరువుకోరలు
పలు జిల్లాల్లో విద్యుత్తు కోతలు..
తీవ్ర ఆందోళనలో అన్నదాతలు
ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తులు
రాష్ట్రంపై ఎల్‌నినో పిడుగు పడింది. దాని ధాటికి రైతులు విలవిలలాడుతున్నారు. వానలు పడక, భూగర్భ జలాలూ లేక పంటలు ఎండిపోతుంటే, సాగు కోసం చేసిన అప్పులు కళ్ల ముందు కదలాడుతుంటే అన్నదాతలు ఆక్రందనలు చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో, వివిధ జిల్లాల్లో పంటల సాగు మీద ఎల్‌నినో ప్రభావంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.. ఎల్‌నినో ప్రభావం ఉమ్మడి పాలమూరు జిల్లాపై తీవ్రంగా ఉంది. జూన్, జూలై నెలల్లో కంటే సాగుకు కీలకమైన సెప్టెంబరు నెలలో ఏకంగా 80 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా దాదాపు 4.58 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గింది. ప్రధానమైన వరి, మొక్కజొన్న, పత్తి పంటల సాగు గణనీయంగా పడిపోయింది. గతేడాది ఉమ్మడి పాలమూరులో 21.74 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే ఈ ఏడాది 17.16 లక్షల ఎకరాలకు పరిమితమయ్యాయి.
సాగు చేసిన పంటలను రక్షించుకుందామంటే ప్రాజెక్టుల కింద నీరు విడుదల కావటం లేదు. వరిసాగు చేయొద్దని అధికారులు హెచ్చరించినప్పటికీ.. రాజకీయ ఒత్తిళ్లలో నీరు వస్తుందని భావించిన రైతులు పంటలు వేసుకోగా ఇప్పుడవి ఎండిపోతున్నాయి. ఆరుతడి పంటల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40 శాతం పంటలు ఎండిపోయాయి. మిగతా పంటల దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోనుంది. పంటలు ఎండిపోవడంతో పలుచోట్ల వరి పొలాలను పశువుల మేతకు వదిలేస్తున్నారు. బోరుబావుల కింద సాగుచేసిన పంటలకు విద్యుత్ సరఫరా పరీక్షగా మారింది.
గతంలో 18 గంటలపాటు నిరంతరంగా విద్యుత్ అందగా ఇప్పుడు కనీసం 8 గంటలు కూడా అందడం లేదు. భూగర్భజలాలు పాతాళానికి చేరుకున్నాయి. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాల్లో సగటున 28.16 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా సాగు విస్తీర్ణం 10.01 శాతం మేర తగ్గింది. సాధారణంగా 15.89 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావలసి ఉండగా ఈసారి 14.30 లక్షల ఎకరాల్లోనే రైతులు పంటలు వేశారు. 1.59 లక్షల ఎకరాల మేర పంటల సాగు తగ్గింది. వరి సాగుపై ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉంది.
ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో మాత్రమే కాస్తంత మెరుగ్గా వర్షాలు పడ్డాయి. అయితే, పంటలకు సరిపోయినంత కురవకపోవడంతో ఆ ప్రభావం ఆ జిల్లాల్లోనూ సాగుపై పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎల్‌నినో ప్రభావంతో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండలేదు. గత కొద్దిరోజులుగా ఎండ తీవ్రత పెరిగింది. దీంతో పత్తి పంట దెబ్బతినే ప్రమాదం నెలకొంది. వర్షాలు లేకుండా మరో 15 రోజులు ఇలాగే కొనసాగితే వరి పొలాలు కూడా ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఖమ్మంలో కరువు పరిస్థితులు
ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. బోర్లు, బావుల్లో నీళ్లు ఇంకిపోతున్నాయి. పాలేరు జలాశయంలో తాగునీటికే కటకటలాడాల్సిన పరిస్థితి. వైరా జలాశయాన్ని గోదావరి జలాలతో నింపినప్పటికీ పంటలకు ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు. దీంతో జిల్లాలో ఎన్నెస్పీ ఆయకట్టులో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. సాగర్ ఆయకట్టులో 12 మండలాల్లో బోర్ల కింద పత్తి పంట వేసినా నీళ్లు లేక ఒడలిపోతున్నాయి. వర్షాలు వస్తే తప్ప పంటలు చేతికందే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా విషయానికొస్తే.. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 6.10 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 37 వేల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గింది. 150మీ.మీ.ల వర్షం కురవాల్సి ఉండగా, ఇప్పటి వరకు 48 మీ.మీ.లు మాత్రమే కురిసింది. మెదక్ జిల్లాలో వాతావరణ మార్పులతో 30 వేల ఎకరాల్లో వరికి మొగి పురుగు ఆశించింది. సిద్దిపేట జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. వర్షాలు లేక 4.71 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది.
నల్లగొండలో రైతుల గోడు
ప్రాజెక్టులు, బోరుబావుల ఆధారంగా వ్యవసాయం కొనసాగించే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంటల సాగుపై ఎల్‌నినో ప్రభావం పడింది. జిల్లాలో పత్తి రైతులకు తీవ్రనష్టం వాటిల్లుతుంటే, మెట్టప్రాంతాల్లో పూర్తిగా బోరు బావుల కింద సాగుచేసిన వరి పైర్లు 40 శాతం మేర ఎండిపోతున్నాయి. కంది, పెసర, మినుము పైర్లకు కోతుల బెడదతో పంట చేతికందని దుస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8,13,444 ఎకరాల్లో బోరుబావులు, వర్షాధారంగా పత్తి సాగు చేశారు. వర్షాభావంతో పత్తి మొక్కల ఎదుగుదల పూర్తిగా నశించి, మొక్కలు అడుగు, అడుగున్నరకే పరిమితమయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పత్తి రైతులు ఈ సీజన్‌లో దాదాపుగా రూ.1200 కోట్లకు పైగా నష్టపోతున్నారనే అంచనాలున్నాయి. సాగునీరు అందుబాటులో ఉన్న ప్రాజెక్టుల కింద వరి సాగు అనుకూలంగా ఉంటే, ఇతర ప్రాంతాల్లో ఇబ్బందికరంగా మారింది.
మెట్ట ప్రాంతాల్లో బోరుబావుల కింద సాగుచేసిన దాదాపు 4.55లక్షల ఎకరాల్లో వరికి నీటి కష్టాలు మొదలయ్యాయి. సాగు చేసిన వరిలో 40శాతం వరకు ఎండిపోతోందని రైతులు వాపోతున్నారు. రంగారెడ్డి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులేమీ లేకపోవడంతో బోరుబావులపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తారు. ఈ ఖరీప్ సీజన్ ఆరంభంలో వర్షాలు కురవడంతో పంటల సాగు విస్తీర్ణం దాదాపు సగటుకు చేరుకుంది. తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో మేడ్చల్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో సాగు చేసిన పంటలు చేతికి వస్తాయా అనే సందేహంలో రైతులు ఉన్నారు. వికారాబాద్ జిల్లాలో సీజన్ ప్రారంభం నుంచి పెద్దగా వర్షాలు కురియని కారణంగా పత్తి మినహా అన్ని రకాల పంటల సాగు పూర్తిగా పడిపోయింది. 55,006 ఎకరాల మేర పంటల సాగు తగ్గింది.
నిజామాబాద్, ఆదిలాబాద్ మినహాయింపు
నిజామాబాద్ జిల్లాలో ఎల్‌నినో ప్రభావం అంతగా లేదు. గత యేడాది ఖరీ్‌ఫతో పోల్చితే ఈసారి అధికంగానే వరి సాగయింది. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 5,54,878 ఎకరాలలో రైతులు వివిధ పంటలను సాగు చేస్తున్నారు. దీంట్లో దాదాపు 4.36 లక్షల ఎకరాలు వరి. జిల్లాలో ఇప్పటి వరకు 805.1 మి.మీల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా 714.5 మి.మీల వర్షం కురిసింది. భూగర్భజలాలు సైతం ఆశించిన స్థాయిలోనే ఉన్నాయి. చెరువులు, కుంటలు 70శాతం మేర నిండుగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో పంటలపై ఎల్‌నినో ప్రభావం గత పక్షం రోజుల కిందట కనిపించింది. వారంరోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలు పంటలకు ప్రాణం పోసినట్లయింది. ఆదిలాబాద్ జిల్లాలో వానాకాల సీజన్ పంటల సాగు ఆశాజనకంగానే ఉంది. నిర్మల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షాలు సరైన సమయంలో కురవకపోవడంతో పంటల దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు.
‘గతేడాది అప్పు చేసి వ్యవసాయం చేస్తే అధిక వర్షాలకు పంట దక్కలేదు. ఈ ఏడాది మొదట్లో కురిసిన అరకొర వానలకు 6 ఎకరాల్లో కౌలు తీసుకొని పత్తి సాగు చేశాను. మొలకెత్తిన తర్వాత వర్షాలు కురవకపోవడంతో ఎకరాకు క్వింటాల్ పత్తి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తెచ్చిన అప్పులకు మిత్తి ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదు’.. గద్వాల జిల్లా చెన్నిపాడుకు చెందిన కౌలురైతు నాగరాజు ఆవేదన ఇది.
‘నాకు భర్త లేడు. ఉన్న 1.30 ఎకరాల్లో వరి సాగు చేశాను. కాలువల నుంచి నీరు రాలేదు. బోరు నుంచి పారడం లేదు. పంట మొత్తం ఎండిపోయింది. ఇప్పటివరకు రూ.50 వేలు ఖర్చయ్యింది. ఎండిన వరి పంటను చూస్తుంటే కళ్లలో నుంచి కన్నీరు కాదు రక్తం కారుతోంది. ప్రభుత్వం అధికారులను పంపించి లెక్కలు తీసి మావంటి వారిని ఆదుకోవాలి. నష్టపరిహారం ఇవ్వాలి’.. వనపర్తి జిల్లా అన్నారం తండాకు చెందిన రైతు శాంతమ్మ గోస ఇది.
ఈ వార్తలు కూడా చదవండి
నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వాలి
అప్పీలుకా.. ఉప ఎన్నికకా?