300 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అబద్ధం
ABN , Publish Date - Sep 19 , 2026 | 07:04 AM
‘‘సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌజ్ వద్ద 300 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశామని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు రుజువు చేస్తే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేం అందరం రాజీనామా చేస్తాం. కబ్జా చేయలేదని రుజువైతే సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారా?’’ అని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు సవాల్ చేశారు.
నిరూపిస్తే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం
లేదంటే సీఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా?
భూమి కొనుగోలులో ఏ చిన్న తప్పూ చేయలేదు: హరీశ్
సిద్దిపేట, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ‘‘సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌజ్ వద్ద 300 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశామని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు రుజువు చేస్తే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేం అందరం రాజీనామా చేస్తాం. కబ్జా చేయలేదని రుజువైతే సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారా?’’ అని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు సవాల్ చేశారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, అందులో భాగమే తన ఫాంహౌజ్ వద్ద కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు పర్యటించారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్ల్లవుతున్నా తమ భూములపై ఎందుకు విచారణ చేపట్టలేదని, పర్యటనల పేరిట ఇప్పుడే ఎందుకు హంగామా చేస్తున్నారని ప్రశ్నించారు. 22ఎ జాబితా, ముఖ్యమంత్రి తమ్ముళ్ల భూ కుంభకోణాలను, మంత్రి పొంగులేటి, ఆయన కొడుకు చేస్తున్న భూ దందాలను బీఆర్‌ఎస్ ఎండగడుతుండడంతో కక్షకట్టి తమపై ఎదురుదాడికి దిగుతున్నారని ఆరోపించారు. తన ఆస్తుల గురించి ప్రజలకు తెలియనిదేమీ కాదని, ప్రతి ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించానని చెప్పారు. తన ఫాంహౌజ్‌లో విలాసవంతమైన భవనాలు లేవని, కనీసం ఒక బాత్‌రూం కూడా లేదన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పర్యటన పేరుతో పోలీసు ఉన్నతాధికారులతో పాటు మొత్తం 3వేల మంది పోలీసులు, డ్రోన్ కెమెరాలు, బుల్లెట్ ప్రూఫ్ బస్సులతో ఏదో యుద్ధానికి వస్తున్నట్లు సిద్దిపేట మీదికి వచ్చారని మండిపడ్డారు. రంగనాయకసాగర్ వద్ద తాను కొనుగోలు చేసిన భూమి విషయంలో ఒక్క చిన్న తప్పు కూడా చేయలేదని, ఏదైనా తప్పు ఉన్నట్లు నిరూపిస్తే మొత్తం భూమిని ప్రభుత్వానికే వదిలేస్తానన్నారు. వెలికట్ట గ్రామంలో ఎక్స్‌సర్వీ్‌సమన్‌ల భూమికి సంబంధించిన ఎన్‌వోసీ ఇస్తేనే.. తన మామ ఆ భూమిని కొనుగోలు చేశారని చెప్పారు.