రెండే లక్ష్యాలు!
ABN , Publish Date - Nov 24 , 2026 | 03:28 AM
దేశానికి రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల చైర్మన్లకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి బీఎం సందీప్‌కుమార్ సూచించారు.
రాహుల్‌ను ప్రధానిని చేయడం
రాష్ట్రంలో మళ్లీ అధికారం
మంత్రులు, డీసీసీ అధ్యక్షులతో కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సందీప్ కుమార్
ప్రభుత్వం, పార్టీ బాగా పనిచేస్తున్నాయని వ్యాఖ్య
పార్టీలో అంతర్గత విభేదాల్లేవ్: భట్టి
వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు.. కోమటిరెడ్డి ధీమా
సీఎం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటాం
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
హైదరాబాద్, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): దేశానికి రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల చైర్మన్లకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి బీఎం సందీప్‌కుమార్ సూచించారు. రాష్ట్రంలో రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో.. మంత్రులను అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సంవిధాన్ పరిరక్షణ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల చైర్మన్లతో సందీప్‌కుమార్ సోమవారం గాంధీభవన్‌లో ముఖాముఖీ భేటీలు నిర్వహించారు. ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి, తుమ్మల, దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్‌బాబు ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం డీసీసీ అధ్యక్షులతో సందీప్‌కుమార్ మాట్లాడారు. తాను కూడా క్షేత్రస్థాయి నుంచీ కష్టపడి పైకి వచ్చినవాడినేనని, కార్యకర్త కష్టం తనకు తెలుసునని వారితో చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్త వారికి అవకాశం దక్కుతుందని, డీసీసీ అధ్యక్షుల్లో పనిచేసిన వారికి అవకాశాలు ఇస్తామని చెప్పుకొచ్చారు. ‘కష్టపడి పనిచేయడం మీ బాధ్యత.. కష్టపడినవారిని గుర్తించి బీ ఫారాలు ఇవ్వడం మా బాధ్యత’ అని స్పష్టం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో తమ ప్రభుత్వం, సంస్థాగతంగా పార్టీ బాగా పనిచేస్తున్నాయని, నాయకులంతా ఐక్యంగా ఉన్నారని అన్నారు.
సందీప్‌కుమార్‌తో భేటీ అనంతరం మంత్రులు, డీసీసీ అధ్యక్షులు కూడా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు లేవని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీ పటిష్ఠంగా ఉందని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణతో ముందుకు సాగుతోందని చెప్పారు. ఇక.. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకతా లేదని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ తామే విజయం సాధిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ‘2028 డిసెంబరులో జరిగే ఎన్నికల్లో 90 సీట్లు దాటుతాం. నా ప్లాన్ ప్రకారం 100 సీట్లు గెలుస్తాం’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
న్యాయం జరగాలి.. కార్యాచరణ చేపట్టాలి..
కాంగ్రెస్ కార్యకర్తల కష్టం, త్యాగాల వల్లే రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని మంత్రి ఉత్తమ్ అన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలని మంత్రి తుమ్మల అభిప్రాయపడగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఏ మాత్రం వ్యతిరేకత లేదని మంత్రి పొంగులేటి అన్నారు. కాగా.. సీఎం రేవంత్ నిర్దేశం మేరకు రాబోయే ఎన్నికల్లో ‘కోటి ఓట్లు- 90 సీట్లు’ సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
ఏఐసీసీ పిలుపు మేరకు 26న హైదరాబాద్‌లోని లిబర్టీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు సంవిధాన్ రక్షక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక.. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పగటి కలలు కంటున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. 500 రోజుల్లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని కేటీఆర్ చెబుతున్నారుగానీ, 5000 రోజులైనా సీఎం కాలేరని ఆయన ఎద్దేవా చేశారు. కాగా.. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పప్పు కాదు.. నిప్పు అని నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి అన్నారు. ‘సర్’ ప్రక్రియకు సంబంధించి పార్లమెంటులో రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను ఆయన డిమాండ్ చేశారు.
మమ్మల్ని చైర్‌పర్సన్లను చేయండి..
రాష్ట్రంలోని డీసీసీ అధ్యక్షులను ఆయా జిల్లా స్థాయి ప్రభుత్వ పథకాల అమలు కమిటీలకు చైర్ పర్సన్‌లుగా నియమించేందుకు చర్యలు తీసుకోవాలని సందీప్‌కుమార్‌ను డీసీసీ అధ్యక్షులు కోరారు. గాంధీభవన్‌లో ఈ మేరకు ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా.. కర్ణాటకలో అమలవుతున్న విధానాన్ని అనుసరించాలంటూ సిఫారసు చేయాల్సిందిగా వినతిపత్రంలో కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి: పవన్ కల్యాణ్
వైసీపీకి మిగిలేది కక్షలు, అప్పులే.. సోమిరెడ్డి సెటైర్లు
ఏపీలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారానికి వేళాయే..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News