మూసీ ప్రాజెక్ట్ పేరుతో రియల్ ఎస్టేట్ రాజకీయాలు చేస్తున్నారు: హరీశ్ రావు
ABN , Publish Date - Feb 22 , 2026 | 03:34 PM
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలను కాంగ్రెస్ సర్కార్ ఇబ్బందులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై(CM Revanth Reddy) మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలను కాంగ్రెస్ సర్కార్ ఇబ్బందులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. ఇవాళ(ఆదివారం) హైదర్‌షా కోట టిప్పుఖాన్ బ్రిడ్జి సమీపంలో మధుపార్క్ అపార్ట్‌మెంట్ వాసులతో హరీశ్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదర్‌షా కోటలో మూసీ బాధిత కుటుంబాలకు భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పనులు చేపడుతోందని.. అవసరమైతే కేసీఆర్ ఈ అపార్ట్‌మెంట్‌కు వస్తారని తెలిపారు. ఈ అపార్ట్‌మెంట్‌కు గతంలో కేసీఆర్ మూడుసార్లు వచ్చారని ప్రస్తావించారు. ఆ నివాస భవనం వారికిచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ పేదల బతుకులను కూల్చవద్దని ఆయన హితవు పలికారు.
ఈ అపార్ట్‌మెంట్ వారిని కాంగ్రెస్ సర్కార్ ఇబ్బంది పెట్టొద్దని ఈ సందర్భంగా హరీశ్ రావు కోరారు. పేదలకు అండగా ఉండాలని కేసీఆర్ తమను ఇక్కడకు పంపించారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పాలసీ డాక్యుమెంట్ కోసం కేసీఆర్ ఇక్కడి నుంచే ప్రణాళికలు సిద్ధం చేశారని ప్రస్తావించారు. కేసీఆర్ ఈ అపార్ట్‌మెంట్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారని.. రేవంత్ మాత్రం కూల్చేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా కేసీఆర్ పనిచేశారని చెప్పుకొచ్చారు. మూసీ మురికి పోవాలని బీఆర్ఎస్ ఎప్పుడో పని ప్రారంభించిందన్నారు. రూ. 4000 కోట్లతో ఎస్టీపీలను నిర్మించామని తెలిపారు. గోదావరి జలాలు మూసీకి తీసుకురావాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుందన్నారు. రేవంత్‌రెడ్డి ఏది చేసినా.. భూముల పంచాయతీ, రియల్ ఎస్టేట్ చేస్తారని ఆరోపించారు.
మూసీ సుందరికీరణ పేరుతో పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చేలా రేవంత్ ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే విమర్శించారు. మేఘ కృష్ణారెడ్డి, ఆదానీలకు ఇచ్చేలా ప్లాన్ చేశారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లో రేవంత్ సర్కార్ కూల్చాడాలు తప్ప ఏ ఒక్క నిర్మాణం చేపట్టలేదని మండిపడ్డారు. రూ.5 కోట్లతో ఇంకో కార్యాలయాన్ని ఓ మంత్రి కడుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. మూసీ సుందరీకరణకు తాము సహకరిస్తామని.. కానీ పేదలను కష్టాల్గోకి నెట్టొద్దని కోరారు. పిల్లలకు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయని.. ఈ సమయంలో అపార్ట్‌మెంట్‌ను కూలిస్తే.. తల్లిదండ్రులు ఆందోళన చెందుతారన్నారు. బీఆర్ఎస్ ఈ అపార్ట్‌మెంట్ వారికి అండదండగా ఉంటుందని భరోసా కల్పించారు. అసెంబ్లీలో అపార్ట్‌మెంట్ వాసుల తరఫున తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని హరీశ్ రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాగర్‌కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో తీవ్ర విషాదం..
ఇది ట్రైలర్ మాత్రమే.. షబ్బీర్ అలీకి వెంకటరమణా రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest Telangana News And AP News And Telugu News