Share News

రాహుల్‌ను కలవాలి.. రేవంత్ ద్వారా అపాయింట్‌మెంట్ కోరిన రాంచందర్ రావు

ABN , Publish Date - Jun 21 , 2026 | 01:06 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

రాహుల్‌ను కలవాలి.. రేవంత్ ద్వారా అపాయింట్‌మెంట్ కోరిన రాంచందర్ రావు
Ramchander Rao

హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy).. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు (Ramchander Rao) ఈరోజు (ఆదివారం) బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. నెరవేరని కాంగ్రెస్ గ్యారంటీలపై వినతిపత్రం సమర్పించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరారు. ఒకవేళ కాంగ్రెస్ నాయకత్వం స్పందించడంలో, అపాయింట్‌మెంట్ కల్పించడంలో విఫలమైతే, అది కాంగ్రెస్ తెలంగాణకు, ఇక్కడి ప్రజలకు చేసిన తీవ్ర ద్రోహమని పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు, గ్యారంటీల ఆధారంగానే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌పై నమ్మకం ఉంచారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతునప్పటికీ మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత, వృద్ధులు, వ్యవసాయ కార్మికులు, పేద కుటుంబాలకు ఇచ్చిన పలు కీలక హామీలని ఇంకా ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.


పేద కుటుంబాలకు నిరాశే..

మహిళలు నెలకు రూ.2,500 అందుతుందని ఆశించిన ఆర్థిక సహాయం కోసం ఇంకా ఎదురుచూస్తున్నారని రాంచందర్ రావు చెప్పుకొచ్చారు. అలాగే రైతుభరోసా కింద ఎకరాకు రూ.15,000 వస్తుందని అన్నదాతలు ఇంకా వేచి చూస్తున్నారని పేర్కొన్నారు. కౌలు రైతులు, రైతు కూలీలు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు కూడా నిరాశే ఎదురవుతోందని తెలిపారు. విద్యార్థులు, యువత పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, విద్యాభరోసా పథకం కింద ఇస్తామన్న రూ.5 లక్షల సహాయం ఇంకా ఎందుకు కార్యరూపం దాల్చలేదని నిలదీశారు. విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ పదేపదే నిరుద్యోగులకు హామీ ఇచ్చిన నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి కోసం ఇంకా ఎదురుచూస్తున్నారని తెలిపారు.


వీలైనంత త్వరగా నాకు అపాయింట్‌మెంట్ ఇప్పించాలి..

అంతేకాకుండా, వృద్ధులు నెలకు రూ.4,000 పెన్షన్ కోసం ఇంకా వేచి చూస్తున్నారని రాంచందర్ రావు అన్నారు. ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఆర్థిక సహాయాన్ని పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ, అది ఇప్పటికీ అమల్లోకి ఎందుకు రాలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు కూడా తమకు ఇస్తామన్న ఉచిత స్కూటర్ల కోసం ఇంకా వేచి చూస్తున్నారని చెప్పారు. నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, నిరాశ పెరుగుతోందని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆందోళనలను, సమస్యలను నేరుగా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లేందుకు వీలైనంత త్వరగా తనకు అపాయింట్‌మెంట్ ఇప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు రాంచందర్ రావు.


ఈ వార్తలు కూడా చదవండి...

నీట్ అభ్యర్థులు ఒత్తిడికి లోనుకాకుండా పరీక్ష రాయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

27 లక్షల మంది విద్యార్థులకు విజయ పాలు అందిస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 21 , 2026 | 01:42 PM