27 లక్షల మంది విద్యార్థులకు విజయ పాలు అందిస్తాం: భట్టి విక్రమార్క
ABN , Publish Date - Jun 20 , 2026 | 08:09 PM
పాడి రైతుకు భరోసా కల్పిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. విజయ డెయిరీకి ప్రభుత్వ అండగా ఉంటుందని మాటిచ్చారు. 27 లక్షల మంది విద్యార్థులకు ‘విజయ’ పాలు అందించేందుకు కసరత్తు చేస్తున్నామని వివరించారు.
హైదరాబాద్, జూన్ 20, (ఆంధ్రజ్యోతి): పాడి రైతుకు భరోసా కల్పిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. విజయ డెయిరీకి ప్రభుత్వ అండగా ఉంటుందని మాటిచ్చారు. 27 లక్షల మంది విద్యార్థులకు ‘విజయ’ పాలు అందించేందుకు కసరత్తు చేస్తున్నామని వివరించారు. ఈరోజు (శనివారం) సచివాలయంలో పాల సేకరణ, వినియోగంపై భట్టివిక్రమార్క ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిపై సమగ్ర నివేదిక కోరారు. ఈ సందర్భంగా మీడియాతో భట్టివిక్రమార్క మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలకు విజయ డెయిరీ పాలు అందజేస్తామని చెప్పుకొచ్చారు. పాడి రైతులకు బకాయిలు లేకుండా చెల్లింపులు చేస్తామని తెలిపారు. రైతులకు సమయానికి బిల్లులు చెల్లించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పాడి పరిశ్రమే వెన్నెముక..
పాలిచ్చే పశువుల అసలు సంఖ్య గుర్తించాలని అధికారులకు మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పాడి పరిశ్రమే వెన్నెముక అని వ్యాఖ్యానించారు. రైతులకు అదనపు ఆదాయ వనరుగా పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. పాల ధరలపై స్పష్టమైన విధానం అవసరమని అన్నారు. సంక్షేమ శాఖల నుంచే నేరుగా బిల్లుల చెల్లింపులు చేయాలని ఆదేశించారు. రైతులకు బకాయిలు లేకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని చెప్పారు. తెలంగాణలో పాల ఉత్పత్తి పెంపునకు ఆధునిక విధానాలు పాటిస్తామని వెల్లడించారు. పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ఈ చర్యలు చేపడతామని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు.. సీఎం వార్నింగ్
వీకెండ్‌లో సిరిసిల్లకు వచ్చి వెళ్లిపోతారు.. కేటీఆర్‌పై కవిత సెటైర్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News