అబద్ధాలను పోగేసి బీఆర్‌ఎస్ దుష్ప్రచారం
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:21 AM
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, విద్యుత్ సంస్థలపై బీఆర్‌ఎస్ నేతలు అబద్ధాలు పోగేసి.. దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.
యాదాద్రిలో యూనిట్ ఉత్పత్తి ఖర్చు రూ.6.66
కేటీపీఎస్‌లో ఆ వ్యయం రూ.4.67 మాత్రమే
విద్యుత్ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించం: భట్టి
హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, విద్యుత్ సంస్థలపై బీఆర్‌ఎస్ నేతలు అబద్ధాలు పోగేసి.. దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన ఆధారాలను ప్రజల ఎదుట ఉంచుతామని, యాదాద్రిపై వారానికి ఒకసారి వాస్తవాలను ప్రజాక్షేత్రంలో పెడతామని స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో బుధవారం విద్యుత్ సంస్థల అధికారులతో కలిసి భట్టి విలేకరులతో మాట్లాడారు. బొగ్గు గనులు లేని చోట యాదాద్రి ప్లాంట్ పెట్టడంతో ఒక్కో యూనిట్ ఉత్పత్తికి రూ.6.66ఖర్చు వస్తోందని, అదే పిట్‌హెడ్ (బొగ్గు గనులు ఉండే ప్రాంతం)లో కట్టిన కేటీపీఎస్(పాల్వంచ)లో యూనిట్‌కు రూ.4.67, కేటీపీపీ(భూపాలపల్లి)లో యూనిట్‌కు రూ.4.97మేర ఖర్చవుతుందని చెప్పారు.
బొగ్గు కేటాయింపులు, సరఫరా లింకేజీలను నిర్ధారించకుండానే యాదాద్రి ప్లాంట్ నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. హరీశ్‌రావు వ్యాఖ్యలు విని నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. యాదాద్రి విద్యుత్‌ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే ప్రతి యూనిట్‌పైనా అదనపు భారం పడుతోందని, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎ్‌సదే ఈ పాపమని విమర్శించారు. యాదాద్రికి ప్రత్యేకంగా కోల్ అలాట్‌మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా పీక్ విద్యుత్ డిమాండ్ దాదాపుగా 20 వేల మెగావాట్లకు చేరిందని, అయినా కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పారు. డిస్కమ్‌లు, ట్రాన్స్‌కో, జెన్‌కోలను ప్రైవేటీకరించబోతున్నారన్న ఆరోపణలను భట్టి ఖండించారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలని తాము భావిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తిని పెంచడం, కొత్త బొగ్గు బ్లాకులను సాధించడంలో గత పాలకులు నిర్లక్యంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. కొత్త బొగ్గు బ్లాకులు అందుబాటులోకి రాకపోయినా సింగరేణి పరిధిలో ఉత్పత్తి పెంచామని గుర్తుచేశారు. 2014-15లో 52.66 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగ్గా.. 2025-26లో 62.07 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించిందని చెప్పారు.
ఇవి కూడా చదవండి...
మ్యూల్ ఖాతాలిచ్చే వారిలో చదువుకున్నోళ్లే ఎక్కువ
దాహం తీరడానికి ప్రైవేటు నీళ్లే కావాలా?
ట్రైబ్యునల్ తేల్చితేనే పాలమూరు-రంగారెడ్డి!
Read Latest AP News And Telugu News