Share News

మ్యూల్‌ ఖాతాలిచ్చే వారిలో చదువుకున్నోళ్లే ఎక్కువ

ABN , Publish Date - Oct 08 , 2026 | 05:09 AM

చదవేస్తే ఉన్న మతి పోయిందని సామెత! సైబర్‌ నేరాల విషయంలో బాగా చదువుకున్నవారి పరిస్థితి ఆ సామెతకు అచ్చంగా అతికినట్టు సరిపోతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో సైబర్‌ నేరముఠాలపై సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) అధికారులు భారీ ఆపరేషన్‌ చేపట్టి, వారికి సహకరిస్తున్న 101 మందిని అరెస్టు చేశారు.

మ్యూల్‌ ఖాతాలిచ్చే వారిలో చదువుకున్నోళ్లే ఎక్కువ
cyber crime mule accounts

  • కమీషన్ల కోసం నేరగాళ్లకు సహకారం

  • దక్షిణాదిలో సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్‌లో 101మంది అరెస్టు

  • రూ.17కోట్ల లావాదేవీల గుర్తింపు

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): చదవేస్తే ఉన్న మతి పోయిందని సామెత! సైబర్‌ నేరాల విషయంలో బాగా చదువుకున్నవారి పరిస్థితి ఆ సామెతకు అచ్చంగా అతికినట్టు సరిపోతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో సైబర్‌ నేరముఠాలపై సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) అధికారులు భారీ ఆపరేషన్‌ చేపట్టి, వారికి సహకరిస్తున్న 101 మందిని అరెస్టు చేశారు. వారిలో 81 మంది మ్యూల్‌ ఖాతాదారులు (సైబర్‌ నేరగాళ్లు ఇచ్చే 5ు కమీషన్‌కు కక్కుర్తిపడి తమ బ్యాంకు ఖాతాలను వారికి అప్పజెప్పేవారు) కాగా, 19 మంది వారిని ఆ ఉచ్చులోకి దించిన ఏజెంట్లు. మిగిలిన ఒక్కడు.. సైబర్‌ నేరానికి సంబంధించిన డబ్బును ఒకచోటు నుంచి మరొక చోటుకు చేరవేస్తూ దొరికిపోయాడని సీఎ్‌సబీ డైరెక్టర్‌ శిఖా గోయల్‌ తెలిపారు.


కేరళలో 35 మందిని, ఏపీలో 22, కర్నాటకలో 17,తమిళనాడులో 14, తెలంగాణలో 12 మందిని, పుదుచ్చేరిలో ఒకరిని అరెస్టు చేసినట్టు చెప్పారు. గత నెల 23వ తేదీ నుంచి రెండు వారాలపాటు వివిధ రాష్ట్రాల్లో సీఎ్‌సబీ బృందాలు, స్థానిక పోలీసులతో కలిసి ఈ జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించాయి. వందకు మూడొందల లాభం అంటూ సైబర్‌ నేరగాళ్లు పలువురికి ఆశ చూపి రూ.కోట్లు కొల్లగొడుతున్నారని, వందకు 5 శాతం చొప్పున కమీషన్‌ ఇస్తామంటూ నమ్మించి మ్యూల్‌ఖాతాలను సేకరించి సైబర్‌ నేరాల ద్వారా సంపాదించిన సొమ్ము దారి మళ్లిస్తున్నారని గోయల్‌ వెల్లడించారు. మ్యూల్‌ ఖాతాలు ఇచ్చిన వారిలో అత్యధికులు చదువుకున్న వారే కావడం ఆందోళనకర పరిణామమని ఆమె పేర్కొన్నారు.


సైబర్‌ నేరగాళ్లకు మ్యూల్‌ ఖాతాలు ఇచ్చిన వారిలో నిరక్షరాస్యులు కేవలం 7శాతమని.. పోస్టుగ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు 16శాతం కాగా, ఇంటర్‌ చదివిన వారు 24 శాతం, వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు 23 శాతం, ప్రైవేటు ఉద్యోగులు 13 శాతం, గృహిణులు 10 శాతం, డ్రైవర్లు, ఆపరేటర్లు 7 శాతం, డిప్లోమా, ఐటీఐ చదివినవారు 4 శాతం, వృత్తిపరమైన హోదాల్లో ఉన్న వారు 3 శాతం, ప్రాథమిక విద్య చదివిన వారు 3 శాతం ఉన్నారని వివరించారు. సైబర్‌ నేరగాళ్లకు మ్యూల్‌ ఖాతాలు ఇచ్చినవారిలో.. టాటా క్యాపిటల్‌ ఉద్యోగి ఒకరు, మనీ ఎక్స్‌చేంజ్‌ వ్యాపారం చేస్తున్న మరో గ్రాడ్యుయేట్‌, ఒక మాజీ సైనికుడు ఉన్నట్టు తెలిపారు. వీరందరికీ 5 శాతం కమీషన్‌ ఆశగా చూపి సైబర్‌ నేరగాళ్లు తమ లావాదేవీల్లో వీరిని బాధ్యులని చేశారని శిఖాగోయల్‌ చెప్పారు.


తెలంగాణలో ఇదీ పరిస్థితి..

ఈ ఆపరేషన్‌ ద్వారా.. తెలంగాణలో సైబర్‌ నేరాలకు సంబంధించి నమోదైన 51కేసుల్లో పోలీసులు పురోగతి సాధించారు. దేశవ్యాప్తంగా 1,172 సైబర్‌ నేరాలకు ప్రస్తుతం అరెస్టు చేసిన వారి ఖాతాలు కారణమని, అందులో 206ఖాతాలు తెలంగాణకు చెందినవని శిఖాగోయల్‌ చెప్పారు. ఈ101 మందిలో 50మందికి దేశవ్యాప్తంగా జరిగిన 5 మేజర్‌ సైబర్‌ క్రైం కేసులతో సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు.మ్యూల్‌ బ్యాంకు ఖాతాల ద్వారా సైబర్‌ నేరగాళ్లు కొట్టేసిన డబ్బును వీరు స్వీకరించి 5శాతం కమిషన్‌ తీసుకుని సైబర్‌ నేరగాళ్లు సూచించినవారికి డబ్బు డ్రా చేసి ఇచ్చారని(లేదా) మరో ఖాతాకు బదిలీ చేశారని వివరించారు. ఈ ఖాతాల ద్వారా రూ.17కోట్ల లావాదేవీలు జరిగినట్లు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...
జోరుగా యంగ్‌ ఇండియా స్కూళ్ల నిర్మాణాలు

దాహం తీరడానికి ప్రైవేటు నీళ్లే కావాలా?
రోడ్డు ప్రమాదాల నివారణకు ‘4ఈ’ అస్త్రం
Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 05:09 AM