జోరుగా యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణాలు
ABN , Publish Date - Oct 08 , 2026 | 04:48 AM
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అయిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల (వైఐఐఆర్‌ఎస్) నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. తొలి విడతలో 105 నియోజకవర్గాల్లో ఒక్కో పాఠశాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా..
రాష్ట్రవ్యాప్తంగా 105 నియోజకవర్గాల్లో బడులు..
87 చోట్ల వివిధ దశల్లో పాఠశాలల పనులు
నిర్మాణాలకు 1,144.85 కోట్లు విడుదల..
హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అయిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల (వైఐఐఆర్‌ఎస్) నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. తొలి విడతలో 105 నియోజకవర్గాల్లో ఒక్కో పాఠశాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. వీటిలో ఇప్పటికే 87 పాఠశాలల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,144.85 కోట్లు విడుదల చేసింది. మిగిలిన 18 పాఠశాలలకు పరిపాలన అనుమతుల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇక ఆ 87 పాఠశాలలకు సంబంధించి 79 స్కూళ్ల నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తవ్వగా.. వీటిలో 70 నియోజకవర్గాల్లో కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టారు.
పాలకుర్తి, ఆసిఫాబాద్, గజ్వేల్, ముధోల్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లోని స్కూళ్ల టెండర్ల ప్రక్రియ పూర్తవ్వగా.. పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బోథ్, నిర్మల్ నియోజకవర్గాల్లో ఇంకా టెండర్ల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. ఇటు శేరిలింగంపల్లి, సిర్పూర్, కామారెడ్డి, దుబ్బాక, సిరిసిల్ల, చాంద్రాయణగుట్టలో పాఠశాలల నిర్మాణానికి అవసరమైన స్థలాలను ఇటీవలే కేటాయించారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన డీపీఆర్‌ల తయారీలో యంత్రాంగం నిమగ్నమైంది. మహబూబ్‌నగర్, మిర్యాలగూడ, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల్లో అనువైన స్థలాల కోసం అన్వేషిస్తున్నారు.
మరోవైపు.. మిగిలిన 18 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రక్రియ కూడా వేగంగా ముందుకు సాగుతోంది. కోరుట్ల, జనగామ, హుజూరారాబాద్, కరీంనగర్, అలంపూర్, సిద్దిపేట, నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్, ఎల్బీనగర్, మహేశ్వరం, సూర్యాపేట, ఉప్పల్, బాల్కొండ, నిజామాబాద్, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించిన అంచనాలు పూర్తయ్యాయి. ఈ పాఠశాలలకు త్వరలోనే పరిపాలన అనుమతులను ప్రభుత్వం మంజూరు చేయనుంది. అనంతరం టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
కార్పొరేట్‌కు దీటుగా..
గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేలా ఈ పాఠశాలలను రూపకల్పన చేశారు. తక్కువ నిర్మాణ వ్యయంతో.. అత్యాధునిక వసతులతో వీటిని నిర్మిస్తున్నారు. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన-అభ్యాసన సౌకర్యాలు, అత్యాధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, విశాలమైన డార్మిటరీలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా మైదానాలు, డైనింగ్ బ్లాక్‌లు, బోధన, బోధనేతర సిబ్బందికి నివాస గృహాలతో నిర్మిస్తున్నారు.
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో విద్యా వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ స్కూళ్ల నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తోంది. పరిపాలన అనుమతులు, టెండర్లు, నిధుల విడుదల, నిర్మాణాల పురోగతి అన్నీ సమాంతరంగా సాగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆధునిక విద్యా ప్రాంగణాలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
ఇవి కూడా చదవండి...
సర్కార్ పనితీరు ఎలా ఉంది? ఏది నచ్చింది.. ఏది నచ్చలేదు..
చికిత్సకు ముందు-తర్వాత ప్రచారం ఇక కుదరదు!
అక్టోబరు జీతంతోనే 2 డీఏలు
Read Latest AP News And Telugu News