Share News

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘4ఈ’ అస్త్రం

ABN , Publish Date - Oct 08 , 2026 | 04:56 AM

తెలంగాణలో అత్యధికంగా యాక్సిడెంట్లు జరుగుతున్న 7 జిల్లాల్లో.. రోడ్డు ప్రమాద మరణాలను సున్నాకు తేవడమే (జీరో ఫాటాలిటీ) లక్ష్యంగా పోలీసుశాఖ కార్యచరణ ప్రణాళిక రూపొందించింది.

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘4ఈ’ అస్త్రం
Telangana police

  • యాక్సిడెంట్లలో ఒక్కరూ మరణించకుండా చూడడమే లక్ష్యం

  • ఎక్కువ ప్రమాదాలు జరిగే 7 జిల్లాలపై దృషి: డీజీపీ

హైదరాబాద్‌, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అత్యధికంగా యాక్సిడెంట్లు జరుగుతున్న 7 జిల్లాల్లో.. రోడ్డు ప్రమాద మరణాలను సున్నాకు తేవడమే (జీరో ఫాటాలిటీ) లక్ష్యంగా పోలీసుశాఖ కార్యచరణ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ‘4ఈ’ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. ‘4ఈ’ అంటే.. ఎడ్యుకేషన్‌, ఇంజినీరింగ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎమర్జెన్సీ సపోర్ట్‌. ఈ అంశాలతో ప్రమాదాల నివారణకు కృషిచేస్తామని డీజీపీ సీవీ ఆనంద్‌ స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల కారణంగా రాష్ట్రంలో ఏటా ఏడువేల మందికిపైగా మృత్యువాత పడుతున్నారని, రోడ్డు ప్రమాదాల మరణాల్లో తెలంగాణ దేశంలో ఏడో స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ఏటా 1.75లక్షల మందికి పైగా మరణిస్తున్న నేపథ్యంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న 100 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి, ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను రూపొందించింది.


వాటిలో తెలంగాణకు చెందిన ఏడు జిల్లాలు ఉన్నాయి. అవి.. మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, హన్మకొండ, వరంగల్‌ జనగామ. ఆ ఏడు జిల్లాల్లో ప్రమాదాల కారణాలను విశ్లేషించి, మరణాలను తగ్గించేలా ప్రణాళిక రూపొందించేందుకు.. డీజీపీ సీవీ ఆనంద్‌ రవాణా శాఖ కమిషనర్‌ ఇలంబర్తితో కలిసి.. ఆయా జిల్లాల కలెక్టర్లు, నాలుగు పోలీసు కమిషనరేట్ల కమిషనర్లు, సంబంధిత యూనిట్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతి జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలు, మరణాలు, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల వివరాలను.. ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలను, ఏ సమయంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్న అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మార్గదర్శక్‌ పోర్టల్‌, డ్యాష్‌బోర్డులో నమోదు చేయాలని డీజీపీ సూచించారు. అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషించడం ద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, వాటి నివారణకు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ ఎలకా్ట్రనిక్‌ డిజిటల్‌ యాక్సిడెంట్‌ రిపోర్ట్‌ (ఈ-డార్‌) నమోదు చేయాలని రవాణాశాఖ కమిషనర్‌ ఇలంబర్తి అధికారులకు సూచించారు.


ఇవి కూడా చదవండి...
జోరుగా యంగ్‌ ఇండియా స్కూళ్ల నిర్మాణాలు

చికిత్సకు ముందు-తర్వాత ప్రచారం ఇక కుదరదు!
అక్టోబరు జీతంతోనే 2 డీఏలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 04:56 AM