Share News

దాహం తీరడానికి ప్రైవేటు నీళ్లే కావాలా?

ABN , Publish Date - Oct 08 , 2026 | 05:02 AM

సచివాలయంలోని అన్ని అంతస్తుల్లో ప్యూరిఫైడ్‌ ఆర్వో వాటర్‌ అందుబాటులో ఉంది. అయినా ఆ నీళ్లు తాగేవాళ్లు కొద్దిమందే. అంతా బయటినుంచి తెచ్చిన మంచినీళ్లే వాడుతారు.

దాహం తీరడానికి ప్రైవేటు నీళ్లే కావాలా?
Telangana Secretariat

  • ఆర్వో వాటర్‌ ప్రొవిజన్‌ ఉన్నా ప్రైవేటు నుంచి మంచినీళ్ల కొనుగోలు

  • సచివాలయంలో అన్ని శాఖల్లో అదే తీరు

  • ఇందుకోసం నెలకు రూ.లక్షల్లో బిల్లులు

  • ఒక శాఖ పేషీకి 5 నెలలు వాటర్‌ సరఫరా చేసిన ఏజెన్సీకి రూ.91,400 చెల్లింపు

  • విజయ డెయిరీ, ఆర్టీసీకి ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉన్నా పట్టించుకోని వైనం

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): సచివాలయంలోని అన్ని అంతస్తుల్లో ప్యూరిఫైడ్‌ ఆర్వో వాటర్‌ అందుబాటులో ఉంది. అయినా ఆ నీళ్లు తాగేవాళ్లు కొద్దిమందే. అంతా బయటినుంచి తెచ్చిన మంచినీళ్లే వాడుతారు. అవి కూడా ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న సంస్థల్లోని ప్లాంట్లకు చెందినవా అంటే కాదు. పూర్తిగా ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ప్రైవేటు కంపెనీలకు చెందిన నీళ్ల బాటిళ్లే. కమిషనరేట్‌లు, డైరెక్టర్‌ కార్యాలయాల్లో కొన్నిచోట్ల ప్యూరిఫైడ్‌ వాటర్‌ సౌకర్యమే లేకపోవడం గమనార్హం. అలాంటి చోట్ల పూర్తిగా ప్రైవేటు వాటర్‌ బాటిళ్లనే వాడుతున్నారు. ఒక శాఖకు చెందిన పేషీ, మంత్రి కార్యాలయం, మంత్రుల నివాస సముదాయం, కమిషనరేట్‌, డైరెక్టరేట్లలో సింహభాగం ప్రైవేటు కంపెనీలకు చెందిన వాటర్‌ బాటిళ్లు(150 మి.లీ), 25 లీటర్ల క్యాన్లతో వచ్చే నీళ్లను ఆర్డర్‌ చేస్తున్నారు.


ఈ నీళ్లను ప్రత్యేకంగా కొన్ని ఏజెన్సీల ద్వారా తెప్పించుకుంటున్నారు మంచినీళ్ల కోసం చేయాల్సిన చెల్లింపులే నెలకు రూ.లక్షల్లో ఉంటున్నాయి. బిల్లులు చెల్లించడంలేదన్న కారణంగా ప్రైవేటు ఏజెన్సీలు సచివాలయంలోని పలు పేషీలు, మంత్రుల చాంబర్‌లకు సరఫరా చేసే వాటర్‌ బాటిల్స్‌, క్యాన్లను నిలిపివేయడం తాజాగా చర్చనీయాంశమైంది. సచివాలయంలో ప్రతి అంతస్తులో ప్యూరిఫైడ్‌ వాటర్‌ డ్రింకింగ్‌ ఫ్రిడ్జ్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఎవరూ వాటిని వినియోగించడం లేదు. ముఖ్యమైన సమావేశాలు, అతిథులు వచ్చినప్పుడు ఇవ్వడానికి మాత్రమే గతంలో ప్రైవేటు వాటర్‌ ఎక్కువగా వినియోగించేవారని, ఇప్పుడు అందరూ వాటినే వాడుతున్నారని సచివాలయవర్గాలు చెబుతున్నాయి.


3 ప్రభుత్వ సంస్థల్లో సొంత ప్లాంట్లు

పశుసంవర్థక శాఖకు అనుబంధంగా ఉండే విజయ డెయిరీ ‘విజయ’ పేరుతో మంచినీటి ప్లాంట్‌ను ఏర్పాటుచేసింది. పశు సంవర్థక శాఖ పేషీ, మంత్రి కార్యాలయంతో పాటు కొన్ని కొన్ని కార్యాలయాలకు తప్ప పెద్దగా విజయ వాటర్‌ ఎక్కడా కనిపించడంలేదు. ఒక్కోసారి సంబంధిత మంత్రి కార్యాలయంలో కూడా ప్రైవేటు వాటరే వాడుతున్నారన్న చర్చ ఉంది. ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ కూడా వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేసింది. ‘కిన్నెర’ పేరుతో వాటర్‌ సేల్స్‌ చేయాలని భావించినా సాధ్యం కాలేదు. రవాణా శాఖకు అనుబంధంగా ఉండే ఆర్టీసీ కూడా సొంత వాటర్‌ ప్లాంట్‌ను నెలకొల్పింది. ‘జీవా’ పేరుతో మార్కెట్‌లోకి రావాలని లక్ష్యం ఉన్నా ఆర్టీసీ బస్సుల వరకే పరిమితమైంది. ప్రభుత్వ శాఖలు, పేషీలు, మంత్రుల కార్యాలయాలకు వెళ్తున్న ప్రైవేటు మంచినీళ్ల స్థానంలో ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న సంస్థల్లోని వాటర్‌ ప్లాంట్‌లకు ఆర్డర్లు చేస్తే చెల్లించే బిల్లులు ప్రభుత్వ సంస్థలకే వెళ్తాయని తద్వారా ప్రజాధనం వృథా కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


నెలకు రూ.లక్షల్లో చెల్లింపులు

వాటర్‌ బాటిళ్ల కోసం నెలకు రూ.లక్షల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రైవేటు ఏజెన్సీలు సరఫరా చేసే మంచినీళ్ల బిల్లును అదనంగా వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. బిల్లులు సమయానికి అందవన్న కారణంగా అదనపు ధరలు తీసుకుంటారన్న చర్చ ఉంది. అంతేకాదు ఆర్డర్‌ ప్రకారం వేసే 25లీటర్ల క్యాన్లు, 150మి.లీటర్ల బాటిళ్ల లెక్కల్లోనూ తేడాలుంటాయనితెలుస్తోంది. ఏదైనా ఒక పేషీ 100క్యాన్లను కావాలని ఆర్డర్‌ చేసిందనుకుంటే..70-80 క్యాన్లే వేసి, 100క్యాన్లు వేశామని చెప్తుంటారని సమాచారం.


ఇవి కూడా చదవండి...
జోరుగా యంగ్‌ ఇండియా స్కూళ్ల నిర్మాణాలు

చికిత్సకు ముందు-తర్వాత ప్రచారం ఇక కుదరదు!
రోడ్డు ప్రమాదాల నివారణకు ‘4ఈ’ అస్త్రం
Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 05:02 AM